మొండిగా ముందుకెళ్తే బహిష్కరిస్తాం | Job Associations JAC Fires On SEC | Sakshi
Sakshi News home page

మొండిగా ముందుకెళ్తే బహిష్కరిస్తాం

Published Sun, Jan 10 2021 3:34 AM | Last Updated on Sun, Jan 10 2021 5:22 AM

Job Associations JAC Fires On SEC - Sakshi

సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్‌: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్కుమార్‌ను ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో కోరాయి. లేదంటే ఎన్నికల విధుల్ని బహిష్కరిస్తామని స్పష్టం చేశాయి. మొండిగా ముందుకెళితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించాయి. శనివారం విజయవాడలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యి.. ఎస్‌ఈసీ తీరుపై చర్చించారు. కరోనా సమయంలో ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనలేరని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయా సంఘాల నేతలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  
 
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. 
రోజుకొక కేసు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడు వందలు, వేలల్లో కరోనా కేసులు వస్తున్నప్పుడు నోటిఫికేషన్‌ ఇవ్వడం సరికాదు. వెంటనే ఎన్నికలు నిలుపుదల చేయాలి. ఎన్నికల కమిషనర్‌ మొండిగా ముందుకువెళితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ జరుగుతోంది. ఇలాంటి సమయంలో నోటిఫికేషన్‌ విడుదల చేయడం ఏమిటి? తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఉద్యోగుల్లో 20 – 30 శాతం మంది కరోనా బారిన పడ్డారు. ఏపీలో తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి వుంటుంది. వారందరి ప్రాణాలంటే మీకు లెక్కలేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు సరికాదు.  
– చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌  
 
ఏకపక్ష నిర్ణయం సరికాదు  
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఏకపక్షంగా వ్యవహరించారు. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఎన్నికల విధులు నిర్వహించలేం. నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలి. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ శాఖ కీలకం. ఇప్పటికే 150 మంది రెవెన్యూ ఉద్యోగులు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుని పంతం నెగ్గించుకోవడం కోసం ఎస్‌ఈసీ.. కరోనా తీవ్రంగా ఉన్న ప్రస్తుత సమయంలో ఎన్నికలు పెట్టడం సరికాదు. ఎన్నికలకు సిద్ధంగా లేమని సీఎస్‌ చెప్పినా నోటిఫికేషన్‌ ఇవ్వడం ఏమిటి?   
– బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 
  
ఎన్నికల విధుల్లో పాల్గొనడం కష్టం  
వరదలు, బందోబస్తు విధులు నిర్వర్తిస్తూ 109 మంది పోలీసులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. 25 శాతం మంది పోలీసు సిబ్బంది కోవిడ్‌ బారిన పడ్డారు. 75 శాతం మంది పోలీసులే విధులు నిర్వర్తిస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ జరిగాక ఎన్నికలు నిర్వహించాలి.  
– జనకుల శ్రీనివాసరావు, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 
 
ఎన్నికలు వాయిదా వేయండి  

ఎనిమిది నెలలుగా కంటి మీద కునుకు లేకుండా పని చేశాం. వ్యాక్సిన్‌ వస్తుందనే సంతోషంలో ఉండగా దాన్ని తుడిచి వేసేలా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడం బాధాకరం. ఇప్పటికే ఎంతో మంది రెవెన్యూ ఉద్యోగులు చనిపోయారు. కాబట్టి ఎన్నికలు వాయిదా వేయాల్సిందే.  
– కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు 
 
మాకూ జీవించే హక్కు ఉంది  
రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 21 ప్రకారం మాకూ జీవించే హక్కు ఉంది. కరోనాకు మమ్మల్ని బలి చేయొద్దు. మహిళా ఉద్యోగులుగా ఎన్నో కష్టాలు పడుతూ పని చేస్తున్నాం. విధులు ముగించుకుని ఇంటికి వెళితే పక్కనున్న వాళ్లు మాతో మాట్లాడటానికి భయపడుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ రాకమునుపే ఎన్నికలకు ఎందుకు అంత తొందర?   
– ఎం మాధురి, తహశీల్దార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి 
 
ఎన్నికల్ని బహిష్కరిస్తాం  
ఏకపక్షంగా స్థానిక ఎన్నికలకు ఇచి్చన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోకపోతే ఎన్నికల్ని బహిష్కరిస్తాం. వ్యాక్సినేషన్‌తోపాటు ఎన్నో ఏళ్లుగా టీచర్లు ఎదురు చూస్తున్న బదిలీల కౌన్సిలింగ్‌ ఆగిపోతుంది. అందువల్ల ఏకపక్షంగా ముందుకెళ్లడం సరికాదు.  
– గిరిప్రసాద్, మల్లు శ్రీధర్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు 
 
వ్యవస్థ కోసం పనిచేయాలి  
ఎన్నికల కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయం సరికాదు. ఉపాధ్యాయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరు.  ప్రభుత్వ అభ్యర్థనను నిమ్మగడ్డ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం సరికాదు. ఎన్నికల కమిషన్‌ ఉన్నది వ్యక్తుల కోసం కాదు. వ్యవస్థ కోసం పనిచేయాలి. 
– సుదీర్‌బాబు, ఉపాధ్యాయ సంఘాల నేత 
 
కొత్త రకం కరోనా వణికిస్తోంది 
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఓ వైపు బ్రిటన్, అమెరికా వంటి దేశాలు కొత్తరకం కరోనాతో వణికిపోతున్నాయి. అలాంటి కొన్ని కేసులు మన రాష్ట్రంలోనూ నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరపాలని అనుకోవడం సమంజసం కాదు.   
– డా.జయదీర్, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్‌  
 
ప్రజారోగ్య పరిరక్షణకు అడ్డంకి 
ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ఎన్నికల ప్రక్రియ చేపట్టడం సమ్మతం కాదు. వైద్య, ఆరోగ్య, పంచాయతీ, రెవెన్యూ, పోలీస్‌ వంటి శాఖలు వ్యాక్సిన్‌ పంపిణీ విధులలో నిమగ్నమైన తరుణంలో ఎన్నికలు కచ్చితంగా విఘాతం కలిగిస్తాయి. ప్రజారోగ్య పరిరక్షణకు ఎన్నికల ప్రక్రియ తీవ్ర అడ్డంకిగా మారుతుంది.  
– కేఆర్‌ సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు 

అందరి నోటా అదే మాట 
కరోనా భయపెడుతున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వడం సమంజసం కాదని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు తప్పు పట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు వాయిదా వేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కూచిపూడి మోహన్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సామల సింహాచలం, పీఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.బాలభాస్కర్,  డి.ప్రవీణ్, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్‌ ఖాదర్‌బాబా, రెవెన్యూ జేఏసీ చైర్మన్‌ వీఎస్‌ దివాకర్, ప్రభుత్వం డ్రైవర్ల సంఘం సంపాని శ్రీనివాసరావు తదితరులు ఎస్‌ఈసీ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement