మద్యానికి దూరంగా.. అభివృద్ధికి దగ్గరగా.. | konathamatmakuru Nandigama Mandal Is Alcohol Free Village Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మద్యానికి దూరంగా.. అభివృద్ధికి దగ్గరగా..

Published Tue, Oct 5 2021 3:04 AM | Last Updated on Tue, Oct 5 2021 10:32 AM

konathamatmakuru Nandigama Mandal Is Alcohol Free Village Andhra Pradesh - Sakshi

నందిగామ: కొణతమాత్మకూరు.. కృష్ణా జిల్లాలో 17వందల పైచిలుకు జనాభా ఉన్న ఓ చిన్న గ్రామం. మద్యం అలవాటు ఇక్కడ ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా చిదిమేసింది. విచ్చలవిడిగా తాగుతూ భార్యలను హింసించిన ఘటనలు ఇక్కడ కోకొల్లలు. ఇలాంటి ఊరు ఒక్కసారిగా మారిపోయింది. మద్యానికి వ్యతిరేకంగా మహిళలు సమర శంఖం పూరించడమే కారణం. ఇప్పుడు ఆ గ్రామం మద్యం ముట్టని ఊరుగా ఖ్యాతిగడిస్తూ అభివృద్ధికి పరుగులు పెడుతోంది.     

కృష్ణాజిల్లా నందిగామ మండలంలో ఉన్న ఈ గ్రామంలో ఒకప్పుడు ఎవరిష్టం వచ్చినట్లు వారు తాగడం.. రోజంతా కష్టపడి సంపాదించిన మొత్తం తాగుడుకే వెచ్చించడం జరిగేది. భర్తలు ఫుల్లుగా తాగడం, భార్యలను హింసించడం, మహిళలు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన మొత్తాన్ని కూడా సారా కొట్టుకే తగలేయడం, డబ్బుల్లేని రోజు పుస్తెలను సైతం తాకట్టు పెట్టి తాగడం పరిపాటిగా ఉండేది. దీంతో విసిగిపోయిన మహిళలు పోరాటానికి శ్రీకారం చుట్టారు. మద్యం వ్యతిరేక ఉద్యమానికి బీజం వేశారు. దీంతో 2005 అక్టోబర్‌లో పంచాయతీ తీర్మానం చేశారు.

మద్యం సీసాలను ధ్వంసంచేసి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా పోరాటం చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు సైతం కదలి రావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వారు వచ్చి గ్రామంలోని మందుబాబులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇలా మూడు నెలలపాటు కొనసాగిన ఉద్యమం సత్ఫలితాన్నిచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఈ గ్రామంలో మద్యానికి చోటులేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఈ గ్రామంలో బెల్ట్‌ షాపు ఏర్పాటుచేసేందుకు చేసిన ప్రయత్నాలను సైతం గ్రామస్తులు అడ్డుకున్నారు. 

అక్కడ అందరిదీ ఒకే మాట..
అన్ని గ్రామాల్లో మాదిరిగానే ఈ గ్రామంలో కూడా పలు పార్టీలను అభిమానించే వారున్నారు. అయితే, మద్యం మహమ్మారి విషయంలో మాత్రం వారందరిదీ ఒక్కటే మాట. పలు విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. మద్యం మహమ్మారి విషయంలో, అభివృద్ధి విషయంలో మాత్రం వీరు ఒక్క తాటిపైనే ఉంటారు. పొరుగునే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఉన్నప్పటికీ, గ్రామంలోకి మద్యం తీసుకువచ్చే ధైర్యం ఎవ్వరూ చేయలేరు. ఈ గ్రామస్తుల కట్టుబాటు అలాంటిది. 

ఉద్యమ స్ఫూర్తితో గ్రామాభివృద్ధి
ఇక్కడ మహిళలు చేపట్టిన ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తి.. గ్రామాభివృద్ధిలోనూ కొనసాగింది. దీంతో ఈ గ్రామంలో రెండు ఎత్తిపోతల పథకాలు, మండల పరిషత్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ప్రైమరీ హెల్త్‌ సెంటర్, ధాన్యం కొనుగోలు కేంద్రం వంటివి ఏర్పాటయ్యాయి. దీనికితోడు గ్రామంలోని అన్ని రహదారులు పూర్తిగా సిమెంటు రోడ్లుగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు వారి అభివృద్ధికి మరింత దోహదపడుతున్నాయి. ఇలా అన్ని గ్రామాల్లోనూ ప్రజలు కలిసికట్టుగా ఉంటే గ్రామ సీమలు అభివృద్ధిలో మహా నగరాలను మించిపోవడం ఖాయం.

ఈమె పేరు కనమాల పుల్లమ్మ. ఈమె భర్త కృష్ణ. మద్యానికి బానిసై 15 ఏళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటికి ఆమె ఉంటున్న గ్రామంలో మద్యపాన నిషేధం అమలుకాలేదు. ఇద్దరు కుమారులను పెంచేందుకు నానా కష్టాలు పడింది. రోజువారీ కూలీకి వెళ్లొచ్చిన డబ్బుతో పెద్ద కుమారుడు నాగరాజును డిగ్రీ వరకు చదివించింది. రెండో కుమారుడు వినయ్‌ ప్రభుత్వ స్కూల్‌లో చదువుకుంటూనే కూలి పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. కేవలం మద్యం మహమ్మారి వల్లే తన భర్త మరణించాడని ఆమె చెబుతోంది. ఇలా పుల్లమ్మ లాంటి అనేకమంది మహిళలు ఆ గ్రామంలో తమ భర్తల తాగుడు వ్యసనంతో పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు.

అభివృద్ధిలో అందరిదీ ఒకే మాట 
గ్రామస్తులు అభివృద్ధిని, రాజకీయాన్ని వేర్వేరుగా చూస్తారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మా గ్రామంలో రాజకీయం ఉంటుంది. అధికారంలో ఎవరున్నా, గ్రామాభివృద్ధికి పాటుపడాల్సిందే. 

ఈ విషయంలో తేడా వస్తే గ్రామస్తులు సహించరు. అందరూ ఒకే తాటిపై ఉండబట్టే అభివృద్ధి సాధ్యపడుతోంది. ప్రతి విషయంలో పారదర్శకత ఉంటుంది. 
– మేడా కోటేశ్వరరావు, సర్పంచ్‌

కేసులు లేని గ్రామం 
కొణతమాత్మకూరు గ్రామం ఎన్నో విషయాల్లో ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉంటాయి. ఏడాదికి ఈ గ్రామం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాదు. ప్రమాదాలు, ఇతరత్రా కేసులు అడపాదడపా వస్తాయి. అన్ని గ్రామాలు ఇలా కట్టుబాటుతో ఉంటే, గ్రామసీమలు పట్టణ వాసులకు ఆదర్శంగా నిలుస్తాయి.
– కనకారావు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement