వెంకట సాయి (ఫైల్)- నాగతేజ (ఫైల్)
ఒంగోలు: తొందరపాటు నిర్ణయం ఇద్దరి నిండు ప్రాణాలు గాలిలో కలిపి రెండు కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానిక పెళ్లూరు–రైజ్ ఇంజినీరింగ్ కాలేజీ మధ్య నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వచ్చే రైల్వే ట్రాక్‌పై శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. రైల్వే సీఐ ఎండ్లూరి రామారావు, చీరాల రైల్వే ఎస్‌ఐ నాగరాజు, ఒంగోలు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎంజే కిశోర్‌బాబులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఇద్దరి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. మృతదేహాలను రైలు కొద్ది దూరం లాక్కెళ్లినట్లు గుర్తించారు.
వివరాలు తెలిపిన సెల్‌ఫోన్
సంఘటన స్థలంలో పోలీసులకు ఒక మొబైల్, బైకు తాళం కనిపించాయి. బైకు బైపాస్‌కు కొద్ది దూరంలో నిలిపి ఉంది. సెల్ ఫోన్‌లోని నంబర్లకు ఫోన్ చేయగా యువకుడి వివరాలు తెలిశాయి. మృతుడు చీమకుర్తి మండలం తొర్రగుడిపాడుకు చెందిన మద్ది నారాయణ కుమారుడు వెంకట సాయి(19)గా గుర్తించారు. వెంకట సాయి పాలిటెక్నిక్ పూర్తి చేసి కొద్ది నెలల కిందటి వరకు అమెజాన్‌లో పనిచేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. రోజూ ఒంగోలు వచ్చి వెళ్తున్నట్లు తేలింది. నారాయణకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కాగా ఇద్దరు కుమార్తెలకూ వివాహం చేశాడు. యువకుడి కుటుంబ సభ్యులను విచారించగా యువతి చీమకుర్తికి చెందిన అంతోటి నాగతేజ (19)గా గుర్తించారు. నెల్లూరు జిల్లా సైదాపేటకు చెందిన అంతోటి రవీంద్రబాబు 15 ఏళ్ల క్రితం చీమకుర్తికి వచ్చి గ్రానైట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా నాగతేజ చివరి కుమార్తె.
గతంలో చీమకుర్తి పీఎస్‌లో కౌన్సిలింగ్
ఆరు నెలల క్రితం నాగతేజ బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసింది. ఆమెకు వెంకట సాయి పరిచయమై వారి మధ్య ప్రేమగా మారింది. ప్రియుడితో కలిసి చీమకుర్తి పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరింది. తనను తన తల్లిదండ్రులు బలవంతంగా నిర్బంధించారని, తాము ప్రేమించుకున్నట్లు పేర్కొంది. యువకుడు మైనర్ కావడంతో మేజర్లు అయ్యేంత వరకూ చదువుపై దృష్టి సారించాలని పోలీసులు అప్పట్లో సూచించారు. అనంతరం నాగతేజ ఒంగోలు మంగమూరు రోడ్డులోని హాస్టల్లో ఉంటోంది.
కులాలే కొంప ముంచాయా?
చీమకుర్తి: కులాలు వేరయ్యాయి.. వారి పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రెండేళ్లల్లో సెటిల్ అవ్వండి.. ఆ తర్వాత పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పిన మాటలు ప్రేమజంటలో విశ్వాసం నింపలేదు. అలాగని తల్లిదండ్రులు చెప్పినట్లు వేర్వేరుగా బతకలేక.. వారిని ఎదిరించి ముందుకు వెళ్లలేక చివరకు ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరిలో ఒకరు వైశ్య, మరొకరు గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు. పెళ్లికి తల్లిదండ్రుల నుంచి అనుమతి లేకపోవడం.. ఆరు నెలలుగా జీవించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు సరిపోలేదో ఏమో తెలియదు గానీ ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకటసాయి తండ్రి నారాయణకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పేర్నమిట్ట, ఎండ్లూరు పరిసరాల్లో కూరగాయల వ్యాపారం చేసుకునే నారాయణ ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాగతేజ తండ్రి రవీంద్ర నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తలుపులూరు. ఆయన రామతీర్థం గ్రానైట్ క్వారీలో పనిచేస్తూ చీమకుర్తిలో నివాసం ఉంటున్నారు. ప్రేమజంట ఆత్మహత్యతో చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు, చీమకుర్తిలో విషాదం నెలకొంది.
చదవండి:
హత్య కేసు: గుర్తు తెలిపిన తాళం చెవి!
చిన్నారుల హత్య కేసులో విస్తుపోయే నిజాలు..
Comments
Please login to add a commentAdd a comment