సాక్షి అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళి అమలు చేయకపోవడం సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధమంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.
ఈ వ్యాజ్యాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ధర్మాసనం సూచించింది. మరోవైపు ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాలని కోరుతూ జనసేన నేత శ్రీనివాసరావు, బీజేపీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సత్యనారాయణమూర్తి మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, వి.వేణుగోపాలరావు, ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తదితరులు వాదనలు వినిపించారు.
ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల వ్యయం
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని వేదుల నివేదించారు. ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నారన్నారు. అయితే వర్ల రామయ్య ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత ఆయనకు లేదని సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యాజ్యం వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు లేవని వర్ల చెబుతున్నందున ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం అవుతుందని, దీనిపై ధర్మాసనమే విచారణ జరపాల్సి ఉంటుందన్నారు. నాలుగు వారాల గడువు గరిష్ట పరిమితి మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల వరకు ఖర్చు అయిందని, ఎన్నికలను రద్దు చేస్తే మళ్లీ అంత పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇది ఖజానాపై భారం మోపడమే అవుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికలు పూర్తి అయ్యాయని, ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారని వివరించారు. ఫలితాల వెల్లడికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. జనసేన తరపు న్యాయవాది వేణుగోపాల్ రావు వాదనలు వినిపిస్తూ ఎన్నికలలో బలవంతపు ఉపసంహరణలు జరిగాయన్నారు. పలు చోట్ల హింసాత్మక ఘటనల గురించి అప్పటి ఎన్నికల కమిషనర్ కేంద్రం దృష్టికి తెచ్చారని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
పరిషత్ ఎన్నికలపై తీర్పు వాయిదా
Published Wed, May 5 2021 5:06 AM | Last Updated on Wed, May 5 2021 5:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment