
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా ఇప్పటంలో గతంలో తొలగించకుండా మిగిలిపోయిన ఆక్రమణల విషయంలో జనసేన మూకలు శనివారం మరోసారి గ్రామంలో చిచ్చుపెట్టేందుకు యత్నించారు. అధికారులు ఎంతచెప్పినా వినకపోవడంతోపాటు గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. సదరు ఆక్రమణలు ప్రభుత్వ భూమిలోనివేనని అధికారులు స్పష్టంచేయడం.. పోలీసుల హెచ్చరికలతో జనసేన మూకలు తోకముడిచాయి.
వివరాల ప్రకారం.. గతంలో నానా రభస సృష్టించి ఇప్పటంలో అభివృద్ధి పనులను జనసేన శ్రేణులు అడ్డుకోవడంతో మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) అధికారులు అప్పట్లో కొన్ని ఆక్రమణలను తొలగించలేదు. వీటిని తిరిగి శనివారం తొలగించేందుకు సిద్ధమవుతుండగా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి జనసేన, టీడీపీ శ్రేణులు గ్రామంలో మరోసారి రగడ సృష్టించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని రాయడానికి వీల్లేని భాషలో ఇష్టానుసారం దూషించారు. కానీ, ఎంటీఎంసీ అధికారులు మాత్రం సంయమనం పాటించారు.
అంతేకాక.. తామేమీ ప్రైవేట్ ఆస్తులను తొలగించడంలేదని.. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించుకున్న ప్రహరీ గోడలు, మెట్లు, వ్యాపార సముదాయాలు మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టంచేశారు. ఇంతలో అది ప్రభుత్వ భూమి అయితే ఆధారాలు చూపాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేయగా అధికారులు అందుకు సరేనన్నారు. అదే సమయంలో గ్రామంలో బయట వ్యక్తులు ఎవరూ ఉండకూడదని పోలీసులు హెచ్చరించడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. వారిని అడ్డుకునే ప్రయత్నంలో జనసేన మూకలు రెచ్చిపోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు అక్కడి రామాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు.
ఇంతలో ఎంటీఎంసీ అధికారులు 1916 నాటి రికార్డులను తీసుకొచ్చి వారికి చూపించారు. దీంతో.. అధికారులు ఆక్రమణలపై చేసిన మార్కింగ్ కొలతలు.. రికార్డుల్లో ఉన్న కొలతలు ఒకటేనని తేలిపోయింది. ఇక ఏం మాట్లాడాలో అర్ధంకాక అధికారులతో జనసేన మూకలు వాదనకు దిగాయి. పోలీసులు హెచ్చరించడంతో వారు బయటకొచ్చి వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగింది. ఇదిలా ఉంటే.. జనసేన శ్రేణులు గుడిలోకి వెళ్లి తాళాలు వేసుకోవడం.. ప్రభుత్వం, సీఎంపై నానా మాటలు అనడంతో గ్రామానికి చెందిన మహిళలు బహిరంగంగానే ఆక్షేపించారు.
Comments
Please login to add a commentAdd a comment