Chini crop
-
చీనీ సీజన్ ప్రారంభం
అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం జిల్లాలో చీనీకాయల సీజన్ ప్రారంభమైంది. అక్కడక్కడా పంట కోతలు ప్రారంభించారు. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులకు ఊరట లభిస్తోంది. 2020 సంవత్సరంలో కరోనా దెబ్బకు లాక్డౌన్లు విధించడంతో చీనీ రైతులకు భారీ నష్టం కలిగింది. 2021లో సెకెండ్‌వేవ్ వచ్చినా... రికార్డు స్థాయి ధరలు పలకడంతో నష్టాలు పూడ్చుకున్నారు. ఇపుడు కరోనా మూడో వేవ్ ఉన్నా... మార్కెట్లకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఈ సారి కూడా రైతులకు మంచి ధర దక్కే పరిస్థితి ఉన్నట్లు మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. ఆశాజనకంగా మార్కెట్లు ఫ్రూట్»ౌల్ ఆఫ్ ఏపీగా ఖ్యాతి పొందిన ‘అనంత’ ఉద్యానంలో చీనీదే సింహభాగం. జిల్లాలో 2 లక్షల హెక్టార్లకుపైగా ఉద్యానతోటలు విస్తరించి ఉండగా... అందులో చీనీ తోటలే 45 వేల హెక్టార్లలో ఉన్నాయి. గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, అనంతపురం, కూడేరు, రాప్తాడు, ఆత్మకూరు, కనగానపల్లి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రి, పుట్లూరు, నార్పల, తాడిపత్రి, పెద్దపప్పూరు, యల్లనూరు, సీకే పల్లి, పామిడి, గుత్తి, విడపనకల్లు, బెళుగుప్ప, కంబదూరు తదితర మండలాల్లో చీనీ ఎక్కువగా సాగులో ఉంది. సీజన్ ప్రారంభంలో గార్లదిన్నె మండలం ముకుందాపురం బెల్ట్, శింగనమల బెల్ట్ ప్రాంతాల పంట అమ్మకానికి రానుండగా... కొంచెం ఆలస్యంగా తాడిపత్రి, పుట్లూరు ప్రాంతంలో అమ్మకాలు జరగనున్నాయి. జిల్లా దిగుబడులు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల మార్కెట్లకు వెళతాయి. నాగపూర్‌తో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు మరికొంత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు రవాణా అవుతుందని ఉద్యానశాఖ ఏడీ జి.చంద్రశేఖర్ తెలిపారు. ఈసారి అంచనా రూ.1,500 కోట్ల టర్నోవర్ చీనీ క్రయ విక్రయాల సీజన్ ఫిబ్రవరి నుంచి మొదలై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ సీజన్లో 5 లక్షల మెట్రిక్ టన్నులపైగా పంట దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ధరలు బాగుండటంతో ఈ సీజన్లో రూ.1,500 కోట్లకు పైగా టర్నోవర్ జరగవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం టన్ను చీనీకాయలు తోటల్లో రూ.45 వేలు పలుకుతుండగా, అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ.35 వేలు పలుకుతున్నాయి. అయితే తోటల్లోనే పంట విక్రయించడం వల్ల సూటు తదితర ఇతర సమస్యలుంటాయని రైతులు చెబుతున్నారు. ఏదిఏమైనా సీజన్ ప్రారంభంలో ఈ స్థాయి ధరలు పలుకుతున్నందున మున్ముందు మార్చి, ఏప్రిల్, మే నెలలో నాణ్యమైన సరుకు ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉన్నందున ధరలు కూడా బాగా పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ధరలు పెరిగే అవకాశం సీజన్ ప్రారంభంలోనే టన్ను రూ.40 వేలు పలకడం మంచి పరిణామం. మండు వేసవిలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గతేడాది రికార్డు స్థాయి ధరలు పలకడంతో చాలా మంది రైతులు లాభపడ్డారు. ఈ సారి కూడా పరిస్థితి ఆశాజనకంగా ఉందనిపిస్తోంది. నాకు కూడా 8 ఎకరాల్లో చీనీ ఉంది. ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో పంట తొలగిస్తాం. ఈ సారి వేరుకుళ్లు, నల్లి బెడద కారణంగా పెట్టుబడి పెరిగింది. – ప్రసాద్, చీనీ రైతు, మర్తాడు, గార్లదిన్నె మండలం -
ఇది ‘చీని, నిమ్మ’ సంవత్సరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిమ్మ, బత్తాయి సాగు, ఎగుమతులను ప్రోత్సహించే సంకల్పంతో 2021–22 సంవత్సరాన్ని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలో నిమ్మ, బత్తాయి (చీని) సాగును ప్రోత్స హించడం ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయం, గ్రామాల్లో ఉపాధి, వారి జీవనప్రమాణ స్థాయిని పెంపొందించేలా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యానపంటల సాగు, దిగుబడి, ఎగుమతులు తదితర అంశాలపై ఉద్యాన వర్శిటీ శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖాధికారులతో మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఆంధ్రా బత్తాయితోపాటు నిమ్మ సాగు, ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఏడాదిని చీని, నిమ్మ నామ సంవత్సరంగా ప్రకటించామన్నారు. దేశంలో చీని దిగుబడిలో 66 శాతం మన రాష్ట్రం నుంచే దేశంలో చీని సాగులో సగం విస్తీర్ణం, దిగుబడిలో 66 శాతం వాటా మన రాష్ట్రానిదేనని చెప్పారు. మన రాష్ట్రంలో 95,982 హెక్టార్లలో సాగవుతోందని, ఏటా 22.03 టన్నుల దిగుబడి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 43 వేల హెక్టార్లలో 7 లక్షల టన్నుల నిమ్మ దిగుబడి వస్తోందన్నారు. నాణ్యమైన అంట్లు, మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి రాష్ట్రంలో చీని, నిమ్మ సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోగరహిత మొక్కలు, అంట్లు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్యానశాఖ సహకారంతో ఉద్యాన శాస్త్రవేత్తలు కృషిచేయాలన్నారు. ఈ పండ్ల నుంచి ఉత్పత్తులపై చిత్తూరు జిల్లా తిరుపతి, పెట్లూరు, నెల్లూరుల్లో ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయనున్నారని తెలిపారు. రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రైతులకు చీని, నిమ్మలో మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సమగ్ర పంటల యాజమాన్యంపై తోటల్లోనే ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జానకిరామ్, ఉద్యానశాఖ కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
చీనీ రైతు ఉసురు తీసిన అప్పులు
పంటను కాపాడుకునేందుకు బోరు బావుల తవ్వకం పెరుగుతున్న అప్పులు..పిల్లల చదువుల భారం వడ్డీకి కూడా సరిపోని రుణ మాఫీ దిక్కుతోచక విషపు గుళికలు మింగి బలవన్మరణం లింగాల : కళ్లెదుటే ఎండిపోతున్న పంటను కాపాడటం కోసం అప్పుల మీద అప్పు చేసి బోరు బావులు తవ్వించినా ఫలితం లేకపోవడంతో ఓ రైతు దిక్కుతోచక విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. లింగాల మండలం కామసముద్రం గ్రామానికి చెందిన మిట్టా నాగభూషణం శ్రేష్టి(48)కి 12ఎకరాల పొలం ఉంది. అందులో 10 ఎకరాల్లో చీనీ పంట సాగు చేశారు. వరుస కరువులతో భూగర్భ జలాలు అడుగంటి చీనీ పంటకు సాగునీరులేక గత ఏడాది ఎండిపోయాయి. చెట్లను బతికించుకునేందుకు ఐదు బోరు బావులను తవ్వించారు. అయినా భూగర్భ జలాలు లభించలేదు. చేసేదేమిలేక చీనీచెట్లను తెగనరికేశాడు. పంటను కాపాడుకోవడం కోసం బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. ఇతని పెద్ద కుమారుడు హరీష్ బీటెక్ చదువుతుండగా.. మిగిలిన ఇద్దరు కుమారులు సాయి, కార్తీక్‌లు డిగ్రీ చదువుతున్నారు. వీరి చదువుల కోసం కూడా కొంత అప్పు చేశాడు. మొత్తం అప్పు రూ.20 లక్షలకు పేరుకుపోయింది. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో చెల్లించే మార్గం లేక గురువారం సాయంత్రం ఇంటి వద్ద విషపు గుళికలు మింగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆయన్ను పులివెందులలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ‘తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆయన అధికారంలోకి రాగానే అప్పులన్నీ మాఫీ అవుతాయని భావించాం. ఏడాది గడుస్తున్నా ఆ ఊసే లేదు. ఆయన ప్రకటించిన రుణ మాఫీ వడ్డీకి కూడా సరిపోలేదు. దీంతో అప్పులెలా తీర్చాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నాడ’ని మృతుడి కుమారులు, భార్య లక్ష్మిదేవి గుండెలవిసేలా విలపించారు.