శృంగవరపుకోట రూరల్: ప్రేమ పేరుతో సహోద్యోగినిని లోబరుచుకుని.. పెళ్లికి నిరాకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విజయనగరం ఏఎస్పీ అనిల్ పులిపాటి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్.కోట మండలం వేములాపల్లి గ్రామానికి చెందిన శీరెడ్డి నవీన్ మండలంలోని ముషిడిపల్లి గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిని ప్రేమిస్తున్నానంటూ చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా నవీన్ చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని బాధిత యువతి అడిగితే, ఇంటి నిర్మాణం జరుగుతోందని.. పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పించుకున్నాడు.
అలాగే ఇంటి నిర్మాణానికి నగదు అవసరమని, కట్నం కావాలని యువతిని వేధించడం మొదలు పెట్టాడు. యువతి తండ్రి గట్టిగా నిలదీస్తే మొదట్లో మహిళా ఉద్యోగినితో తీసుకున్న అభ్యంతరకర ఫోటోలను అతని ఫోన్‌కు పంపించాడు. దీంతో నవీన్‌పై బాధిత యువతి ఎస్.కోట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు నవీన్‌ను అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. సీఐ ఎస్. సింహాద్రినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు జె.తారకేశ్వరరావు, జి.లోవరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: విందు కోసం ఆహ్వానిస్తే.. ఆమె లవర్ ఎంత పని చేశాడు..
Comments
Please login to add a commentAdd a comment