మరో వాయు‘గండం’ | Low pressure formed over South Andaman Sea | Sakshi
Sakshi News home page

మరో వాయు‘గండం’

Published Mon, Nov 30 2020 6:01 AM | Last Updated on Mon, Nov 30 2020 6:01 AM

Low pressure formed over South Andaman Sea - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. సోమవారం రాత్రి వాయుగుండంగా మారనుంది. నివర్‌ తుపాను నుంచి తెప్పరిల్లుతున్న రైతులకు ఈ సమాచారం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించడంతో వారికి దిక్కుతోచడంలేదు. ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం వద్ద కేంద్రీకృతమైన ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. తొలుత వాయుగుండంగా మారే ఈ అల్పపీడనం తరువాత 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉందని పేర్కొంది.

దీని ప్రభావంతో డిసెంబరు 1 నుంచి 3 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలోని కరైకల్‌లో అతి భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి చేపలు పట్టేవారు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. రాయలసీమ.. దక్షిణ కోస్తా ప్రాంతాల్లో చాలాచోట్ల ఆదివారం భారీవర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో కందుకూరులో 9 సెం.మీ., కావలిలో 6, వెలిగండ్ల, సీతారామపురం, కొనకనమిట్లల్లో 3, వింజమూరు, వెంకటగిరి, బెస్తవారిపేట, ఉదయగిరి, పొదిలిల్లో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

నిలువునా ముంచిన ‘నివర్‌’
అక్టోబర్‌లో కురిసిన భారీవర్షాలు, వరదలు తెచ్చిన కష్టాల నుంచి కోలుకోకముందే నివర్‌ తుపాను మరో దెబ్బతీసింది. పంటలను తుడిచిపెట్టేసింది. చిత్తూరు, వైఎస్సార్‌ కడప, నెల్లూరు జిల్లాల్లో పలు చెరువులు, కుంటలు, రోడ్ల తెగిపోయాయి. జాతీయ రహదారుల్లో సైతం వంతెనలు తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పంటచేలు చెరువులను తలపిస్తున్నాయి. కోతకొచ్చిన వేలాది హెక్టార్ల వరి పంట నీటమునిగింది. పలుచోట్ల కోసిన వరి పనలు నీళ్లల్లో తేలాయి. కోతకు వచ్చిన పంట నేలవాలింది. అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమమయ్యాయి.

మిరప, వంగ, బెండ, టమోటా, కాకర, బీర తదితర కూరగాయలు, ఆకుకూరల తోటలు నీళ్లలో కుళ్లిపోయాయి. అరకొరగా ఉన్న పంటనైనా దక్కించుకోవాలని అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలకు మరో ముప్పు పొంచి ఉందని తెలియడంతో దిక్కుతోచటంలేదు. ఇప్పటికే జలవనరులు నిండుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వర్షాలు పడితే మరింత ప్రమాదమని భయపడుతున్నారు. ఫిబ్రవరి నుంచి అకాల భారీవర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టం అంచనాలకు అందనిది. ముఖ్యంగా భారీ పంట నష్టాలతో  రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు.

ముంచేసిన అక్టోబరు



రైతులకు ప్రభుత్వం చేయూత
తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేయూత ఇస్తోంది.
► జూన్‌–జూలై, ఆగస్టు–సెప్టెంబర్‌ నెలల్లో  ఉద్యాన, వ్యవసాయ పంటల రైతులకు ప్రభుత్వం రూ.135,70,52,500 పెట్టుబడి రాయితీ విడుదల చేసింది.
► ఫిబ్రవరి–ఏప్రిల్‌ నెలల మధ్య భారీవర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.10.76 కోట్ల పెట్టుబడి సాయం విడుదల చేసింది.
► కేవలం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అక్టోబరు వరకూ భారీ వర్షాలు, వరదలవల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 279.08 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించింది.
► చంద్రబాబు సర్కారు బకాయిలు వదిలి పెట్టగా చెల్లించిన పెట్టుబడి రాయితీ దీనికి అదనం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement