సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన స్నేహితుడు లంకా రామశివారెడ్డి కొట్టిపారేశారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని.. ఫోన్‌లో తాను రికార్డ్ చేసిన వాయిస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రామశివారెడ్డి బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.
ఇంత రాద్ధాంతం చేస్తాడనుకోలేదు..
‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నా స్నేహితుడే. ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఆ తర్వాత ఆయన రాజకీయాలు వైపు వెళ్లగా.. నేను కాంట్రాక్టర్‌గా మారాను. డిసెంబర్‌లో నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోటంరెడ్డి ప్రభుత్వ అధికారుల మీద, ఆయనకు కలిగిన ఇబ్బందుల మీద సుదీర్ఘంగా మాట్లాడారు.
అదే రోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నాకు ఫోన్ చేశాడు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశం విషయాలపై చర్చించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల విషయంలో తొందరపాటుగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని సలహా ఇచ్చాను. నియోజకవర్గ నిధులు, కాంట్రాక్టు పనులు, ఇతర పరిణామాలన్నీ సుదీర్ఘంగా చర్చించుకున్నాం. అవన్నీ కూడా నా ఫోన్‌లో ఆటోమేటిక్‌గా రికార్డయ్యాయి.
నేను చెన్నై వెళ్లినప్పుడు.. కోటంరెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన వాయిస్ రికార్డును నా స్నేహితుడికి పంపాను. అది యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప.. కావాలని చేసింది కాదు. ఆ తర్వాత అది కాస్తా వైరల్ అయ్యింది. ఇంత పెద్ద వివాదం అవుతుందని ఊహించలేదు. కోటంరెడ్డి అనవసరంగా చిన్న విషయంపై ఇంత రాద్ధాంతం చేస్తాడని అనుకోలేదు. రెండు, మూడు రోజుల్లో సమసిపోతుందనుకున్నా. అందుకే ఇంతకాలం బయటకు రాలేదు. కానీ కోటంరెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో నాకు కొంత ఆందోళన కలిగింది.
ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇప్పుడు బయటకు వచ్చా. కోటంరెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసినా ఫర్వాలేదు. నాది ఆండ్రాయిడ్ ఫోన్. ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ అవుతుంది. గత 5 నెలలుగా నేను వాడుతున్న ఫోన్‌ను చెక్ చేసుకోండి. అన్ని కాల్స్ రికార్డ్ అయిన విషయం తెలుస్తుంది. ఎవరు వచ్చినా.. నా ఫోన్ ఇస్తా.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి నిజాలు తెలుసుకోవచ్చు. నేను వాయిస్ రికార్డు పంపిన నా స్నేహితుడి పేరును విచారణ అధికారులకు చెబుతా. ఆయన పేరు ఇప్పుడు బహిరంగంగా చెప్పి.. ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు’ అని లంకా రామశివారెడ్డి వివరణ ఇచ్చారు.
అది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ వాయిస్
Published Thu, Feb 9 2023 4:21 AM | Last Updated on Thu, Feb 9 2023 2:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment