ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రతి మాట వెనుక వ్యూహమేదో ఉండే ఉంటుంది. ప్రత్యేకించి ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు ఆయన ఉపయోగించేవి. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అందులో ఆయన ‘‘ప్రజలు గమనిస్తూంటారు.. జాగ్రత్త’’ అని హెచ్చరించినట్లు ఎల్లోమీడియా ఒక కథనం ప్రచురించింది. మంచిదే! కానీ..
ప్రజలు కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే కాకుండా.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పాలన, మాటలను కూడా గమనిస్తూంటారు. ఏ ఏ ప్రకటనలు చేసింది. ఇచ్చిన వాగ్ధానాలు.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు ఏం చేశారన్నది కూడా ప్రజల గమనంలోనే ఉంటుంది. ఈ విషయాలేవీ చంద్రబాబుకు తెలియవని కాదుక ఆనీ.. మీడియాలో వచ్చిన ఆ కథనం చూస్తే మరిన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ కోసం ఏం మాట్లాడుతున్నారో ఆయా నియోజకవర్గాల ప్రజలు గమనిస్తూంటారని చెబుతూ... సభ బయట ఇసుక, మద్యం వంటి వ్యవహారాల్లో, ప్రైవేట్ పంచాయితీల్లోనూ ప్రజా ప్రతినిధులు ఎవరూ తలదూర్చరాదని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారట. ఇంతవరకు బాగానే ఉంది. ఆయన నిజంగానే చిత్తశుద్దితో ఈ హితబోధ చేసి ఉంటే అభినందించాల్సిందే. కానీ ఈ ఐదున్నర నెలలు జరిగిందేమిటి? అసలు ప్రభుత్వం ఉందా?లేదా? అన్న అనుమానం కలిగేలా పాలన సాగితే ప్రజలు గమనించరా?
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూటమి అధికారంలోకి వచ్చే నాటికి సుమారు 80 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. కానీ.. ఇందులో సగం అంటే దాదాపు 40 లక్షల టన్నుల ఇసుక మొదటి పది రోజులలోనే టీడీపీ, జనసేన నేతలు ఇష్టారీతిన అమ్మేసుకున్నారు! అలాగే.. రాష్ట్రంలో ఇసుక ఉచితమన్నది పేరుకే పరిమితమైంది. వాస్తవానికి గతంలో కంటే ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తోంది. పోనీ ఇలా కట్టిన మొత్తాలేమైనా ప్రభుత్వానికి పన్నుల రూపంలో జమ అయ్యాయా? అదీ లేదు. కూటమి నేతల జేబుల్లోకి చేరుతున్నాయి.
ఈ అవ్యవహారాలన్నీ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలియకుండానే జరిగాయంటే నమ్మలేము. తొలి పది రోజుల్లో అమ్ముకున్నట్టుగానే మిగిలిన సగం ఇసుక కూడా అయిపు, అజా లేకుండా మాయమైపోయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్‌లు ఇద్దరూ ఈ అంశాలపై చూసిచూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలూ వచ్చాయి.
అవసరమైన వారికైనా ఇసుక ఉచితంగా ఇప్పించేందుకు ఏమైనా ఏర్పాట్లు చేశారా? లేదు. పైగా ఇసుకకు జీఎస్టీ, సీవరేజీ ఛార్జి అని ప్రభుత్వం పేరు చెప్పి వసూలు చేశారు. దీంతో ప్రజలు గగ్గోలు పెట్టారు. కొంత సమయం తరువాత ఇసుక రీచ్‌లన్నింటినీ పైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. రెండు ,మూడు నెలల్లోనే బోలెడన్నిసార్లు ఇసుక పాలసీని మార్చారు. ఇంత చేసిన తరువాతైన ఇసుక సక్రమంగా లభిస్తోందా? ఊహూ..! పైగా.. బాట ఛార్జిలనీ, లోడింగ్ ఛార్జీలంటూ కలిపి బాదుతున్నారని సమాచారం.
జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా... ఇసుక అమ్మకాల ద్వారా సుమారు నాలుగువేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. కానీ అప్పట్లో టీడీపీ, జనసేన బీజేపీ నేతలు ప్రజలపై ఇంత భారం మోపుతారా? అని దుష్ప్రచారానికి దిగారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం మంచిదా? లేక ప్రస్తుతం జరుగుతున్నట్లు ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్లడం కరెక్టా? ఇవన్నీ ప్రజలు గమనించరా?
తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి బహిరంగంగానే తనకు రావాల్సిన కమిషన్ 30 శాతం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినా ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదన్నది అక్కడి ఎమ్మెల్యేకు, ప్రజలకు తెలియకుండా పోతుందా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. చంద్రబాబు స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎమ్మెల్యేలు అవినీతి అనండి..ఇంకొకటి అనండి..ఏమి చేసినా, అది జనానికి తెలియకుండా ఉంటే ఫర్వాలేదు. వారి గురించి జనం మరీ ఎక్కువగా తిట్టుకుంటున్నట్లు సమాచారం వస్తే, అప్పుడు ఆయన ఆగ్రహం చెందినట్లు ఎల్లో మీడియాకు లీకులిస్తూంటారు.
ఎమ్మెల్యే పదవికి పోటీచేసినప్పుడు వారితో ఎంత ఖర్చు పెట్టించింది ఆయనకు తెలుసు కదా! దానికి తగ్గట్లుగా ఇప్పుడు ఇసుక, మద్యంలలో ఆదాయం వచ్చేలా చేసిందే చంద్రబాబు అని చాలామంది అభిప్రాయం. చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఉత్తిపుణ్యానికి పార్టీ నేతలు వందల, వేల కోట్ల విలువైన ఇసుకను సొమ్ము చేసుకుంటూటే చూస్తూ ఉరకుంటాడా? పోలీసులతో కనీసం కేసులైనా పెట్టించి ఉండాల్సింది కదా? అలా ఏం చేయలేదంటే అర్థమేమిటి? చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య ఇసుక విధానం బాగోలేదని అన్నప్పుడు చంద్రబాబు వివరాలు కోరాలి కదా! కానీ బాబు ఆయన్ను చివాట్లు పెట్టేలా మాట్లాడినట్లు అనిపిస్తుంది.
"ముందు మీరు ఇసుక పాలసీలో ఏముందో తెలుసుకుని మాట్లాడండి..ఎక్కడైనా సమస్య ఉంటే చెప్పండి’’ అని చంద్రబాబు అన్నారట. ఇది ఎల్లో మీడియాలో వచ్చిన విషయమే. చంద్రబాబు ఈ మాట అన్న తర్వాత ఏ ఎమ్మెల్యే అయినా నోరు తెరవడానికి సాహసిస్తారా? ఇలాంటి వాటిని ప్రజలు గమనించరా? ఇక ఎమ్మెల్యేలే ఆశ్చర్యపోయే విషయాలు కూడా చంద్రబాబు చెప్పినట్లు అనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన 150 రోజులలోనే అనేక హామీలు అమలు చేశామని ఆయన అన్నారట. ఏ రాష్ట్రంలోను ఇవ్వని విధంగా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని అన్నారట.
అన్నా క్యాంటీన్లు, దీపం పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆయన చెప్పేవి నిజమో, కాదో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలియదా! 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం సుమారు 45 లక్షల పెన్షన్లు ఇస్తే, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఆ పెన్షన్లను పార్టీలకు అతీతంగా 64 లక్షలకు పెంచింది. ఆ సంఖ్యను చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారన్న మాట. అయితే పెన్షన్‌ను రూ. వెయ్యి పెంచి ఇచ్చింది వాస్తవం. ఆ హామీని నెరవేర్చినా, ఈ కొద్ది నెలల్లో కొన్ని లక్షల మందికి పెన్షన్లు కట్ అయ్యాయన్న సంగతిని ఎమ్మెల్యేలు మర్చిపోవాలన్నమాట. అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు కానీ భోజనం నాణ్యత గురించి వస్తున్న విమర్శలు తెలిసినవే.
దీపం స్కీమ్‌లో కోటిన్నర కుటుంబాలకు ఉచిత సిలిండర్లు ఇస్తారనుకుంటే ఇప్పటికి కేవలం ఐదు లక్షల మందికే ఇచ్చారు. అయినా ఈ హామీ అమలు చేసినట్లు భావించాలన్నమాట. ఈ రకమైన ప్రచారమే చేయాలని ఆయన శాసనసభ్యులకు సూచిస్తున్నారు. ఎక్కడన్నా సూపర్ సిక్స్ అంశాలను, ప్రత్యేకించి తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు, ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ప్రతి నెల రూ.1500 నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల రూ.మూడు వేలు మొదలైనవాటి గురించి ఎమ్మెల్యేలకు ప్రశ్నించాలని ఉన్నా, వారు నోరు తెరవక ముందుగానే తాళం వేసేశారన్న సంగతి అర్థం చేసుకోవాలి.
ప్రజలు వీటిని గ్రహించకుండా ఉంటారా? ఇక మద్యం విషయం కూడా చెప్పుకోవాలి. గతంలో ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేసి, మద్యాన్ని నియంత్రించే యత్నం జరిగింది. ఎక్కడో ఊరుబయట షాపులు ఉండేవి.అక్కడకు వెళ్లాలంటేనే కాస్త సిగ్గుపడే పరిస్థితి ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ షాపులు వచ్చేశాయి. ప్రైవేటు సిండికేట్లు రాజ్యం ఏలుతున్నాయి. బెల్ట్ షాపుల సంగతి సరేసరి. కొన్నిచోట్ల ఆ బెల్ట్ షాపుల వద్ద బడులకు వెళ్ళే పిల్లలు కూర్చుని కనిపిస్తున్నారు. ఇదంతా సంక్షేమం, అభివృద్దిని జోడు గుర్రాల్రా పరుగెత్తులించడమేనని ఎమ్మెల్యేలు అనుకోవాలన్నమాట. ఎందుకంటే చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ మద్యం షాపులలో వాటాలు పొందారట.
ఎవరైనా వాటా ఇవ్వకపోతే వారిని బెదరించారన్న వార్తలు టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియాలో కూడా వచ్చాయి. అంతా అయిపోయాక చంద్రబాబు ఎమ్మెల్యేలను ఇసుక, మద్యం విషయాల్లో జోక్యం చేసుకోకండని నీతి వచనాలు చెప్పారనుకోవాలి. దానివల్ల ఉపయోగం ఏమి ఉంటుంది? మద్యం షాపులలో ఏ టీడీపీ నేతకు ఎంత వాటా ఉందో ప్రజలకు తెలియదా? పోలీసు యంత్రాంగానికి తెలియదా? వారి ద్వారా చంద్రబాబుకు సమాచారం ఉండదా? ఉంటుంది. అయినా ఉపన్యాసం చెప్పేటప్పుడు అలాగే మాట్లాడాలి. అది ఆయన తెలివితేటలకు నిదర్శనమని వేరే చెప్పనవసరం లేదు. ఇక మరికొన్ని అంశాలు చూడండి.
ప్రతి నియోజకవర్గానికి పర్యాటక హబ్ అట. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు ఏర్పాటు అట. దానికి ఎమ్మెల్యే ఛైర్మన్ అట. అయితే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయించే బాధ్యత కూడా ఎమ్మెల్యేలే తీసుకోవాలట. ఇవన్ని జరిగే పనులే అయితే పద్నాలుగేళ్లు సీఎంగా ఇప్పటికే అనుభవం ఉన్న చంద్రబాబు ఈ పాటికే అమలు చేసి ఉండేవారు కదా అని ఎవరికైనా సందేహం వస్తే, అది వారి మనసులోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరైనా ప్రశ్నిస్తే, వెంటనే వారికి క్లాస్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా! శాసనసభలో ఎమ్మెల్యేలు అన్ని విషయాలు చర్చించాలని చెబుతూనే గత ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నట్లుగా సంకేతాలు ఇవ్వడం ఆయన విశిష్టతగా భావించాలి.
ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వ తీరును, ఎమ్మెల్యేలు, కూటమి నేతల ప్రవర్థనను ప్రజలు ఇప్పటికే గమనించారు. ప్రజలలో గూడు కట్టుకున్న అసంతృప్తిని డైవర్ట్ చేయడానికే ఇప్పుడు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులతో దాడులు చేయిస్తున్న సంగతిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అయినా తన ప్రచార వ్యూహాలతో జనాన్ని మాయ చేయాలన్నదే చంద్రబాబు ప్లాన్ అని వేరే చెప్పనవసరం లేదుగా! అది చంద్రబాబు నాయుడి తెలివి అనుకోవాలో, మరేమనుకోవాలో!
::: కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment