నరసాపురంలో జనం లేక వెలవెలబోతున్న లోకేశ్ పాదయాత్ర
నరసాపురం రూరల్/పాలకొల్లు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో నారా లోకేశ్ గురువారం నిర్వహించిన పాదయాత్రకు జనస్పందన కరువైంది. నరసాపురం నియోజకవర్గంలో జనం లేక పాదయాత్ర వెలవెలబోయింది. దీంతో స్థానిక టీడీపీ నేతలపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి పెదమామిడిపల్లి వరకు నిర్వహించిన పాదయాత్రకు జన స్పందన కరువైంది.
దిగమర్రు మూడు రోడ్ల కూడలిలో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మహిళలతో ఖాళీ బిందెలు ప్రదర్శించి మంచినీటి సమస్య ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. దిగమర్రు గ్రామంలో కల్లుగీత కార్మికులతో మాట్లాడారు. పెదమామిడిపల్లి చేరుకునేసరికి చీకటి పడింది. దీంతో టీడీపీ కార్యకర్తలు కాగడాలు వెలిగించి ఆగస్టులో కూడా విద్యుత్ కోతలంటూ దుష్ప్రచారం చేశారు. కార్యకర్తలకు పెట్రోల్ కోసం రూ.100, మగవారికి రూ.500, ఆడవారికి రూ.300 చెల్లించి పాదయాత్రకు తరలించినట్టు సమాచారం. పాదయాత్రలో జై బాలయ్య, జై జై నిమ్మల అనే నినాదాలే వినిపించాయి. ఎక్కడా లోకేశ్‌కు అనుకూల నినాదాలు చేయకపోవడం గమనార్హం.
లోకేశ్ టీమ్ నిర్లక్ష్యంతో దంపతులకు గాయాలు
యువగళం బృందం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పాదయాత్ర సందర్భంగా ఓ దంపతులు గాయాల పాలయ్యారు. నరసాపురం మండలం చిట్టవరం వద్ద లోకేశ్ టీమ్‌కు చెందిన కారు డోరు ఒక్కసారిగా తెరవడంతో నరసాపురం వైపు వస్తున్న మోటార్ బైక్‌కు బలంగా తగిలింది. బైక్‌పై ప్రయాణిస్తున్న కడలి మోహనరావు, సరోజిని దంపతులు కిందపడిపోయి గాయాలపాలయ్యారు. పోలీసులు వెంటనే వారిద్దరినీ వాహనంలో తీసుకెళ్లి పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment