
గుంటూరు ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న ప్రజాసంక్షేమ పరిపాలనే ఆయన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు మరోసారి ఓటువేసి తప్పు చేయరని, 2024లో జరిగేవి ఆయనకు చివరి ఎన్నికలని పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలో ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయి దంపతులు నెలకొల్పిన శారదానికేతన్ మహిళా విద్యాసంస్థల శతాబ్ది మహోత్సవాల్లో మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల తరువాత బాబుతో పాటు టీడీపీ భూస్థాపితం కానుందని చెప్పారు. తన పాలనలో మేలు జరిగితే తిరిగి వైఎస్సార్‌సీపీకి ఓటెయ్యాలని సీఎం వైఎస్ జగన్ నిర్మొహమాటంగా ప్రజలకు చెబుతున్నారన్నారు. ఇటువంటి మాట చెప్పే దమ్మూ, ధైర్యం ప్రజానాయకుడైన జగన్‌కు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అధికారం దక్కలేదనే అక్కసుతో బాబు ప్రజలను బూతులు తిడుతున్నారని అన్నారు. గతంలో చాన్స్ ఇచ్చిన ప్రజలే తిరిగి ఆయన్ని 23 సీట్లకు పరిమితం చేశారని గుర్తుచేశారు.