నిజం నిప్పులాంటిది అంటారు. ఆ నిప్పును ఎంత దాచిపెట్టాలన్నా అది సాధ్యం కాదు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెందిన విషయాన్ని సాధ్యమైనంత మేర బయట ప్రజలకు తెలియకుండా చేయాలని టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి విశ్వ ప్రయత్నం చేశాయి.
కానీ, జనం నుంచి వచ్చిన ఆగ్రహావేశాల నేపధ్యంలో ఆ మీడియా సైతం ఎంతో కొంతమేర ప్రజల కష్టాలను కవర్ చేసి తమ మీడియాలో ఇవ్వక తప్పలేదు. వరద బాధితులు పడుతున్న బాధలు, కష్టాలను సాక్షి మీడియా విస్తారంగా ఇవ్వడంపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మిగిలిన మీడియాలో చాలా భాగం వరకు ఆయన మేనేజ్ చేయగలిగారు. అందువల్లే ఏపీలో ముఖ్య నగరం అయిన విజయవాడలో ప్రజలు వరదకు గురై తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమాచారాన్ని ఆంగ్ల పత్రికలు సైతం అంతంత మాత్రంగానే ఇచ్చాయి. హైదరాబాద్ ఎడిషన్లలో ఏపీ ప్రభుత్వ వైఫల్యంపై వార్తలు రావడం లేదు.
సాధారణంగా ఇలాంటి పరిస్థితులను జాతీయ స్థాయిలో కవర్ అయితే కేంద్రం కూడా బాగా స్పందించే అవకాశం ఉంటుంది. కానీ, దేశ స్థాయిలో చంద్రబాబు పరువు పోతుందన్న భావనతో ఈ వార్తలు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. సాక్షి మీడియా కనుక లేకపోతే విజయవాడ వరద బాధితుల కష్టాలు వెలుగులోకి వచ్చేవి కావు. చంద్రబాబు ఆగ్రహావేశాలు, టీడీపీకి చెందిన కొందరు చేసిన దాడులను తట్టుకుని ‘సాక్షి’ మీడియా విస్తారంగా వార్తలు కవర్ చేసింది. దాని ఫలితంగానే ప్రభుత్వం కొంత దిగి వచ్చింది. బాధితులకు సాయం చేయడానికి చివరికి గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో వలంటీర్లుగా పనిచేసినవారి సేవలను వినియోగించుకోక తప్పలేదు.
వైఎస్ జగన్ అప్పట్లో ప్రతీ బాధితుడికి ఇంటి వద్దే సాయం అందించాలని స్పష్టంగా ఆదేశించేవారు. ఆ ప్రకారమే వలంటీర్లు, సిబ్బంది పనిచేసేవారు. కానీ, ఇప్పుడు పాల ప్యాకెట్ల కోసం, ఆహార పొట్లాల కోసం ప్రజలు వాహనాల వద్ద ఎగబడే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది. అయినా అనేక ప్రాంతాలలో ప్రజలకు ఆహారం అందలేదు. పాలు దొరకలేదు. నీటి సమస్య అయితే అంతా ఇంతా కాదు. పారిశుద్ద్యం క్షీణించడంతో వరద ప్రాంతాలలో ప్రజలు నివసించడమే గండంగా ఉంది. ఎక్కడ అంటు రోగాలు వస్తాయోనని అంతా భయపడుతున్నారు. ఇప్పటికైనా వలంటీర్లను వాడుకోవాలన్న ఆలోచన రావడం గుడ్డిలో మెల్ల.
ప్రజలకు అలాగే గత ప్రభుత్వం ప్రజలకు రేషన్ అందించడానికి వేల సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేసి వారి ఇళ్ల వద్దకే సరఫరా చేసేది. కూటమి ప్రభుత్వం రాగానే ఆ వాహనాలను ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు. అవన్ని వృథా అని భావించారు. కానీ, ఇప్పుడు అవే వాహనాల ద్వారా బాధితులకు సరుకులు సరఫరా చేస్తున్నారు. బుడమేరు వరద కారణంగా విజయవాడలో మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఎంత మంది మరణించారో ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం లేదు. అస్వస్థతకు గురైన వారిని కానీ, మరణించిన వారి శవాలను కానీ తరలించడానికి అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. దాంతో ఒక వ్యక్తి తన భార్య మృతదేహాన్ని తోపుడు బండిపై తోసుకువెళుతూ కనిపించిన దృశ్యం అందరిని కలచివేసింది. పద్నాలుగు మంది కుటుంబం ఒక ఇంటిలో నిలబడిపోతే ఒక్క ఆహార పొట్లాన్ని మాత్రమే ఇచ్చారని, దీనిని ఎలా సర్దుకోవాలని ఒక మహిళ ప్రశ్నించింది.
ఈ కథనాలను అత్యధికంగా సాక్షి మీడియానే ఇస్తూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తోంది. ఇతర ప్రాంతాల ప్రజలకు తెలియ చేస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లోమీడియా చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ కాకూడదన్న లక్ష్యంతో పనిచేస్తూ ప్రజల బాధలను విస్మరించాయి. దాంతో విజయవాడ ప్రాంతంలో ప్రజలలో ఈ మీడియా పత్రికలు, టీవీలపై అసంతృప్తి ఏర్పడింది. ఆ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. తెలుగుదేశం యువగళంలో పనిచేసిన ఒక కార్యకర్త సాక్షి టీవీ రిపోర్టర్ వద్దకు వచ్చి వరద పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం అసలు పనిచేస్తున్నట్లు లేదని, తాను టీడీపీ వ్యక్తిని అయినా ఈ విషయం చెప్పడానికి వచ్చానని కెమెరా ముందు తెలిపారు.
గతంలో వరదలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు జాగ్రత్తలు తీసుకున్నా, బాధితులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా వలంటీర్ల మొదలు, అధికార యంత్రాంగం అంతా వేగంగా పనిచేసేలా చర్యలు చేపట్టినా, ఈనాడు, జ్యోతి తదితర టీడీపీ మీడియా విపరీతమైన ద్వేషంతో వ్యతిరేక వార్తలు ఇచ్చేవి. అత్యధిక భాగం అవాస్తవాలను వండివార్చేవి. వాటి ఆధారంగా చంద్రబాబు అప్పట్లో తీవ్రంగా విమర్శలు చేసేవారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు వ్యతిరేక వార్తలు రాకూడదని శాసించాలని చూస్తున్నారు. ఒకవేళ ఇచ్చినా అదంతా అధికారుల తప్పే కాని తనది కాదని ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే రీతిలో వార్తలను ఇస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. సుమారు పాతిక మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు వైఎస్సార్‌సీపీ అని ముద్రవేసి పక్కనబెట్టారు. మిగిలిన వారంతా తమకు అనుకూలమైన వారిగా భావించి పోస్టింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు వీరు కూడా వైఎస్సార్‌సీపీ భక్తులని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అసలు ముఖ్యమంత్రి చేయవలసిన విధులను నిర్వర్తించకుండా, అధికారులకు ఒక డైరెక్షన్ ఇవ్వకుండా, తనతో పాటు వరదలలో తిప్పుకుని, ఇప్పుడేమో వారిపైన విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగులు సరిగా పనిచేయలేదని అంటున్నారు.
అంతేకాక వైఎస్సార్‌సీపీ కుట్రలు అన్నట్లుగా దాడి చేస్తున్నారు. చంద్రబాబు తీరుతో అధికారులు, ఉద్యోగులు అసహనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తమపై ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టీడీపీ మీడియా కూడా రెండు రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను కొంతమేర అయినా కవర్ చేయక తప్పలేదు. ఆంధ్రజ్యోతి పత్రిక 'కష్టాలు కన్నీళ్లు’ హెడింగ్‌తో బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. హాహాకారాలు, ఆర్తనాదాలు, ప్రధాన ప్రాంతాలకే పరిమితం అయినా సాయం అంటూ కొన్ని వాస్తవాలను రాయకతప్పలేదు. ఈనాడు పత్రిక బుధవారం నాడు 'మూడో రోజూ ముంపులోనే’ అన్న హెడ్డింగ్ పెట్టింది. అదే సమయంలో చంద్రబాబుకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు అని సబ్ హెడింగ్ పెట్టింది. పునరావాస శిబిరాలకు వేల మందిని తరలించారని, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యవేక్షిస్తున్నారని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఇక్కడ విశేషం ఏమిటంటే బుడమేరు రెగ్యులేటర్ షట్టర్లు శనివారం రాత్రికి రాత్రే ఎత్తడంతో విజయవాడ మునిగిపోయిందని ఈనాడులో స్థానికంగా ఒక వార్త ఇచ్చారు. బుడమేరు వరద కృష్ణాలో అధికంగా కలిస్తే నీరు వెనక్కి తన్నుతుందన్న భావనతో షట్టర్లు ఎత్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇల్లు ముంపునకు గురి కాకుండా ఉండడానికి అని మాత్రం రాయకుండా వీటీపీఎస్‌కు ఇబ్బంది రాకూడదని గేట్లు ఎత్తారని పేర్కొంది. ఈనాడుకు, చంద్రబాబుకు మధ్య ఉన్న లింక్ అందరికి తెలిసిందే. మార్గదర్శి అక్రమాలకు సంబంధించి హైకోర్టులో ఉన్న అప్పీళ్లను ప్రభుత్వం ఉపసంహరించుకుని ఆ సంస్థ యాజమాన్యానికి గిప్ట్ ఇచ్చింది. దీనిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. ఏది ఏమైనా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా, వరదలు వంటి సంక్షోభాలను ఎదుర్కొన్న వైనాన్ని ప్రజలంతా గుర్తు చేసుకోవడమే కాకుండా , ఈ ఐదేళ్లు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనలో తమకు ఈ బాధలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment