‘మేమంతా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా మన సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారు.. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కానేకాదు.. బ్యాక్ బోన్ అని చేతల్లో నిరూపించారు. అందువల్లే మేమంతా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం.. అందువల్లే పార్టీ ఇచ్చిన ఒక్క పిలుపునకు ఇంత స్పందన.. సీఎం జగన్ మాట్లాడిన ప్రతి మాటకూ ప్రతిస్పందన.. ఈ జన సునామీని చూసిన చంద్రబాబుకు, దుష్టచతుష్టయానికి ఇక నిద్ర కరువే’ అని వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో బల్లగుద్ది చెబుతున్నాయి.
జయహో బీసీ మహాసభ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వెనుకబడిన కులాలే వెన్నెముక అనే నినాదంతో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ మహాసభ’కు తరలిరావాలని వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపే ప్రభంజనమైంది.. దూరాభారాన్ని లెక్క చేయక ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురం, తమిళనాడు సరిహద్దులోని కుప్పం, కర్ణాటక సరిహద్దులోని హిందూపురం, తెలంగాణ సరిహద్దులోని మంత్రాలయం.. ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి పోటాపోటీగా బీసీ ప్రజాప్రతినిధులు మంగళవారం రాత్రి నుంచే విజయవాడకు తరలివచ్చారు.
బుధవారం ఉదయం 5 గంటలకే ఎముకలు కొరుకుతున్న చలిని ఖాతరు చేయకుండా.. మంచు తెరలను చీల్చుకుంటూ.. సూర్యోదయానికి ముందే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాసభ ప్రాంగణానికి కడలి తరంగంలా పోటెత్తారు. ఉదయం 9 గంటలకు మహాసభ ప్రాంగణం జన సంద్రంగా మారింది. ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో బందరు రోడ్డుతోపాటు ఇందిరాగాంధీ స్టేడియంకు నలువైపులా వేలాది మంది ప్రతినిధులు రహదారులపైనే ఉండిపోయారు.
దాంతో మహాసభ ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ సమయం ఉదయం 10 గంటల కన్నా 45 నిముషాల ముందే.. 9.15 గంటలకే ఆరంభమైంది. జ్యోతి ప్రజ్వలన చేసి.. మహాత్మా జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించి.. సభను ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహాసభ ప్రాంగణానికి 12 గంటలకు చేరుకున్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. 1.35 గంటల వరకు కొనసాగించారు. అప్పటి వరకు మహాసభ ప్రాంగణం నుంచి ఏ ఒక్కరూ కట్టు కదలలేదు. నేతలందరి ప్రసంగాలను శ్రద్ధగా విన్నారు. రహదారులపై గంటల తరబడి నిలబడిన వారూ అడుగు కదపకుండా ఎల్‌ఈడీ తెరలపై మహాసభను వీక్షిస్తూ ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించారు.
తలెత్తుకు తిరిగేలా సమున్నత గౌరవం
ఏలూరులో 2019 ఫిబ్రవరి 17న బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన దానికంటే మిన్నగా సీఎం వైఎస్ జగన్ చేస్తుండటం.. కాలరెగరేసుకుని సగర్వంగా తలెత్తుకునే రీతిలో సమున్నత గౌరవం ఇస్తూ పరిపాలిస్తుండటం వల్లే బీసీ ప్రజాప్రతినిధులు, ప్రతినిధులు కదనోత్సాహంతో మహాసభకు కదలి వచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తాత్కాలిక సచివాలయం సాక్షిగా తోకలు కత్తరిస్తా అంటూ చంద్రబాబు బెదిరించడం.. హామీలను నిలబెట్టుకోవాలని అడిగిన మత్స్యకారులను అంతుచూస్తానని భయపెట్టడం.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని దళితుల పుట్టుకనే అవహేళన చేయడాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేసినపుడు ప్రతినిధుల నుంచి విశేష స్పందన లభించింది.
ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపకుండా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే.. మూడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను రాజ్యసభకు సీఎం వైఎస్ జగన్ పంపి తమకు సమున్నత గౌరవం ఇచ్చారని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వీరన్న ‘సాక్షి’కి చెప్పారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, మహిళా, విద్యా సాధికారత సాధించేలా చేస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తాము నడుస్తామని స్పష్టం చేశారు.
శ్రేణుల్లో మరింత రగిలిన సమరోత్సాహం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జూలై 8–9న నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ కావడంతో నూతనోత్సాహంతో శ్రేణులు కదం తొక్కుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ చేసిన దిశానిర్దేశం మేరకు గడప గడపకూ వెళ్లి.. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికీ వివరించి చెబుతూ ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో నిర్వహించిన జయహో బీసీ మహాసభకూ బీసీ ప్రతినిధులు పోటెత్తారు.
ఏడాదికి బీసీ సబ్ ప్లాన్ కింద రూ.పది వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి దగా చేస్తే.. సీఎం వైఎస్ జగన్ ఏడాదికి రూ.15 వేల కోట్లు చొప్పున రూ.75 వేల కోట్లు ఇస్తానని మాట ఇచ్చి మూడున్నరేళ్లలోనే అంతకంటే అధికంగా రూ.1.63 లక్షల కోట్ల ప్రయోజనాన్ని తమకు చేకూర్చారని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు తిరుమాను ధనుంజయ్ చెప్పారు.
చంద్రబాబు చేసిన మోసాన్ని.. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న న్యాయాన్ని ఇంటింటికీ వెళ్లి వివరించి.. 175కు 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. జయహో బీసీ మహాసభ అంచనాలకు మించి గ్రాండ్ సక్సెస్ కావడం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని మరింతగా రగిల్చింది.
లక్ష మందితో సభ.. ఎక్కడా స్తంభించని ట్రాఫిక్
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జయహో బీసీ మహాసభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి లక్ష మందికి పైగా ప్రతినిధులు హాజరైనప్పటికీ నగరంలో ఎక్కడా ట్రాఫిక్ స్తంభించడం అంటూ జరగలేదు. పోలీసు, ఇతర శాఖల పక్కా ప్రణాళిక, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు.. ప్రజల సహకారంతో ఎక్కడా ఇబ్బంది ఎదురు కాలేదు.
వందల సంఖ్యలో వాహనాలకు పార్కింగ్ స్థలాలు వేర్వేరుగా కేటాయించడం.. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో ఒక వైపున, బీఆర్‌టీఎస్ రోడ్డునకు ఇరువైపులా, ఏఎస్.రామారావు రోడ్డు, ఐదో నెంబరు బస్సు రూట్‌లలో వాహనాలను అనుమతించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు.
Comments
Please login to add a commentAdd a comment