సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు సాకే రామకృష్ణ (40) ఆర్థిక సమస్యలతో 2020లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే మండలంలోని బాసంవారిపల్లి గ్రామానికి చెందిన గజ్జెల ఓబయ్య(38)కు సెంటు భూమి కూడా లేదు. ఇతను కూడా అప్పుల బాధ తాళలేక 2019 జూన్ 27న రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తికి చెందిన పుల్లారెడ్డి పేరుపై ఎలాంటి భూమి లేదు.
ఇంట్లో సమస్యలతో ఇతనూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా ఈ జిల్లాలో కండ్లగూడూరుకు చెందిన రమణారెడ్డి, ముప్పాలగుత్తికి చెందిన బాల దస్తగిరి, బందార్లపల్లికి చెందిన ఎ.సోమశేఖర్, పెద్దవడుగూరుకు చెందిన కె.నారాయణస్వామి, తనకల్లు మండలం కోటూరుకు చెందిన శివరామిరెడ్డి, మరో ఎనిమిది మంది.. మొత్తంగా ఇలా రైతులు కాని 16 మంది వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 12 మందికి ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తరఫు నుంచి వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష చొప్పున పరిహారం అందింది. (మిగిలిన నలుగురిలో ఒకరిది కర్ణాటక, మరో మగ్గురు 2013కు ముందే మృతి చెందారు) అయితే వీరంతా రైతులని, వీరి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు.
ఇంతటితో ఆగకుండా ఈ 16 మందితో పాటు ఆత్మహత్య చేసుకున్న 15 మంది రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇటీవల ఆర్థిక సాయం చేసి, రాజకీయంగా వాడుకునేందుకు వ్యూహ రచన చేశారు. వాస్తవానికి ఈ 15 మంది రైతు కుటుంబాలను ప్రస్తుత ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోంది. వీరిలో ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున (అప్పటి నిబంధనల ప్రకారం), ఏడుగురికి రూ.7 లక్షల చొప్పున పరిహారం అందించారు. మరో ఆరుగురు రైతులకు రూ.7 లక్షల చొప్పున సాయం అందించే ప్రక్రియ కొనసాగుతోంది.
నాడు ఒక్కమాటైనా అన్నారా?
2014–19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి చేతులాడలేదు. ప్రతిదానికి ప్రశ్నిస్తాననే పవన్ కల్యాణ్ చంద్రబాబును ఎందుకు పరిహారం ఇవ్వలేదని ఒక్క ప్రశ్నా వేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. పైగా టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా పరిహారం అందించింది. కౌలు రైతులకు కూడా పరిహారం అందజేస్తోంది. ఈ విషయం రాష్ట్రంలో ఏ రైతును అడిగినా చెబుతారు.
ఈ నేపథ్యంలో రైతులు కాని వారిని సైతం రైతులుగా చిత్రీకరించి, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపు కోవడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి పవన్ కల్యాణ్ పొలిటికల్ ‘టూర్’ ప్రారంభించారని రైతు సంఘాల నేతలు, రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కల్యాణ్ హడావిడి చేసిన తీరుపై బాధిత రైతులు సైతం నోరెళ్లపెడుతున్న పరిస్థితి. పరిహారం ఇవ్వడం తప్పు కాకపోయినా, ప్రభుత్వం ఆదుకోనందునే తాను ముందుకు వచ్చానని చెప్పడం సరికాదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అందరూ రైతులేనా?
పవన్‌కళ్యాణ్‌కు రైతులెవరో, కౌలు రైతులెవరో.. చేనేతలెవరో కూడా తెలియని పరిస్థితి. అందరినీ ఒకేగాట కట్టేసి.. చనిపోయిన వారంతా రైతులే అంటూ రాజకీయ విమర్శలు చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నల్లమాడ మండలం వంకరకుంటకు చెందిన చేనేత కార్మికుడు సాకే రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం రూ.లక్ష సాయం అందించింది. ఈ కుటుంబానికి వితంతు పింఛన్, అమ్మ ఒడి పథకాన్నీ వర్తింపజేసింది. ఈ విషయం ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే పవన్ కల్యాణ్ ఇతన్ని కౌలు రైతు అంటూ హడావుడి చేయడంపై ఆ గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు.
పరిహారం ప్రక్రియ ఇలా..
♦రైతులు/ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే అధికారుల పంచనామా మొదలుకొని నివేదిక ఇచ్చే వరకు పక్కాగా వివరాలు సేకరిస్తారు. వీఆర్‌వో లేదా వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌కు, పోలీసులకు సమాచారం ఇస్తారు. వైఎస్సార్ బీమా పోర్టల్‌లో సంబంధిత వ్యక్తి వివరాలు అప్‌లోడ్ చేస్తారు.
♦పోలీసు ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎస్‌ఐతో కలిసి మండల తహశీల్దార్, మండల వ్యవసాయాధికారి (త్రీమెన్ కమిటీ) గ్రామానికి వెళ్లి రైతు ఆత్మహత్యపై అన్ని వివరాలు సేకరిస్తారు.
♦త్రీమెన్ కమిటీ రిపోర్టుకు శవ పంచనామా, పోస్టు మార్టమ్ రిపోర్టు, డెత్ సర్టిఫికెట్, పురుగు మందులు తాగినట్లు రుజువు చేసే రిపోర్టు అన్నీ జత చేయాలి.
♦త్రీమెన్ కమిటీ రిపోర్టు డివిజన్ కమిటీకి పంపిస్తారు. డివిజన్ కమిటీలో ఆర్‌డీవో, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీ ఉంటారు. ఈ కమిటీ మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్థారించుకున్న తర్వాత రైతు ఆత్మహత్యకు పరిహారం ఇవ్వాలని రిపోర్టు తయారు చేసి, వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి ఫైలు జాయింట్ కలెక్టర్‌కు, ఆపై కలెక్టర్‌కు వెళ్తుంది.
♦అనంతరం డైరెక్ట్ బెనిఫిషర్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానంలో నామినీకి సీఎఫ్‌ఎంఎస్ ద్వారా పరిహారం అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment