సాక్షి, అమరావతి: మార్గదర్శి సంస్థ వ్యవహారాల విషయంలో చట్టాన్ని ఉల్లంఘించినట్లు విచారణలో రామోజీరావే అంగీకరించాక కొందరు ఇంకా ఆయన్ను సమర్థించేందుకు ప్రయత్నించడం అసంబద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ చట్ట విరుద్ధంగా చందాదారుల సొమ్మును జాతీయ బ్యాంకుల్లో కాకుండా తమ అనుబంధ సంస్థలు, ఇతర చోట్ల పెట్టుబడిగా పెట్టినట్లు రామోజీనే అంగీకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరుతో అక్రమాలకు పాల్పడుతుంటే చట్టం కళ్లు మూసుకుని చూస్తూ ఊరుకోదని తేల్చి చెబుతున్నారు. మార్గదర్శి మరో అగ్రిగోల్డ్ కాకముందే డిపాజిట్‌దారులు, చందాదారుల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్యలు తీసుకుందని పేర్కొంటున్నారు. ‘రామోజీరావు మార్గదర్శి అక్రమాలు –నిజానిజాలు’ అనే అంశంపై ఆదివారం విజయవాడలో స్వర్ణాంధ్ర పత్రిక నిర్వహించిన సదస్సులో పలువురు ప్రముఖులు, న్యాయ కోవిదులు పాల్గొని మాట్లాడారు.
ఉపేక్షిస్తే మాఫియా సామ్రాజ్యమే
– మాజీ ఎంపీ ఉండవల్లి
రామోజీరావు ఆగ్రహిస్తేనో, ఈనాడు పత్రికల్లో వ్యతిరేకంగా రాస్తేనో ఏదో జరిగిపోయే రోజులు పోయాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. గతంలో రాజమండ్రిలో తనను ఓడించేందుకు రామోజీ ఎంతో ప్రయత్నించినా తాను గెలిచానని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పట్ల కూడా ఈనాడు అలాగే వ్యవహరిస్తోందన్నారు. అయితే అప్పుడు జరిగిందే రేపు కూడా జరుగుతుందని వ్యాఖ్యానించారు.
‘రామోజీరావు తాను చట్టాలను పట్టించుకోనంటారు. చట్టాలకు అతీతమన్నట్లుగా వ్యవహరిస్తారు. తనను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదని వాదిస్తారు. తాను ఆర్థిక అక్రమాలకు పాల్పడినా అడగకూడదని వితండవాదం చేస్తారు. 60 ఏళ్లుగా తన అక్రమాలను ఎవరూ ప్రశ్నించలేదు కాబట్టి ఇప్పుడూ అడగడానికి వీల్లేదని చెబుతారు. రామోజీరావు లాంటి వారిని వదిలేస్తే దేశంలో అతిపెద్ద మాఫియా సామ్రాజ్యం తయారవుతుంది’ అని ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
నాడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్లు
‘మార్గదర్శి ఫైనాన్షియర్స్ విషయంలోనూ 2006లో రామోజీరావు అడ్డగోలుగా వాదించారు. హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్) కాబట్టి ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయవచ్చన్న రామోజీ వాదనను ఆర్బీఐ సమ్మతించలేదు. ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో తాము ప్రజల నుంచి రూ.2,600 కోట్లు డిపాజిట్లు సేకరించడం తప్పని రామోజీ ఆర్బీఐ వద్ద అంగీకరించారు. ఆ డిపాజిట్లను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. కానీ ఎవరెవరి నుంచి డిపాజిట్లు వసూలు చేశారో చెప్పమంటే వెల్లడించలేదు. ఆ డిపాజిట్‌దారుల వివరాలు తెలియచేయాలని ఇటీవలే సుప్రీం కోర్టు ఆదేశించింది.
హాయిగా మంచంపై పడుకుని..
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను నిర్వహిస్తున్న రామోజీరావు అసలు తాను కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని పట్టించుకోనని సీఐడీ విచారణలో వాదించడం బరితెగింపే. చిట్‌ఫండ్ సంస్థలు తమ చందాదారుల నుంచి వసూలు చేసే సొమ్మును జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని చట్టంలో ఉంది. కానీ ఆ నిధులను రామోజీరావు తన సొంత సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై రామోజీరావు, ఆయన కోడలిని విచారించేందుకు సీఐడీ అధికారులు వారి ఇంటికే వెళ్లాల్సి వచ్చింది. రామోజీరావు హాయిగా మంచంపై పడుకుని ఉంటే సీఐడీ అధికారులు ఏవో ప్రశ్నలు అడిగి వచ్చారు. దేశంలో ఇతరులకు అలా సాధ్యం అవుతుందా? పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తారు. రామోజీరావు కాబట్టి ఏదైనా చెల్లుతుంది.
సహకార వ్యవస్థను దెబ్బతీసి అక్రమాలు
సహకార బ్యాంకింగ్ వ్యవస్థను రామోజీరావే దెబ్బతీశారు. సహకార బ్యాంకులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయని ఈనాడులో పెద్ద వార్తలు రాసి మూతబడేలా చేశారు. కానీ అవే చట్టాలు తనకుగానీ, మార్గదర్శి సంస్థకు గానీ వర్తించవని చెబుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం?
అక్రమాలను ప్రశ్నిస్తే కక్ష గట్టడమా?
మార్గదర్శి ఫైనాన్సియర్స్ ప్రజల నుంచి రూ.2,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేస్తే రామోజీరావు గ్రూపు సంస్థలు రూ.1,850 కోట్లు నష్టం చూపించాయి. మరి రామోజీరావు బోర్డు తిప్పేస్తే డిపాజిట్‌దారుల పరిస్థితి ఏమిటని నేను అడగడం తప్పా? మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అక్రమాలను నేను ప్రశ్నిస్తే రామోజీపై కక్ష గట్టానని కొందరు ఆడిటర్లు, న్యాయవాదులు వాదిస్తుండటం విడ్డూరం. రామోజీరావుకు, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు అసలు సంబంధం లేదంటూ రాజాజీ అనే వ్యక్తితో నాపై పరువునష్టం దావా వేయించారు. అప్పుడు ఈ ఆడిటర్లు, న్యాయవాదులు ఒక్కరైనా మాట్లాడారా?
రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ స్పందించారు
ఏపీ విభజన చట్టమే తప్పు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నేను సుప్రీంకోర్టులో కేసు వేశా. దానిపై ఏపీ ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ కావాలని చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన్ను కలసి మరీ అభ్యర్థిస్తే పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలని ఓ ప్రెస్‌మీట్‌లో కోరా. వెంటనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆ కేసులో ఇంప్లీడ్ అవుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ స్పందించారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాల కేసులో సుప్రీంకోర్టులో నేను వేసిన కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ఇంïప్లీడ్ కాలేదు. ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఇంప్లీడ్ అవుతుందో అనే భయంతో రామోజీ ఈనాడులో టీఆర్‌ఎస్‌కు భజన చేస్తున్నారు. సచివాలయాన్ని నిర్మిస్తే మయసభ నిర్మించినట్టుగా పెద్ద పెద్ద వార్తలు వేసి కేసీఆర్‌ను ఖుషీ చేయడానికి ప్రయత్నించారు.
అక్రమాలను అడ్డు్డకోవడం జగన్ బాధ్యత
మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాల కేసులో జగన్ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరిస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసును సమగ్రంగా విచారించి సరైన పరిష్కరం చూపించాల్సిన బాధ్యత సీఎం జగన్‌పై ఉంది. మార్గదర్శి అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రజలకు న్యాయం చేయడం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల్లో అతి ముఖ్యమైంది. దాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత సీఎం జగన్‌పై ఉంది.
టీడీపీతో చర్చకు సిద్ధంగా ఉన్నా
చంద్రబాబు, మార్గదర్శి వ్యవహారాలపై చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో చంద్రబాబు ఎవరినైనా చర్చకు పంపాలి. సింగపూర్, దుబాయిలో చంద్రబాబు ఆస్తులు లాంటి కష్టమైన ప్రశ్నలు ఏవీ నేను అడగను. టీడీపీ ప్రభుత్వంలో వ్యవహారాలపైనే అడుగుతా. పోలవరం ప్రాజెక్ట్‌ను తామే కడతామని చంద్రబాబు ప్రభుత్వం అడిగి తీసుకుందా? లేక మీరే కట్టమని కేంద్రమే ఇచ్చిందా? దానికి సమాధానం చెబితే చాలు. కేంద్రం ఇస్తేనే తాము నిర్మాణ బాధ్యత తీసుకున్నానని చంద్రబాబు శాసనసభలో చెప్పారు. అది నిజం కాదని, చంద్రబాబు ప్రభుత్వం అడిగితేనే సమ్మతించామని నీతి ఆయోగ్ చెబుతోంది’ అని మాజీ ఎంపీ ఉండవల్లి పేర్కొన్నారు.
బాబు – రామోజీ క్విడ్ ప్రోకో
మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించినా, అక్రమాలకు పాల్పడినా సరే అన్ని పార్టీలు రామోజీరావును కీర్తిస్తూ పోటీలు పడి మరీ ప్రకటనలు ఇస్తున్నాయి. చంద్రబాబు – రామోజీరావుకు మధ్య క్విడ్ ప్రోకో ఉంది. తన మాట వినలేదు కాబట్టే ఎన్టీ రామారావును ఈనాడు దించేసింది. ప్రస్తుతం చంద్రబాబు రామోజీరావు చెప్పినట్లే నడుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారంతా పోటీలు పడి మరీ రామోజీరావును సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు, జనసేన పార్టీలు కూడా రామోజీపై కేసు పెట్టడం తప్పని మాట్లాడుతున్నాయి.
చట్టాన్ని ఉల్లంఘించామని అంగీకరించిన రామోజీ
మార్గదర్శి విషయంలో చట్టాన్ని ఉల్లంఘించినట్టు రామోజీరావే అంగీకరించాక ఆయన తప్పు చేయలేదని ఇతరులు ఎవరో మాట్లాడటం అసంబద్ధమని సుప్రీంకోర్టు న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ పేర్కొన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ చట్టాన్ని ఉల్లంఘించి చందాదారుల సొమ్మును జాతీయ బ్యాంకుల్లో కాకుండా ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్టు రామోజీ అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు సెక్షన్ 160 కింద నోటీసులివ్వడాన్ని కొందరు ఆడిటర్లు, న్యాయవాదులు ప్రశ్నించడం సరికాదని సత్యనారాయణ ప్రసాద్ స్పష్టం చేశారు. తమకు ఎవిడెన్స్ చట్టం 126 కింద మాత్రమే నోటీసులివ్వాలన్న వారి వాదన సత్యదూరమన్నారు. సెక్షన్ 126 అన్నది ఒక అర్జిదారు, అతడి న్యాయవాదికి సంబంధించిన వ్యవహారాలకే వర్తిస్తుందన్నారు. కేసు అంశాలపై మాట్లాడినవారికి సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుందని వివరించారు.
ఈనాడును అడ్డం పెట్టుకుని మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు పాల్పడతామంటే ఎలా? అని ప్రముఖ పాత్రికేయుడు కేజీబీ తిలక్ ప్రశ్నించారు. చట్టాలు సక్రమంగా అమలయ్యేలా వాచ్‌డాగ్‌గా ఉండాల్సిన మీడియా కొందరి పెంపుడు కుక్కగా మారుతుండటం విషాదకరమన్నారు. సమాచార హక్కు చట్టం పూర్వపు కమిషన్ అంబటి సుబ్బారావు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పూర్వ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డితోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సదస్సుకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment