సాక్షి, చిత్తూరు: అక్కడేం ఎన్నికలు జరగడం లేదు. విజయోత్సవాల నిర్వహణ అంతకన్నా కాదు. అయినా పండుగకు ఏమాత్రం తీసిపోని వాతావరణం వెల్లివిరిసింది. రాజన్న బిడ్డ తమ గడ్డకు సీఎం హోదాలో వచ్చిన వేళ.. మురిసిపోయిన కుప్పం జనసంద్ర సంబురమే అదంతా!.
అడుగడుగునా స్వాగత తోరణం.. వయసుతో సంబంధం లేకుండా ‘వైఎస్ జగన్’ నినాదాలు. తమ సంక్షేమం కోసం ఆలోచిస్తున్న నేతను చూడాలనే ఉత్సాహం, అంతకు మించి అభిమానం.. మూడు కిలోమీటర్ల మేర వాళ్లను ఎండనుసైతం లెక్కచేయకుండా నిలబెట్టింది. సంక్షేమ పథక అమలుతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తమ చెంతకు వచ్చిన రాజన్న బిడ్డకు జనం పట్టిన నీరాజనం ఇది.
కుప్పం పాత పేట వద్ద హెలిప్యాడ్ చెంత నుంచి సభా ప్రాంగణ వేదిక దాకా.. దారి వెంబడి వైఎస్ కుటుంబ అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బారులు తీరారు. జగనన్న అంటూ యువత నినాదాల నడుమ.. ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది కుప్పం. తమ బాగోగులు చూస్తున్న మనవడి కోసం అవ్వాఅయ్యాలు.. పెద్దకొడుకులా కుటుంబానికి అండగా నిలుస్తున్నందుకు అమ్మలు, తోబుట్టువుల్లాగా తమను ఆదరిస్తున్నందుకు అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు.. విద్యను అందిస్తూ మేనమామ కోసం విద్యార్థులు కుప్పంలోనూ తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
చంద్రబాబు ఇలాకాగా, టీడీపీ కంచుకోటగా జబ్బలు చరుచుకునే పచ్చ నేతలకు.. జన నేతకు లభిస్తున్న సాదర ఘనస్వాగతం ఏమాత్రం మింగుడుపడని విషయమే!. ముప్ఫైమూడు ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని కుప్పంలో.. ఈ మూడేళ్లలో సీఎం జగన్ ఎంతో చేసి చూపించారని, జనసంక్షేమ పథకాలను తాము అర్థం చేసుకున్నామని అంటున్నారు అక్కడి జనం. ఇక ఈ జోష్‌తో.. వచ్చే ఎన్నికల్లో కుప్పం గడ్డ జగన్ అడ్డాగా మారబోతోందని, అక్కడ కూడా వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు.
Comments
Please login to add a commentAdd a comment