టెర్రకోట బొమ్మలు
బి.కొత్తకోట: టెర్రకోట కళాకృతులు అంటే కంటేవారిపల్లె గుర్తుకొస్తుంది. ఎలాంటి యంత్ర, అచ్చు పరికరాల ప్రమేయం లేకుండా, కేవలం చేతి వేళ్లతో 700 రకాల మట్టి కళాకృతులను తీర్చిదిద్దే స్థాయికి తెచ్చిన ఘనత అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కంటేవారిపల్లెకు చెందిన ఎ.రామయ్య(77)దే. ముంబై–చెన్నై జాతీయ రహదారిపై ఉన్న కంటేవారిపల్లెకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి, ఎంతో మంది ఉపాధి పొందడానికి మార్గదర్శి అయ్యాడాయన.
శిక్షణతో వెలుగులోకి టెర్రకోట..
రిషివ్యాలీ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి వ్యక్తిగత వైద్యుడి కుమారుడు, క్రాఫ్ట్ టీచర్ విక్రం పర్చురే (బెంగళూరు) ఇక్కడికి రావడంతో టెర్రకోట కళ గురించి ప్రపంచానికి తెలిసింది. 1983లో ఆయన రిషివ్యాలీ పాఠశాలలో కంటేవారిపల్లెకు చెందిన ఎ.రామయ్య, ఎ.వెంకటరమణ, డి.పెద్దవెంకటరమణకు చిత్రాలు గీసి ఇచ్చి వాటిలాగే మట్టిబొమ్మలు తయారు చేసి ఇవ్వాలని కోరారు. ఇందుకోసం నెలకు రూ.400 వేతనం చెల్లించేవారు.
కొన్నాళ్లకు కంటేవారిపల్లెలోని పూరిగుడిసెలో రామయ్య 1985లో సొంతంగా టెర్రకోట మట్టిబొమ్మల తయారీకి శ్రీకారం చుట్టారు. దీనికి విక్రం పర్చురే సహకారం అందించారు. 2వేలకు పైగా గీసిన బొమ్మల చిత్రాలను అందించారు. ఈ నేపథ్యంలో రామయ్య తాను తయారుచేసిన బొమ్మలను రహదారిపై ఉంచి విక్రయాలు ప్రారంభించడంతో అందరి దృష్టి పడింది. రామయ్యతో ప్రారంభమైన టెర్రకోట కళ ఆయన వద్ద శిక్షణ పొందిన వారితో విస్తరించింది.
సింగపూర్‌కు ఎగుమతి
దేవుని గదిలో ఉంచే దీపాల నుంచి హోదా, దర్పాన్ని గుర్తుకు తేచ్చే విలాసవంతమైన బొమ్మల దాకా టెర్రకోట ఆకృతులు అధికంగా సింగపూర్‌కు ఎగుమతి అవుతాయి. 1986 నుంచి ప్రభుత్వ సౌజన్యంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో టెర్రకోట మట్టి బొమ్మల ప్రదర్శన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా తయారీదారులకు ఆదాయం, ప్రాచుర్యం లభించింది. దీంతోపాటు ఇటీవలి కాలంలో మళ్లీ మట్టి పాత్రల్లో వంటలు చేయడం మొదలైంది. ప్రజలు మట్టికుండలు, వంటపాత్రలు, మట్టితో చేసిన వాటర్ బాటిళ్లు, టీ కప్పులు, ప్లేట్లు, పొయ్యిలు, మట్టి కొళాయి కుండలను అధికసంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.
అందరికీ సీఎఫ్‌సీ
కురబలకోట మండలం అంగళ్లులో టెర్రకోట కళాకారుల కోసం కేంద్రజౌళిశాఖ కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేసింది. ఇక్కడ కళాకారులు బొమ్మలు చేసుకునేందుకు వీలుగా పనిముట్లు, ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచారు.
తయారీ ఇలా..
అందరూ ఇష్టపడే టెర్రకోట బొమ్మల తయారీకి అవసరమైన నాణ్యమైన చెరువుమట్టి ఈ ప్రాంతంలోనే లభ్యం కావడం విశేషం. ముందుగా చెరువుమట్టిని నీటిలో నానబెట్టి జల్లెడపట్టిన ఇసుకను అందులో కలుపుతారు. ఒకరోజు తర్వాత మట్టిని కాలితో తొక్కుతారు. చక్రంమీద మట్టిపెట్టి ఆకృతులను తయారు చేస్తారు. మట్టితో సిద్ధం చేసిన ఆకృతులను పదిరోజులు నీడలో ఆరబెట్టాక ఒకరోజు ఎండలో ఉంచుతారు. మరుసటిరోజు బట్టీలో వాటిని పేర్చి 12 గంటలు కాల్చుతారు. బొమ్మలు ఎర్రరంగులో ఉండాలంటే కట్టెలతో, నల్లరంగులో ఉండాలంటే వరిపొట్టు, బొగ్గులతో కాల్చుతారు.
బోధి వృక్ష బుద్ధుడికి అవార్డు
కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఎ.నాగరాజు టెర్రకోట కళాకారుడు. బోధి వృక్షం కింద ధ్యానంలో కూర్చున్న బుద్ధుడి బొమ్మను 2018లో మట్టితో తయారు చేశాడు. ఈయన సృజనకు మెచ్చిన రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ రూ.25వేలు, ప్రశంసాపత్రంతో సత్కరించింది.
కష్టాల నుంచి గట్టెక్కించాయి..
నాన్న వారసత్వంగా కుమ్మరి వృత్తితో మట్టికుండలు తయారుచేసి పల్లెలు, సంతల్లో విక్రయిస్తే వచ్చే కొద్దిపాటి ఆదాయంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. విక్రం పర్చురే సహకారంతో వందల రకాల బొమ్మలు తయారు చేయడం నేర్చుకొన్నా. చాలామందికి శిక్షణ ఇచ్చా. సెంటు భూమిలేని నేనిప్పుడు 10 ఎకరాల భూమిని కొని బోరు వేయించి పంటలు సాగు చేస్తున్నా. సొంతింటిని నిర్మించుకొన్నా. మా కళను గుర్తించిన ప్రధాని పీవీ నరసింహారావు టెర్రకోట బొమ్మలు చూసి ఆశ్చర్యపోయారు. 1991లో తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ వేదికపై రూ. 1,116 ఇచ్చి సత్కరించారు. – ఎ.రామయ్య, టెర్రకోట కళాకారుడు
Comments
Please login to add a commentAdd a comment