మధ్యాహ్న భోజన నిర్వాహకుల నుంచి వివరాలు సేకరిస్తున్న తహసీల్దార్
సీతానగరం (పార్వతీపురం): మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా సాంబారులో బల్లి కనిపించడంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదన్న వైద్యుల వివరణతో ఊపిరిపీల్చుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని గెంబలివారివీధి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా సాంబారులో చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే హెచ్‌ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు, భోజన నిర్వాహకులు విద్యార్థులను భోజనం చేయనివ్వకుండా నిలువరించారు.
ముందు జాగ్రత్తగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 27 మంది విద్యార్థులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యసేవలు అందించారు. ఆస్పత్రిలో 2 గంటల సేపు వైద్యుల సంరక్షణలో ఉంచారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించడంతో ఉపాధ్యాయులు, విద్యారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎన్‌వీ రమణ, ఆర్‌ఐ రామకృష్ణ, రూరల్ ఎస్‌ఐ వీరబాబు పాఠశాలకు చేరుకుని వాకబు చేశారు. ఆస్పత్రి నుంచి పాఠశాలకు చేరుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటలకు టమాటా రైస్ వడ్డించారు. ఈ ఘటనపై తహసీల్దార్ మాట్లాడుతూ సాంబారులో బల్లిపడడం వాస్తవమేనని, ఉపాధ్యాయులు, నిర్వాహకులు అప్రమత్తం కావడంతో చిన్నారులకు ప్రమాదం తప్పిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment