రెండేళ్ల క్రితం ఇష్టంలేని పెళ్లి.. ప్రియుడ్ని మరిచిపోలేక.. | Love Couple Suicide In Tirupati Lodge Room | Sakshi
Sakshi News home page

రెండేళ్ల క్రితం ఇష్టంలేని పెళ్లి.. ప్రియుడ్ని మరిచిపోలేక..

Published Wed, Nov 9 2022 9:02 AM | Last Updated on Wed, Nov 9 2022 9:03 AM

Love Couple Suicide In Tirupati Lodge Room - Sakshi

తిరుపతి క్రైం/కొవ్వూరు: ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్తాపానికి గురైన ఓ వివాహిత, ఆమె ప్రియుడు కలిసి తిరుపతిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్‌ జీడిమెట్ల ప్రాంతంలోని షాపూర్‌కు చెందిన అనూష(21)కు తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన గుడ్ల పోసిబాబుతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొవ్వూరు ఆంధ్రా షుగర్స్‌లో పని చేస్తున్న పోసిబాబు తన భార్యతో కలిసి కొంతకాలంగా కొవ్వూరులోనే నివాసం ఉంటున్నారు. 

ఇదిలా ఉండగా.. భార్య అనూష కనిపించడం లేదంటూ పోసిబాబు ఈ నెల 5న కొవ్వూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను 4వ తేదీ తెల్లవారుజామున డ్యూటీకి వెళ్లి 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించ లేదని పేర్కొన్నారు. పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులకు తెలిపాడు. పోసిబాబు ఇంట్లో అనూష రాసిన లేఖ లభించింది. ఈ నేపథ్యంలో పట్టణ ఎస్సై బి.దుర్గాప్రసాద్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. 

ఇక, హైదరాబాద్‌ షాపూర్‌ ప్రాంతానికి చెందిన కృష్ణారావు (23) అనే యువకుడు, అనూష గతంలో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం అనూషకు, పోసిబాబుకు వివాహం చేశారు. కృష్ణారావును మరచిపోలేని ఆమె.. అతడితో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 5న ఇద్దరూ కలిసి తిరుపతి వెళ్లారు. అక్కడి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని త్రిలోక్‌ లాడ్జిలో దిగారు. అక్కడే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

మంగళవారం ఉదయం రూము ఖాళీ చేయాల్సిన వీరు ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. లాడ్జిలో లభించిన ఫోన్‌ ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement