సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిమ్మ, బత్తాయి సాగు, ఎగుమతులను ప్రోత్సహించే సంకల్పంతో 2021–22 సంవత్సరాన్ని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలో నిమ్మ, బత్తాయి (చీని) సాగును ప్రోత్స హించడం ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం, గ్రామాల్లో ఉపాధి, వారి జీవనప్రమాణ స్థాయిని పెంపొందించేలా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యానపంటల సాగు, దిగుబడి, ఎగుమతులు తదితర అంశాలపై ఉద్యాన వర్శిటీ శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖాధికారులతో మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఆంధ్రా బత్తాయితోపాటు నిమ్మ సాగు, ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఏడాదిని చీని, నిమ్మ నామ సంవత్సరంగా ప్రకటించామన్నారు.
దేశంలో చీని దిగుబడిలో 66 శాతం మన రాష్ట్రం నుంచే
దేశంలో చీని సాగులో సగం విస్తీర్ణం, దిగుబడిలో 66 శాతం వాటా మన రాష్ట్రానిదేనని చెప్పారు. మన రాష్ట్రంలో 95,982 హెక్టార్లలో సాగవుతోందని, ఏటా 22.03 టన్నుల దిగుబడి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 43 వేల హెక్టార్లలో 7 లక్షల టన్నుల నిమ్మ దిగుబడి వస్తోందన్నారు. నాణ్యమైన అంట్లు, మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి రాష్ట్రంలో చీని, నిమ్మ సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోగరహిత మొక్కలు, అంట్లు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్యానశాఖ సహకారంతో ఉద్యాన శాస్త్రవేత్తలు కృషిచేయాలన్నారు.
ఈ పండ్ల నుంచి ఉత్పత్తులపై చిత్తూరు జిల్లా తిరుపతి, పెట్లూరు, నెల్లూరుల్లో ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయనున్నారని తెలిపారు. రైతుభరోసా కేంద్రాల (ఆర్‌బీకేల) ద్వారా రైతులకు చీని, నిమ్మలో మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సమగ్ర పంటల యాజమాన్యంపై తోటల్లోనే ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జానకిరామ్, ఉద్యానశాఖ కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు.
ఇది ‘చీని, నిమ్మ’ సంవత్సరం
Published Wed, Jun 9 2021 4:14 AM | Last Updated on Wed, Jun 9 2021 4:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment