Low pressure Winds
-
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ శనివారానికి వాయుగుండంగా, 23వ తేదీకి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఆపై ఉత్తరం వైపుగా దిశ మార్చుకుని తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 24న తుపానుగా బలపడనుంది. అనంతరం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఒడిశా తీరాన్ని దాటి 25వ తేదీ నాటికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి ఒక బులెటిన్‌లో వెల్లడించింది. ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు సంభవించవచ్చని వివరించింది. రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తర బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఏపీ, యానాం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నర్సీపట్నం (అనకాపల్లి)లో 4.9 సెంటీమీటర్లు, జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు)లో 2.8, ముండ్లమూరు (ప్రకాశం)లో 2.8, ఆళ్లగడ్డ (నంద్యాల)లో 2.6, తొండూరు (వైఎస్సార్)లో 2.6, ఆస్పరి (కర్నూలు)లో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
మరో వాయు‘గండం’
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. సోమవారం రాత్రి వాయుగుండంగా మారనుంది. నివర్ తుపాను నుంచి తెప్పరిల్లుతున్న రైతులకు ఈ సమాచారం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించడంతో వారికి దిక్కుతోచడంలేదు. ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం వద్ద కేంద్రీకృతమైన ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. తొలుత వాయుగుండంగా మారే ఈ అల్పపీడనం తరువాత 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో డిసెంబరు 1 నుంచి 3 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలోని కరైకల్‌లో అతి భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలోకి చేపలు పట్టేవారు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. రాయలసీమ.. దక్షిణ కోస్తా ప్రాంతాల్లో చాలాచోట్ల ఆదివారం భారీవర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో కందుకూరులో 9 సెం.మీ., కావలిలో 6, వెలిగండ్ల, సీతారామపురం, కొనకనమిట్లల్లో 3, వింజమూరు, వెంకటగిరి, బెస్తవారిపేట, ఉదయగిరి, పొదిలిల్లో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిలువునా ముంచిన ‘నివర్’ అక్టోబర్‌లో కురిసిన భారీవర్షాలు, వరదలు తెచ్చిన కష్టాల నుంచి కోలుకోకముందే నివర్ తుపాను మరో దెబ్బతీసింది. పంటలను తుడిచిపెట్టేసింది. చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో పలు చెరువులు, కుంటలు, రోడ్ల తెగిపోయాయి. జాతీయ రహదారుల్లో సైతం వంతెనలు తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పంటచేలు చెరువులను తలపిస్తున్నాయి. కోతకొచ్చిన వేలాది హెక్టార్ల వరి పంట నీటమునిగింది. పలుచోట్ల కోసిన వరి పనలు నీళ్లల్లో తేలాయి. కోతకు వచ్చిన పంట నేలవాలింది. అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమమయ్యాయి. మిరప, వంగ, బెండ, టమోటా, కాకర, బీర తదితర కూరగాయలు, ఆకుకూరల తోటలు నీళ్లలో కుళ్లిపోయాయి. అరకొరగా ఉన్న పంటనైనా దక్కించుకోవాలని అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలకు మరో ముప్పు పొంచి ఉందని తెలియడంతో దిక్కుతోచటంలేదు. ఇప్పటికే జలవనరులు నిండుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వర్షాలు పడితే మరింత ప్రమాదమని భయపడుతున్నారు. ఫిబ్రవరి నుంచి అకాల భారీవర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టం అంచనాలకు అందనిది. ముఖ్యంగా భారీ పంట నష్టాలతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ముంచేసిన అక్టోబరు రైతులకు ప్రభుత్వం చేయూత తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేయూత ఇస్తోంది. ► జూన్–జూలై, ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో ఉద్యాన, వ్యవసాయ పంటల రైతులకు ప్రభుత్వం రూ.135,70,52,500 పెట్టుబడి రాయితీ విడుదల చేసింది. ► ఫిబ్రవరి–ఏప్రిల్ నెలల మధ్య భారీవర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.10.76 కోట్ల పెట్టుబడి సాయం విడుదల చేసింది. ► కేవలం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అక్టోబరు వరకూ భారీ వర్షాలు, వరదలవల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 279.08 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించింది. ► చంద్రబాబు సర్కారు బకాయిలు వదిలి పెట్టగా చెల్లించిన పెట్టుబడి రాయితీ దీనికి అదనం. -
రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/ అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లోని ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారి.. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. ఆదివారం మధ్యాహ్నం ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ వెల్లడించింది. ► తీరందాటే సమయంలో బలహీనపడి వాయుగుండంగా మారనుంది. ► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ► సముద్రం అల్లకల్లోలంగా మారనుందనీ, తీరం వెంబడి గంటకు 70 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. 3 రోజుల పాటు మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. -
నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బుధవారం వాయుగుండంగా మారి కోస్తా, ఒడిశా దాని పరిసర ప్రాంతాలలో భువనేశ్వర్‌కి తూర్పు ఆగ్నేయ దిశగా 30కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ కారణంగా గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మెదక్, సిద్దిపేట, వరంగల్, మహ బూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో సారంగపూర్ (జగిత్యాల) 2 సెంటీమీటర్లు, తాడ్వాయి (కామారెడ్డి) 2 సెంటీమీటర్లు, నవీపేట్ (నిజామాబాద్) 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. -
మూడ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, గత 24 గంటల్లో గోల్కొండ, హయత్‌నగర్ 6 సెం.మీ, సరూర్‌నగర్, మంచల్ (మేడ్చల్ మల్కాజ్గిరి) 4 సెం.మీ, హైదరాబాద్, బొనకల్ (ఖమ్మం), నల్లగొండ, మొగుళ్లపల్లి (జయశంకర్ భూపాలపల్లి) 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
45 మండలాల్లో వర్షం
అత్యధికంగా మిర్యాలగూడలో 81.6 మి.మీ.. - అత్యల్పం బొమ్మలరామారంలో 2 మి.మీ నమోదు - రోహిణీకార్తె ప్రారంభం రోజునే కరుణించిన వరుణుడు - భూమి పదును కావడంతో దుక్కులు దున్నేందుకు సిద్ధమవుతున్న రైతులు నల్లగొండ అగ్రికల్చర్, న్యూస్‌లైన్, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోహిణీ కార్తె ప్రారంభం రోజే వర్షం పడడంతో అన్నదాతలు ఖరీఫ్ ఏరువాకకు సిద్ధమవుతున్నారు. చందంపేట, డిండి, మఠంపల్లి, హుజూర్నగర్, మేళ్లచెర్వు, కోదాడ, చిలుకూరు, తుంగతుర్తి, నూతన్‌కల్, ఆత్మకూరు(ఎస్), చివ్వెంల, మోతె, నడిగూడెం, మునగాల మండలాలు మినహా మిగతా 45 మండలాలలో వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 24.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా మిర్యాలగూడ మండలంలో 81.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా బొమ్మలరామారం మండలంలో 2 మిల్లీమీటర్లు కురిసింది. తుర్కపల్లిలో 43.6, రాజాపేటలో 56.6, యాదగిరిగుట్టలో 37.6, ఆలేరులో 36, గుండాలలో 60, తిరుమలగిరిలో 28 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా జాజిరెడ్డిగూడెంలో 36, శాలిగౌరారం 40.4, మోత్కూరులో 56.4, ఆత్మకూర్(ఎం) 19.2, వలిగొండలో 38.2, భువనగిరిలో 43.2, బీబీనగర్‌లో 8.6. మిల్లిమీటర్ల వర్షం కురిసింది. దీంతోపాటు పోచంపల్లిలో 6, చౌటుప్పల్‌లో 19.6, రామన్నపేటలో 28.6, చిట్యాలలో 14, నార్కట్‌పల్లిలో 34.8, సూర్యాపేటలో 10.8, పెన్‌పహాడ్‌లో 3.4, వేములపల్లిలో 62.02, తిప్పర్తిలో 32.8. నల్లగొండలో 35.2, మునుగోడు 20 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా నారాయణపూర్‌లో 10, మర్రిగూడలో 4.6, చండూరులో 50.8, కనగల్‌లో 31, నిడమనూరులో 62.2, త్రిపురారంలో 60.6, గరిడేపల్లిలో 2.4, నేరేడుచర్లలో 47.2 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. దామరచర్లలో 67.2, అనుములలో 54.4, పెద్దవూరలో 15.2, పీఏపల్లి 3, గుర్రంపోడులో 9, నాంపల్లిలో 25.6, చింతపల్లిలో 5, దేవరకొండలో 4.6 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. చాలా మండలాలలో పదునయ్యే వర్షం పడడంతో అన్నదాతలు దుక్కులు దున్నడం మొదలుపెట్టారు. జూన్ మొదటివారంలో మృగశిరకార్తె ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటినుంచే దుక్కులు దున్నుకుని సిద్ధంగా ఉంచుకుని మరోసారి వర్షం కురవగానే పత్తి విత్తనాలను విత్తుకోవడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు.