సాయితేజ తల్లిని ఓదార్చుతున్న గ్రామస్తులు
మదనపల్లె: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా పని చేస్తూ.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ మృతదేహం కోసం అతని కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు ఆ గ్రామమంతా కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తోంది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువ రేగడవారిపల్లెకు చెందిన సాయితేజ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడని తెలియగానే ఊరికి ఊరే అతడి ఇంటి వద్దకు చేరింది. అప్పటికే విషయం తెలిసి కుప్పకూలిన లాన్స్‌నాయక్ తల్లిదండ్రులు మోహన్, భువనేశ్వరిని ఆ ఊరంతా ఓదారుస్తోంది. తమ ఊరి ముద్దుబిడ్డ ఇక లేడంటే ఇప్పటికీ గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు.
ఎప్పుడూ లేనిది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు.. తల్లి శ్యామల, తాత మోహన్, నాయనమ్మ భువనేశ్వరి గుక్కపట్టి ఏడుస్తుంటే అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగిందో తెలియని చిన్నారులు మోక్షజ్ఞ, దర్శిని వారందరి ముఖాల్లోకి దీనంగా చూస్తుండటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో.. సాయితేజ మృతదేహాన్ని గుర్తించేందుకు వీలుగా ఆర్మీ ప్రత్యేక బృందం అతడి తల్లిదండ్రుల నుంచి రక్త నమూనాలు సేకరించి తీసుకెళ్లింది. వీరి డీఎన్‌ఏల ఆధారంగా లాన్స్ నాయక్ మృతదేహాన్ని గుర్తించి.. శుక్రవారం సాయంత్రానికి స్వగ్రామానికి తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
అంత్యక్రియలకు ఏర్పాట్లు
సాయితేజ మరణవార్త అధికారికంగా ధ్రువీకరించాక ఆయన భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు మదనపల్లె నుంచి ఎగువరేగడ వారిపల్లె గ్రామానికి చేరుకున్నారు. డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఇన్‌చార్జ్ తహసీల్దార్ సయ్యద్ ఎగువరేగడకు వెళ్లి అంతిమ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సాయితేజ పార్థివదేహాన్ని ఇంటికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. వీరజవాన్ అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సైనికాధికారులు, ప్రజలు హాజరవుతారన్న సమాచారంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న మరణవార్త తెలిసిన వెంటనే సాయితేజ సోదరుడు మహేష్ (బీఎస్‌ఎఫ్ జవాన్) సిక్కిం నుంచి గురువారం సాయంత్రం స్వగ్రామం చేరుకున్నాడు. తల్లి, తండ్రి, వదినను ఎలా ఓదార్చాలో తెలియక దుఃఖాన్ని దిగమింగుకుంటూ అందరిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. తన సోదరుడి స్ఫూర్తితోనే దేశ సేవలో చేరానన్నాడు.
‘నన్ను రమ్మని చెప్పి నువ్వెళ్లిపోయావా’
తన బిడ్డ సాయితేజకు ఎప్పుడు ఫోన్ చేసినా ‘మదనపల్లెకు వచ్చేయమ్మా. నా భార్యాబిడ్డలకు తోడుగా ఉండు. నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా’ అనే వాడని తల్లి భువనేశ్వరి వాపోయింది. ‘వ్యవసాయ పనులు పూర్తయ్యాక వస్తాలే బిడ్డా్డ అంటే.. కూలీలు చూసుకుంటార్లేమ్మా. నీవు వచ్చేయని ప్రాధేయపడేవాడు. ఇప్పుడు నా బిడ్డ లేడు. నన్నెవరు చూసుకుంటారు తండ్రీ’ అని రోదిస్తోంది.
‘అందరూ వద్దంటే నేనే పంపిస్తిని’
‘ఆర్మీలోకి పంపొద్దని ఊళ్లో అందరూ చెబుతున్నా నేనే పంపిస్తినే. ఆడు వెళతానని పట్టుపడితే బిడ్డ కోరిక కాదనక పోతినే. ఇప్పుడు ఇట్టా జరిగితే నాకు దిక్కెవరు రామా. నీకు నేనున్నా నాన్నా అనే వాడివే బిడ్డా. మోసం చేసి వెళ్లిపోతివే సామీ. నాకు దిక్కెవరు రామా..’ అంటూ తండ్రి మోహన్ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment