టీడీపీ కూటమి 'వార్నింగ్‌లు.. వాటాలు'! | Liquor traders fears with threats from TDP alliance MLAs | Sakshi
Sakshi News home page

టీడీపీ కూటమి 'వార్నింగ్‌లు.. వాటాలు'!

Published Wed, Oct 9 2024 4:10 AM | Last Updated on Wed, Oct 9 2024 8:40 AM

Liquor traders fears with threats from TDP alliance MLAs

టీడీపీ కూటమి ఎమ్మెల్యేల బెదిరింపులతో మద్యం వ్యాపారుల హడల్‌

ఇతరులెవరైనా దుకాణాలకు దరఖాస్తు చేస్తే అంతు చూస్తామంటూ సిండికేట్ల హెచ్చరికలు 

ఒక్క దరఖాస్తు కూడా రాని దుకాణాలు 56.. ఒక్క దరఖాస్తే వచ్చినవి 116.. రెండేసి వచ్చినవి 254 

లాటరీకి ముందే 426 దుకాణాలు పచ్చముఠాల చేతికి..

పథకంలో భాగంగా రాత్రికి రాత్రే 16 వేల దరఖాస్తులు

బెదిరింపుల్లో తిరుపతి, కృష్ణా, కాకినాడ టాప్‌ 

మద్యం దోపిడీకి ‘ముఖ్య’నేత కనుసన్నల్లో పక్కా ప్రణాళిక  

సాక్షి, అమరావతి:  ‘‘మద్యం దుకాణం లైసెన్స్‌ దక్కించుకోవడం కాదు కదా.. 
కనీసం లైసెన్స్‌కు దరఖాస్తు చేసినా సరే అంతు చూస్తాం...!’’ 
టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు బరితెగించి సాగిస్తున్న బెదిరింపుల పర్వం ఇదీ...!! అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అంత ‘మర్యాదగా’ చెప్పిన తరువాత మద్యం దుకాణం లైసెన్స్‌కు దరఖాస్తు చేసేందుకు ఇతరులు సాహసిస్తారా..? 

టీడీపీ మద్యం సిండికేట్‌ దోపిడీకి రాచబాట పరుస్తూ మద్యం దుకాణాల లైసెన్స్‌ల కేటాయింపునకు రంగం సిద్ధమవుతోంది. అదే సమయంలో అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మభ్యపుచ్చేందుకు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు మరో ఎత్తుగడ వేశారు. తమ సిండికేట్‌ ద్వారానే భారీగా దరఖాస్తులు చేయిస్తూ బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వ ముఖ్య నేత కనుసన్నల్లో పక్కా పన్నాగంతో మద్యం దోపిడీకి వేసిన స్కెచ్‌ ఇలా ఉంది..

రాత్రికి రాత్రే తమ వారితో ఏకంగా 16 వేల దరఖాస్తులు 
టీడీపీ ఎమ్మెల్యేల హెచ్చరికలతో మద్యం దుకాణా­లకు దరఖాస్తు చేయాలని ఆలోచించేందుకు సైతం సామాన్య వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. మరొక్క రోజు మాత్రమే గడువు ఉండగా మద్యం సిండికేట్‌ సోమవారం రాత్రికి రాత్రే తమ వారితో ఏకంగా 16 వేల దరఖాస్తులు దాఖలు చేయించింది. దీంతో మంగళవారం సాయంత్రానికి దరఖాస్తుల సంఖ్యను 39,259కు చేర్చారు. 

⇒ ఇప్పటికీ కూడా రాష్ట్రంలో 56 మద్యం దుకాణా­లకు ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాకపో­వడం గమనార్హం. దీన్నిబట్టి టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్ప­డ్డారో స్పష్టమవుతోంది. ఆ దుకాణాలకు చివరి రోజు టీడీపీ కూటమి ఎమ్మెల్యేల బంధువులే దరఖాస్తు చేసి ఏకపక్షంగా దక్కించుకుంటారన్నది సుస్పష్టం. 

⇒ ఇక 116 మద్యం దుకాణాలకు కేవలం ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చాయి. టీడీపీ కూటమి ఎమ్మెల్యేల బెదిరింపుల ప్రభావం ఇదీ! ఇక ఆ మద్యం దుకాణాలన్నీ కూడా టీడీపీ సిండికేట్‌ పరమైనట్లే!

⇒ 254 మద్యం దుకాణాలకు రెండేసి చొప్పున మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ఆ రెండు కూడా టీడీపీ సిండికేట్‌కు చెందినవే. ఆ దుకా­ణాలను సైతం టీడీపీ సిండికేట్‌ గుప్పిట పట్టినట్టే. 

èలాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియతో నిమిత్తం లేకుండా 426మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌ హస్తగతం చేసుకుందన్న విషయం స్పష్టమవుతోంది. ఇందులో తిరుపతి, కృష్ణా, కాకినాడ జిల్లాలు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. 

⇒ తమను కాదని ఎవరైనా దరఖాస్తు చేసి దుకాణం దక్కించుకున్నా తన సహకారం లేకుండా వ్యాపారం చేయలేరని పత్తికొండలో అధికార పార్టీ ముఖ్యనేత హెచ్చరిస్తున్నారు. లాటరీలో దుకాణం దక్కించుకున్న వారు తనకు 30 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుందని ఆదోని మాజీ ఎమ్మె­ల్యే తన అనుచరులతో ఫోన్ల ద్వారా బెది­రిస్తున్నారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూ­రు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఆలూ­రులో టీడీపీ నేతలు మూడు గ్రూపులుగా విడి­పోయి పర్యవేక్షిస్తున్నారు. కర్నూలులో ఓ మాజీ మంత్రి సోదరుడి కనుసన్నల్లో పాత సిండికేట్‌ నేతలంతా కలసి దరఖాస్తులు వేయిస్తున్నారు.

రూ.2 కోట్లు పెట్టి 100 దరఖాస్తులు వేయించా
సాక్షి, టాస్క్‌ఫోర్స్‌  : తెలుగు తమ్ముళ్లకు మద్యం షాపులు కట్టబె­ట్టేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తు­న్నారు. బయటి వ్యక్తు­లకు షాపులు దక్కకుండా బెదిరింపులకూ దిగుతున్నారు. మంత్రి పొంగూరు నారాయణ తన సొంత డబ్బు­లు రూ.2 కోట్లు ఖర్చుచేసి 100 దరఖాస్తులు వేయించినట్లు చెబుతున్న ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆయన మంగళవారం పార్టీ కార్యకర్తలతో గ్రూప్‌ కాల్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావి­స్తు­న్నారు. 

‘నగరంలో కొందరు నన్ను బ్రాందీ షా­పు­లు కావాలని అడిగారు. 5, 10%అయినా ఇప్పించండని అడిగారు. వారు ధర­ఖాస్తులకు అంత ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి నేనే ఆ ఖర్చు భరి­స్తున్నా. నెల్లూరులో రౌడీ­యి­జం ఒప్పుకోను. దుకా­ణాల వద్దకు వచ్చి ఏ డిపా­ర్ట్‌మెంట్‌ వాళ్లు అడిగినా ఒప్పు­కోను. రూ.2 కోట్లు సొంత డబ్బు ఖర్చుపెట్టి 100 దరఖా­స్తులు వేయిస్తున్నా. వాటిలో 4 నుంచి 5 షాపులు రావచ్చని అను­కుంటు­న్నాను. 



ఒక షాపునకు రూ.80 లక్షలు ఖర్చవుతుంది. 5 లేక 6 మంది కలిసి డబ్బులు రెడీ చేసుకుని సిండికేట్‌గా ఉండండి. బ్రాందీ షాపుల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత డివిజన్‌ ప్రెసిడెంట్‌లు, వైస్‌ ప్రెసిడెంట్‌లు, జనరల్‌ సెక్రటరీలకు ఇస్తు­న్నాను. వారు కూడా ముందుకు రాకపోతే డివిజన్‌ ఇన్‌చార్జిలు, బూత్‌ కన్వీనర్లకు అవకాశమిస్తా’  అంటూ మంత్రి చెప్పినట్లుగా ఈ ఆడియోలో ఉంది. ఆ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

బురిడీ కొట్టించేందుకే సిండికేట్‌తో భారీగా దరఖాస్తులు
రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్‌ ఆగడాలు, బెదిరింపులపై తీవ్రస్థా­యిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇతరులు దరఖాస్తులు చేయకుండా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఏ స్థాయి­లో బెదిరింపులకు పాల్పడు­తు­న్నారో దరఖాస్తుల సంఖ్యే వెల్లడించింది. తొలి ఆరు రోజుల్లో 3,396 దుకా­ణా­లకు కేవలం 8,274 దరఖాస్తులు మాత్రమే రావడం దీనికి నిదర్శనం. దీంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు ‘ముఖ్య’నేత మరో ఎత్తుగడ వేశారు. 

తమ సిండికేట్‌ సభ్యుల ద్వారా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేయించారు. అందులో భాగంగా సోమవారం రాత్రి తరువాతే తమ వారితో ఏకంగా 16 వేల దరఖాస్తులు దాఖలు చేయించారు. తద్వారా భారీగా దరఖా­స్తులు వచ్చినట్లు కనికట్టు చేసేందుకు యత్నించారు. వీటిలో 90 శాతం దరఖాస్తులు టీడీపీ కూటమి సిండికేట్‌కు చెందినవే అన్నది అసలు లోగుట్టు. మద్యం దుకాణా­లన్నీ ఏకపక్షంగా హస్తగతం చేసుకు­నేందుకు పక్కా పథకం వేసినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది.  

30 శాతం వాటా ఇవ్వాల్సిందే..
⇒ శ్రీసత్యసాయి జిల్లావ్యాప్తంగా 8 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో 87 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు. పుట్టపర్తి, హిందూపురం, కదిరి నియోజకవర్గాల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయకుండా బెదిరించి అడ్డుకుంటున్నారు. మడకశిర, పెనుకొండలో ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా కట్టడి చేస్తూ సిండికేట్‌ చివరి రోజు దరఖాస్తులు దాఖలు చేసేందుకు సిద్ధమైంది. 

⇒ వైఎస్సార్‌ కడప జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అధికార కూటమి నేతలే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇతర పార్టీల నేతలు ఇందులో తల­దూ­రిస్తే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నారు.

⇒ అన్నమయ్య జిల్లాలో పీలేరు సహా అన్ని చోట్లా అధికార పార్టీ నేతల హడావుడే కనిపిస్తోంది. 

⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో సిండికేట్‌ మినహా ఇతరులు దరఖాస్తు చేయవద్దని స్థానిక ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. సర్వేపల్లిలో షాపు దక్కించుకున్న వారు తమకు 20 శాతం వాటాతో పాటు మద్యం దుకాణం పక్కన కూల్‌డ్రింక్స్‌ షాపు తాము సూచించిన వారికే ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఆదేశించినట్లు తెలుస్తోంది.

రూ. 30 లక్షలు కప్పం కట్టాలి
⇒ పల్నాడు జిల్లాలో 129 మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్‌కే దక్కేలా అధికార పార్టీ ప్రజాప్రతిని«­దులు పావులు కదుపుతున్నారు. ప్రతి దుకాణా­నికి రూ.20–30 లక్షలు కప్పం కట్టాలంటూ హుకుం జారీచేస్తున్నారు. తమని కాదని దుకా­ణాలు దక్కించుకుంటే ఎలా వ్యాపారం చేస్తారో చూస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ ఎమ్మెల్యే కుమారులు నియోజకవర్గంలో సిండికేట్‌ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ప్రతి దుకాణానికి నలుగురిని కేటాయించి వారే టెండర్‌లో పాల్గొనేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. 

మద్యం టెండర్‌ దక్కించుకున్న పాటదారుడు 25 శాతం వాటా పోను మిగిలిన 75 శాతం వాటాను తాను సూచించిన వారికి ఇవ్వాలని జిల్లాకు చెందిన మరో సీనియర్‌ ఎమ్మెల్యే హుకుం జారీ చేయడంతో ఇతరులు ముందుకు రావడం లేదు. షాపు దక్కించుకున్న వారు తనకు రూ.30 లక్షలు చెల్లించేందుకు సిద్ధపడితేనే టెండర్లు వేయాలని కొత్తగా ఎన్నికైన ఓ ఎమ్మెల్యే తన అనుచరులతో వర్తమానం పంపుతున్నారు.

⇒ ప్రకాశం జిల్లాలో మద్యం దుకాణాలన్నింటినీ చేజిక్కించుకునేలా అధికార పార్టీ ప్రజాప్రతిని­ధులు, వారి కుటుంబ సభ్యులు చక్రం తిప్పుతు­న్నారు. తమ అనుచరులు మినహా మరెవరూ దరఖాస్తు చేసుకోకుండా హుకుం జారీ చేశారు. గిద్దలూరు, మార్కాపురంలో ఎమ్మెల్యేల సోద­రులు కథ నడిపిస్తున్నారు. 

⇒ గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు పరిధిలో షాపు దక్కించుకున్నవారు 50 శాతం వాటా తమవారికి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ఆదేశించినట్లు తెలు­స్తోంది. తమవారు మినహా బయటి వ్యక్తులు దరఖాస్తు చేస్తే ఊరుకునేది లేదని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరిస్తున్నట్లు సమాచారం.

⇒ కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని యనమలకుదురు, ఈడ్పుగల్లు, తాడిగడపలో షాపులకు ఇతరులు ఎవరూ టెండర్లు వేయవద్దని ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ అనుచ­రులు ఫోన్ల ద్వారా హెచ్చరిస్తున్నారు. గన్నవరంతో పాటు ఇతర మండలాల్లో షాపులకు తమ అనుచరులే దరఖాస్తు చేస్తారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తేల్చి చెబుతున్నారు. 

మచిలీపట్నం పరిధిలో చిన్నాపురం, మంగినపూడి, సుల్తానగరంలో షాపులకు టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు పోటీపడుతున్నారు. పెడనలో షాపులు దక్కించుకున్న నిర్వాహకులు స్థానిక ఎమ్మెల్యేకి పావలా వాటా ఇవ్వాలని, తాము చెప్పిన చోటే ఏర్పాటు చేయాలని కూటమి నాయకులు హెచ్చరిస్తున్నారు.

⇒ ఎన్టీఆర్‌ జిల్లాలో లిక్కర్‌ మాఫియాగా పేరు పొందిన యలమంచిలి శ్రీనివాసరావు, గన్నే వెంకట నారాయణ భారీగా షాపులు దక్కించుకునేలా చక్రం తిప్పుతున్నారు. టీడీపీలో ద్వితీయ శ్రేణి నేత ఆలూరి చిన్న గొల్లపూడిలో 30 షాపులకు టెండర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

కంచికచర్ల నందిగామలో దేవినేని ఉమా అనుచరులు గోవర్థన్, గోగినేని అమరనాథ్‌ టెండర్లు వేస్తున్నారు. తమ పరిధిలో ఐదు షాపులకు ఎవరూ టెండర్లు వేయవద్దని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర­రావు అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు.  మైలవరంలో మద్యం షాపుల కోసం ఎమ్మెల్యే బావమరిది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

⇒ బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు సిండికేట్‌గా మారి ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్నారు. చీరాల, బాపట్ల, రేపల్లె తదితర చోట్ల మద్యం దుకాణాల కోసం పట్టుబడుతుండగా వేమూరు, పర్చూరు నియోజకవర్గాల్లో 20 శాతం వాటా డిమాండ్‌ చేస్తున్నారు.

అంతా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..
⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 175 మద్యం షాపు­లకు టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. షాపుల కేటాయింపుల్లో గందరగోళం నెలకొంది. భీమ­వరం రూరల్‌లో 8, కాళ్ల మండలంలో 9 షాపులు కేటాయించగా ఉండి, వీరవాసరం మండలాలకు 4 చొప్పున మాత్రమే కేటాయించారు. ఎమ్మె­ల్యేలు, కుటుంబ సభ్యుల కను­సన్నల్లో సిండికేట్‌ వ్యవహారాలు నడుస్తున్నాయి. 50 నుంచి 75 శాతం వరకు పెట్టుబడిలోని పర్సంటేజీలు అడు­గు­తున్నట్టు తెలుస్తోంది.  

ఇతరులకు షాపులు మంజూరైనా పోలీస్‌ కేసులు తప్పవని బెదిరింపులకు దిగుతున్నారు. పట్టణాల్లో లైసెన్సు ఫీజు రూ.65 లక్షల వరకు ఉండగా రూ.50 లక్షల లోపే ఉండటంతో రూరల్‌ ఏరియాల్లో షాపులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. షాపులు దక్కించుకుని పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.  

⇒ కాకినాడ జిల్లాలో గతంలో టీడీపీ హయాంలో చక్రం తిప్పిన లిక్కర్‌ సిండికేట్‌లు మళ్లీ తెరపైకి వచ్చాయి. టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి సోదరుడు, రామచంద్రపురం జనసేన సీటు ఆశించిన నాయకుడు కాకినాడ సిటీ, రూరల్‌ నియోజ­కవర్గాల్లో చక్రం తిప్పుతున్నారు. తుని, ప్రత్తి­పాడు, కాకినాడ సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే టెండర్లు నిర్వ­హిస్తున్నారు. 

తుని నియోజకవర్గంలో టీడీపీ సీని­యర్‌ నేత అనుచరులు.. దరఖాస్తులు వేయవద్దని ప్రత్యర్థి పార్టీ నేతలకు ఫోన్‌లు చేస్తున్నారు. ఇదే పరిస్థితి పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లోనూ నెలకొంది.

⇒ విశాఖ జిల్లాలో ఒక్కో వైన్‌ షాప్‌ కోసం ఇద్దరు ముగ్గురు మాత్రమే పోటీ పడుతుండడం సిండికేట్‌ దందాకు నిదర్శనంగా నిలుస్తోంది. 2019కి ముందు వరకు జనప్రియ ప్రసాద్‌ (చౌదరి), పుష్కరిణి గణేష్‌(కాపు)తో పాటు గాజువాక ప్రాంతానికి చెందిన మరొకరు వైన్‌షాపుల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సహకారంతో ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం.

⇒ అనకాపల్లి జిల్లాలో గిరాకీ ఉండే నర్సీపట్నం, పాయక­రావుపేట, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి, సబ్బవరం, అచ్యుతాపురం, మాడుగుల, నక్కపల్లి, అడ్డరోడ్డుతోపాటు హైవే అనుకుని ఉన్న దుకాణాలను కూటమి నేతలు దక్కించుకునేందుకు సిండికేట్‌గా మారారు. చోడవరంలో స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.­రాజుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత, మద్యం వ్యాపారి గూనూరు మళ్లునాయుడుకు సంబంధించినవారే ఎక్కువగా దరఖాస్తు చేసినట్లు సమాచారం. 

హోంమంత్రి వంగలపూడి అనిత అనుచరులు, కూటమి నాయకులు 121 మంది జిల్లావ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న దుకాణాలకు సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తు చేశారు. యలమంచిలిలో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ సోదరుడు సతీష్‌కుమార్‌ అనుచరులు సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తు చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, టీడీపీ నేత పీలా గోవింద్‌ అనుచ­రుల సిండికేట్‌ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement