Chief Minister Jagan Distributed Jagananna Vidya Kanuka Kits at Adoni in Kurnool District - Sakshi
Sakshi News home page

Jagananna Vidya Kanuka: రూ.931.02 కోట్లతో.. జగనన్న విద్యాకానుక

Published Tue, Jul 5 2022 3:53 AM | Last Updated on Tue, Jul 5 2022 9:25 PM

Jagananna Vidya Kanuka Kits Distribution AP Govt School Students - Sakshi

సాక్షి, అమరావతి: వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజు జూలై 5న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఇవి అందనున్నాయి. ఇందుకోసం రూ.931.02 కోట్లను ప్రభుత్వం వ్యయం చేస్తోంది. 

విద్యపై వ్యయం భవిష్యత్తుకు పెట్టుబడి
విద్యపై పెట్టే వ్యయం విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి అనే మహోన్నత ఆశయంతో సీఎం జగన్‌ ఏటా విద్యారంగానికి బడ్జెట్‌లో రూ.వేల కోట్లు కేటాయిస్తున్నారు. విద్యార్థుల అభ్యసనానికి అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందులో భాగంగా.. జగనన్న విద్యాకానుక కింద బడులు తెరిచిన తొలిరోజే ప్రతి విద్యార్థికీ ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్‌ (కుట్టుకూలితో సహా), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగ్యువల్‌ (తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఉండే) పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందిస్తుంది. గతంలో అందుకోని వారు, ప్రస్తుతం కొత్తగా చేరిన వారికి మాత్రమే ఈ డిక్షనరీలను ఇస్తారు. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు కిట్లను అందజేస్తారు.  

మూడేళ్లలో జేవీకే కింద రూ.2,368.33 కోట్లు వ్యయం
జగనన్న విద్యాకానుక కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రూ.931.02 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్కో కిట్‌ విలువ దాదాపు రూ.రెండువేలు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు తెలిసినవే. వీటన్నింటి ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు ఏటా పెరుగుతున్నాయి. పలుచోట్ల ‘సీట్లు లేవు’ అన్న బోర్డులు పెట్టే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. నిజానికి.. గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫార్మ్‌ల సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల ఊసేలేదు. ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ సీఎం జగన్‌ పాఠశాలలు తెరిచిన రోజు నుండే జగనన్న విద్యా కానుక కిట్‌ అందిస్తున్నారు.  

విద్యాకానుకలో నాణ్యతకు పెద్దపీట
వస్తువుల నాణ్యతలో రాజీలేకుండా బ్రాండెడ్‌ వస్తువులనే పంపిణీ చేయించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయా వస్తువులను, నాణ్యతను ముందుగా తాను స్వయంగా పరిశీలిస్తున్నారు. తొలి రెండేళ్లలో బాలురు, బాలికలకు వేర్వేరు స్కూలు బ్యాగులను పంపిణీ చేయించారు. కానీ, ఈసారి అందరికీ ఒకేరకమైన బ్యాగులను అందిస్తున్నారు. అంతేకాక.. జనరల్‌ నాలెడ్జిని పెంపొందించేలా ఉండే కవర్‌ పేజీలతో నోట్‌బుక్స్‌ను అందిస్తున్నారు. యూనిఫారం నాణ్యత విషయంలోనూ రాజీపడకుండా అందిస్తోంది. ఈ విద్యాకానుక వస్తువుల పంపిణీలో ఏవైనా సందేహాలుంటే 9908696785 నెంబర్‌కు పనివేళల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే, cmo.apsamagrashiksha@gmail.com లేదా spdapssapeshi@gmail.comకు తెలియచేయాలన్నారు. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలనూ జారీచేశారు.

కార్యక్రమంలో ఆదోని శాసన సభ్యులు సాయిప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ పాదయాత్రంలో ప్రజల కష్టాలను జగన్‌ చూశారు. ఇచ్చిన హామీలన్నింటిని సీఎం జగన్‌ నెరవేర్చారు. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు. సీఎం జగన్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. నాడు-నేడు కింద​ సీఎం జగన్‌ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు.

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడతూ.. వరుసగా మూడో విడత విద్యాకానుకను అందిస్తున్నాం. 47 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాకానుకను ఇస్తున్నాం. విద్యాకానుక కోసం ఈ ఏడాది రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నేడు ఇచ్చే విద్యాకానుకతో కలిపి ఇప్పటివరకూ మొత్తంగా రూ.2,368 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేశాం. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్‌ ఉండాలని సీఎం చెప్పారు. ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్లు. అక్టోబర్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేస్తామని మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. 

ఆదోనిలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవుని దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 47.40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుకను అందిస్తున్నాం. విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్‌ మీడియం చదువుకోవాలి. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుంది.

పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. నాడు-నేడు కింద​ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. జగనన్న గోరుముద్ద పథకంతో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. బైజూస్‌ యాప్‌నుపేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాం. విద్యార్థుల కోసం బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ కూడా అందజేస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాం. పిల్లల భవిష్యత్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం మాది. విద్యాసంత్సరం ఆరంభంలోనే విద్యాకానుక అందిస్తున్నాం. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. ఒక్కో కిట్‌ విలువ రూ.2వేలు అని సీఎం జగన్‌ అన్నారు.

ఆదోనికి సీఎం జగన్‌ వరాల జల్లు
స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అడిగిన మేరకు ఆదోనికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీకాలేజ్‌ను మంజూరు చేశారు. ఆటోనగర్‌, జగనన్న కాలనీలకు బీటీ రోడ్లు, రోడ్ల విస్తరణ కోసం రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు సభా వేదికనుంచే ప్రకటించారు. 

అకడమిక్‌ కేలండర్‌ ఆవిష్కరణ
కార్యక్రమం అనంతరం అన్ని పాఠశాలలకు సంబంధించిన 2022-23 విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement