
తాడేపల్లి: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలను మాజీ మంత్రి కొడాలి నాని తిప్పికొట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ఆ పని చేయడం చంద్రబాబుకే అలవాటు అని పేర్కొన్నారు. సీఎం జగన్ వల్లే తనకు పదవి వచ్చిందని కోటంరెడ్డి అనేక సార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈయనకు చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేసినట్టున్నారని, పార్టీ మారాలనుకున్నాడు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి ఇలాంటి వారు పోతేనే మంచిదని చెప్పారు.
సీఎం జగన్ బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నారని కొడాలి చెప్పారు. బలమైన వర్గాలకు పదవులిస్తే బలహీన వర్గాలు ఏమై పోవాలని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు అబద్దాలు చెప్పడం చేతకాదని, ఏదైనా ముక్కుసూటిగా చెబుతారుని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్‌ను ఏం చేయలేకపోయారని, ఇప్పుడు ఏం చేయగలరని ప్రశ్నించారు.
'ఐఫోన్ నుంచి ఐఫోన్ రికార్డు కాదని ఎవరు చెప్పారు? మాకందిన సమాచారం పోలీసులతో పంచుకోవడం సహజమే ఇంటెలిజెన్స్ డీజీ కూడా ప్రభుత్వంలో భాగమే. డీజీ ఎమ్మెల్యేలకు మెసేజ్‌లు పెట్టకూడదా? సీఎం జగన్‌కు నమ్మకం తప్ప అనుమానాలు లేవు. ఆయన బీ ఫారం ఇస్తానంటే.. నెల్లూరు నుంచి జనం క్యూ కడతారు.' అని కొడాలి పేర్కొన్నారు.
పేర్ని నాని రియాక్షన్..
మాజీ మంత్రి పేర్ని నాని కూడా కోటంరెడ్డి ఆరోపణలపై స్పందించారు. ప్రతి ఫోన్‌లో రికార్డింగ్ యాప్ ఉంటుందన్నారు. ప్రతి కాల్ రికార్డు చేసి సర్క్యూలేట్ చేయవచ్చని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే మూడు నెలల కిందే చెప్పొచ్చు కదా? అని ప్రశ్నించారు. సానుభూతి కోసమే కోటంరెడ్డి ఇదంతా చేస్తున్నాడని విమర్శించారు.
'ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్లిపోవడానికి నిర్ణయించుకుని ప్రభుత్వంపై బురద వేస్తున్నావా? ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్ప ఇంకే పని ఉండదా? మేం ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదు. జగన్ పార్టీ పెట్టకపోతే ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యేవారా?' అని పేర్ని వ్యాఖ్యానించారు.
చదవండి: 'కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం జగన్ పెట్టిన భిక్షే'
Comments
Please login to add a commentAdd a comment