అడ్వెంచర్‌: సాగర గర్భాన వందేళ్ల నాటి నౌకల అన్వేషణ | Livin Adventures: History Finding Under Ocean In Visakhapatnam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళంలో సాగర గర్భాన శిథిలాలు అన్వేషణ

Published Wed, May 19 2021 8:17 AM | Last Updated on Wed, May 19 2021 10:25 AM

Livin Adventures: History Finding Under Ocean In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని సముద్రంలో మునిగిపోయిన నౌకల ఆనవాళ్లను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లను కనుగొని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఓ నౌక ఆనవాళ్లను గుర్తించిన లివిన్‌ అడ్వెంచర్స్‌ బృందానికి ఈ బాధ్యత అప్పగించింది. శ్రీకాకుళం జిల్లాకు సమీపంలో మూడుచోట్ల వివిధ సందర్భాల్లో నౌకలు మునిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ తీరంలో వందేళ్ల క్రితం మునిగిపోయిన బ్రిటిష్‌ ఇండియా నావిగేషన్‌ కంపెనీకి చెందిన చిలకా షిప్‌ ఆనవాళ్లను విశాఖ జిల్లాకు చెందిన లివిన్‌ అడ్వెంచర్స్‌ బృందం 2020లో కనిపెట్టింది. బారువా తీరం చేరే సమయంలో షిప్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఈ నౌక మునిగిపోయింది. ఈ షిప్‌ తీరానికి ఎంత దూరంలో ఉంది, దాని శిథిలాలు ఎలా ఉన్నాయనే విషయాల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఇదే తరహాలో మరో రెండు చోట్ల నౌకలు మునిగిపోయినట్టు చరిత్ర చెబుతోంది. దీంతో శ్రీకాకుళం కలెక్టరేట్‌ వర్గాలు ఆ రెండుచోట్ల అన్వేషణ సాగించాలంటూ లివిన్‌ అడ్వెంచర్స్‌ సంస్థను సంప్రదించాయి.

జోగంపేట, భావనపాడు బీచ్‌లలో..
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్‌కు కొంత దూరంలో విదేశీ నౌక వందేళ్ల క్రితం మునిగిపోయినట్టు చరిత్రలో ఉంది. ఈ షిప్‌ ఎంత దూరంలో మునిగిపోయింది, ఆ షిప్‌ ఏ దేశానికి చెందినది, అది కార్గోనా లేక ప్రయాణికులతో వెళ్లే నౌకా అనే వివరాలు మాత్రం ఎక్కడా లేవు. అదేవిధంగా పోలాకి మండలం జోగంపేట తీరంలోనూ ఒక నౌక మునిగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1944లో జరిగిన బాంబు దాడుల్లో ఒక నౌక జోగంపేట తీరంలో ధ్వంసమైనట్టు గుర్తించారు. దీని పేరు సిలికాన్‌ షిప్‌ అని తెలిసింది. అయితే.. ఈ షిప్‌ ఏ దేశానికి చెందినది, ఎంతమంది ప్రయాణికులతో వచ్చింది తదితర వివరాలేవీ వెలుగులోకి రాలేదు. ఈ రెండుచోట్ల సాగర గర్భంలో చిక్కుకున్న చరిత్ర ఆనవాళ్లని అన్వేషించేందుకు లివిన్‌ అడ్వెంచర్స్‌ సంస్థ సమాయత్తమవుతోంది. ఈ నెల మొదటి వారంలో ఈ బృందం భావనపాడు తీరంలో అన్వేషణ సాగించాల్సి ఉండగా.. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. ఇన్‌స్ట్రక్టర్‌ బలరాం నాయుడు, డైవ్‌ మాస్టర్‌ రాహుల్, అడ్వాన్స్‌ డైవర్‌ లక్ష్మణ్‌ కలిసి సముద్రంలో స్కూబా డైవింగ్‌ చేస్తూ.. అన్వేషణ మొదలు పెట్టనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement