కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద ఎస్సై గోపాలకృష్ణ భార్య పావని తదితరులు
కాకినాడ సిటీ/నవాబుపేట (పెనుగంచిప్రోలు): సర్పవరం ఎస్సై ముత్తవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య సంఘటన జిల్లాలో శుక్రవారం తీవ్ర సంచలనం కలిగించింది. మృదుస్వభావిగా పోలీసు శాఖలో ముద్ర వేసుకున్న ఆయన తన సర్వీసు పిస్టల్‌తో కాల్చుకుని విషాదకర రీతిలో జీవితానికి ముగింపు పలకడం దారుణమని సహచర ఉద్యోగులు దిగ్భ్రమ చెందారు. గోపాలకృష్ణ మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని, ప్రత్యేకంగా స్పెషల్ బ్రాంచి డీఎస్పీ వెంకటేశ్వరరావును విచారణాధికారిగా నియమించామని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు.
కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య చాలా బాధాకరమన్నారు. ఎంసీఏ చదివి, కొన్నాళ్లు వీఆర్వోగా పని చేసి, తరువాత ఎస్సైగా ఎంపికైన ఈయన సున్నిత మనస్కుడని అన్నారు. తన స్వభావానికి పోలీస్ ఉద్యోగం సరికాదని, ఇది మానేసి వ్యాపారం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉండేవారని తెలిపారు. ఆ డిప్రెషన్‌లోనే ఉన్న ఎస్సైకి కొందరు అధికారులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారన్నారు. పోలీసు ఉద్యోగం ఇష్టం లేదంటూ ముభావంగానే ఉండేవారని భార్య కూడా చెప్పారని ఎస్పీ వివరించారు.
విలేకర్లతో మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు
విలపించిన బంధువులు
ఎస్సై గోపాలకృష్ణ భార్య పావని, తల్లిదండ్రులు శ్రీనివాసరావు, భారతమ్మతో పాటు బంధువులు కాకినాడ జీజీహెచ్‌కు తరలివచ్చారు. మార్చురీ వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. గోపాలకృష్ణ 36 ఏళ్లకే తనువు చాలించడం దారుణమంటూ రోదించారు. ఆసుపత్రి వద్ద గోపాలకృష్ణ మృతదేహాన్ని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్పీ వి.భీమారావు తదితరులు పరిశీలించి, దగ్గరుండి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు.
చదవండి: పామును రక్షించబోయి ఎమ్మెల్యే కారుకు ప్రమాదం
కుమారుడి మృతితో రోదిస్తున్న తండ్రి శ్రీనివాసరావు
నవాబుపేటలో విషాదం
గోపాలకృష్ణ స్వస్థలమైన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసరావు, సరోజని దంపతుల రెండో కుమారుడు గోపాలకృష్ణ, మొదటి కుమారుడు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు బెంగళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. గోపాలకృష్ణకు భార్య పావని, నాలుగేళ్ల కుమార్తె భవిష్య, రెండేళ్ల కుమారుడు శర్వాన్ ఉన్నారు. ఈయన 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. వ్యవసాయ కుటుంబానికి చెందిన గోపాలకృష్ణ మొదటి నుంచీ చదువులో ముందుండేవారు. అందరితో ఎంతో సౌమ్యంగా ఉండేవారని గ్రామస్తులు చెప్పారు. ఎస్సైగా ఉంటూనే ఉన్నత పరీక్షలకు కూడా సిద్ధమవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గోపాలకృష్ణ అంత్యక్రియలు శనివారం చేయనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment