![Jet Speed In Jagananna Pacha Thoranam Programme In Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/6/trees.jpg.webp?itok=jxYeCD2V)
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం కింద మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. జూలై 22వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు అదేరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అక్టోబర్ నెలాఖరు నాటికి వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రయివేట్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 7.35 కోట్ల మొక్కలను నాటారు.
పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యావరణ నిర్వహణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి దేశంలోనే మొదటిసారి ఆన్‌లైన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. పచ్చదనం పెంపు కోసం విస్తృతంగా మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. ట్రీకవర్ పెంపుపైనా ప్రధానంగా దృష్టి పెట్టారు. దీంతో అటవీశాఖ నోడల్ విభాగంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో రెండు నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటించనున్నారు.
- అటవీ శాఖ ఒక్కటే గత నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3.33 కోట్ల మొక్కలు నాటించింది. ఇతర శాఖలు, విభాగాలు కలిపి సుమారు 4.02 కోట్ల మొక్కలు నాటించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 7.35 కోట్ల మొక్కలు నాటినట్లయింది. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురుస్తుండటంతో నాటినవన్నీ బాగా బతికాయి. వాతావరణం అనుకూలించడంతో బాగా ఇగుర్లు వేసి ఏపుగా పెరుగుతున్నాయి.
- జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయతీరాజ్ రోడ్ల వెంబడి కూడా మొక్కలు నాటారు. రహదారుల వెంబడి నాటిన చింత, వేప, నేరేడు, ఏడాకుల పాయ, బాదం, రావి మొక్కలు చెట్లుగా మారితే రోడ్లకు పచ్చతోరణాలుగా మారతాయని అధికారులు చెబుతున్నారు.
- సామాజిక అటవీ శాఖ ఉచితంగా పంపణీ చేసిన శ్రీగంధం, టేకు, ఎర్రచందనం, సపోటా, ఉసిరి, వేప, చింత, రావి మొక్కలను రైతులు పొలం గట్లపైనా, ఇళ్ల వద్ద నాటుకుంటున్నారు.
అక్టోబర్ నెలాఖరువరకూ నాటిన మొక్కలు (గణాంకాలు లక్షల్లో)
అటవీ సర్కిల్ | అటవీశాఖ | ఇతర శాఖలు | మొత్తం |
అనంతపురం | 29.59 | 100.13 | 129.72 |
గుంటూరు | 15.42 | 48.99 | 64.41 |
కడప | 24.75 | 11.65 | 36.40 |
విజయవాడ | 43.40 | 107.33 | 150.73 |
విశాఖపట్నం | 220.34 | 133.42 | 353.76 |
మొత్తం | 333.50 | 133.42 | 735.02 |
Comments
Please login to add a commentAdd a comment