నాణ్యమైన చీనీకాయలు
అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం జిల్లాలో చీనీకాయల సీజన్ ప్రారంభమైంది. అక్కడక్కడా పంట కోతలు ప్రారంభించారు. మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులకు ఊరట లభిస్తోంది. 2020 సంవత్సరంలో కరోనా దెబ్బకు లాక్‌డౌన్లు విధించడంతో చీనీ రైతులకు భారీ నష్టం కలిగింది. 2021లో సెకెండ్‌వేవ్ వచ్చినా... రికార్డు స్థాయి ధరలు పలకడంతో నష్టాలు పూడ్చుకున్నారు. ఇపుడు కరోనా మూడో వేవ్ ఉన్నా... మార్కెట్లకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ఈ సారి కూడా రైతులకు మంచి ధర దక్కే పరిస్థితి ఉన్నట్లు మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి.
ఆశాజనకంగా మార్కెట్లు
ఫ్రూట్»ౌల్ ఆఫ్ ఏపీగా ఖ్యాతి పొందిన ‘అనంత’ ఉద్యానంలో చీనీదే సింహభాగం. జిల్లాలో 2 లక్షల హెక్టార్లకుపైగా ఉద్యానతోటలు విస్తరించి ఉండగా... అందులో చీనీ తోటలే 45 వేల హెక్టార్లలో ఉన్నాయి. గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, అనంతపురం, కూడేరు, రాప్తాడు, ఆత్మకూరు, కనగానపల్లి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రి, పుట్లూరు, నార్పల, తాడిపత్రి, పెద్దపప్పూరు, యల్లనూరు, సీకే పల్లి, పామిడి, గుత్తి, విడపనకల్లు, బెళుగుప్ప, కంబదూరు తదితర మండలాల్లో చీనీ ఎక్కువగా సాగులో ఉంది. సీజన్ ప్రారంభంలో గార్లదిన్నె మండలం ముకుందాపురం బెల్ట్, శింగనమల బెల్ట్ ప్రాంతాల పంట అమ్మకానికి రానుండగా... కొంచెం ఆలస్యంగా తాడిపత్రి, పుట్లూరు ప్రాంతంలో అమ్మకాలు జరగనున్నాయి. జిల్లా దిగుబడులు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల మార్కెట్లకు వెళతాయి. నాగపూర్‌తో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు మరికొంత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు రవాణా అవుతుందని ఉద్యానశాఖ ఏడీ జి.చంద్రశేఖర్ తెలిపారు.
ఈసారి అంచనా రూ.1,500 కోట్ల టర్నోవర్
చీనీ క్రయ విక్రయాల సీజన్ ఫిబ్రవరి నుంచి మొదలై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ సీజన్‌లో 5 లక్షల మెట్రిక్ టన్నులపైగా పంట దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ధరలు బాగుండటంతో ఈ సీజన్‌లో రూ.1,500 కోట్లకు పైగా టర్నోవర్ జరగవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం టన్ను చీనీకాయలు తోటల్లో రూ.45 వేలు పలుకుతుండగా, అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ.35 వేలు పలుకుతున్నాయి. అయితే తోటల్లోనే పంట విక్రయించడం వల్ల సూటు తదితర ఇతర సమస్యలుంటాయని రైతులు చెబుతున్నారు. ఏదిఏమైనా సీజన్ ప్రారంభంలో ఈ స్థాయి ధరలు పలుకుతున్నందున మున్ముందు మార్చి, ఏప్రిల్, మే నెలలో నాణ్యమైన సరుకు ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉన్నందున ధరలు కూడా బాగా పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు.
ధరలు పెరిగే అవకాశం
సీజన్ ప్రారంభంలోనే టన్ను రూ.40 వేలు పలకడం మంచి పరిణామం. మండు వేసవిలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గతేడాది రికార్డు స్థాయి ధరలు పలకడంతో చాలా మంది రైతులు లాభపడ్డారు. ఈ సారి కూడా పరిస్థితి ఆశాజనకంగా ఉందనిపిస్తోంది. నాకు కూడా 8 ఎకరాల్లో చీనీ ఉంది. ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెలలో పంట తొలగిస్తాం. ఈ సారి వేరుకుళ్లు, నల్లి బెడద కారణంగా పెట్టుబడి పెరిగింది.
– ప్రసాద్, చీనీ రైతు, మర్తాడు, గార్లదిన్నె మండలం
Comments
Please login to add a commentAdd a comment