
గతంలో తిరుపతి తొక్కిసలాటపై ప్రభుత్వాన్ని తప్పుబట్టిన పవన్‌కళ్యాణ్
ఇప్పుడు పవన్ మంత్రిత్వ శాఖ పరిధిలో అన్నదాన సత్రాన్ని కూల్చివేతను తప్పుబడుతూ లోకేశ్ ట్వీట్
సాక్షి, అమరావతి : కాశినాయన ఆశ్రమానికి చెందిన అన్నదాన సత్రాలను అటవీ శాఖ అధికారులు కూల్చివేయడంపై మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేసిన ట్వీట్ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్ మధ్య నడుస్తున్న అధిపత్య పోరుకు నిదర్శనమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అటవీ శాఖ అధికారులు అన్నదాన సత్రాలను కూల్చివేయడాన్ని తప్పుబట్టిన లోకేశ్ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలో తిరుపతిలో టీటీడీ టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను పవన్‌కళ్యాణ్ తప్పుబట్టారు.
ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నట్టు అప్పట్లో పవన్ ప్రకటించారు. ఇప్పుడు పవన్‌కళ్యాణ్ మంత్రిత్వ శాఖ పరిధిలో కూల్చివేతలను లోకేశ్ తప్పుబట్టడం, ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నట్టు ట్వీట్ చేయడం ద్వారా పవన్‌కు టిట్ ఫర్ టాట్‌గా సమాధానమిచ్చారనే చర్చ నడుస్తోంది. అప్పట్లో టీటీడీ చైర్మన్ రేసులో పవన్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నారనే వార్తలు రాగా.. లోకేశ్ ఏరికోరి బీఆర్ నాయుడిని చైర్మన్‌గా ఎంపిక చేయించారని.. దీనిపై పవన్‌కళ్యాణ్ అసంతృప్తికి లోనయ్యారన్న చర్చ అప్పట్లో సాగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ సైతం క్షమాపణ చెప్పాలంటూ పవన్ అప్పట్లో డిమాండ్ చేశారు.
తాజాగా ఇప్పుడు పవన్ పర్యవేక్షణలోని అటవీ శాఖ అధికారులు కాశినాయన అన్నదాన సత్రాలను కూల్చివేయడాన్ని అందివచ్చిన అవకాశంగా మలుచుకున్న లోకేశ్ ఈ ఘటనపై ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని, సొంత నిధులతో ఆ సత్రాలను నిర్మిస్తానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పట్లో టీటీడీ వ్యవహరంలో పవన్‌కళ్యాణ్ వ్యహరించిన తీరుకు ప్రతిగా ఇప్పుడు లోకేశ్ గట్టిగా చురకలు వేసినట్టయ్యింని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమిలో నెలకొన్న లుకలుకలకు ఇదో ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Comments
Please login to add a commentAdd a comment