సాక్షి ప్రతినిధి విజయవాడ/అవనిగడ్డ: మడ అడవుల వృద్ధిలో కృష్ణా–గుంటూరు జిల్లాలు ముందు వరుసలో నిలిచాయి. 15 ఏళ్ల నుంచి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు ఎంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మడ అడవుల వృద్ధిలో వరుసగా రెండోసారి కృష్ణా–గుంటూరు జిల్లాలు గణనీయమైన వృద్ధి సాధించాయి.
19,481.61 హెక్టార్లలో మడ అడవుల వృద్ధి..
సాధారణంగా మంచినీరు, ఉప్పునీరు కలిసే నదీ ముఖద్వారం ప్రాంతంలోనే మడ అడవులు పెరుగుతాయి. కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం గుల్లలమోద వరకు మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో మడ అడవులను వృద్ధి చేసేందుకు 2006లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
నదీ ముఖ ద్వారం వద్ద ఖాళీ ప్రాంతాలను గుర్తించి మడ అడవులు, పలు రకాల మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఫిష్‌బోన్ (చేప ముళ్లు) ఆకారంలో ఫీడర్ చానల్స్, ఫీల్డ్ చానల్స్‌ను ఏర్పాటు చేసి వీటి ద్వారా పలు రకాల మొక్కలు పెంచారు. తెల్లమడ, నల్లమడ, పొన్న, దుడ్డు పొన్న, గజరా, పుచ్చ వంటి రకాల మొక్కల విత్తనాలను నాటి వాటిని సంరక్షించే చర్యలు చేపట్టారు. 2019 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవుల వృద్ధిలో కృష్ణా–గుంటూరు జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. 2021 నివేదికలోనూ ఈ జిల్లాలు ముందంజలోనే ఉన్నాయి. కృష్ణా–గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 19,481.61 హెక్టార్లకు మడ అడవులు విస్తరించి ఉన్నాయి.
అత్యధిక పెరుగుదల రాష్ట్రంగా ఏపీ..
2021 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలోనే అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదలను నమోదుచేసిన రాష్ట్రాల్లో 647 చదరపు కిలోమీటర్ల వృద్ధిరేటుతో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలిచింది. 632 చ.కి.మీ వృద్ధితో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, 537 చ.కి.మీ వృద్ధితో ఒడిశా మూడో స్థానంలో ఉంది.
అరుదైన జంతువులు, పక్షులకు ఆవాసం..
కృష్ణాజిల్లాలోని నాగాయలంక మండల పరిధిలోని పలు తీర ప్రాంత గ్రామాల్లో విస్తరించిన మడ అడవులు అరుదైన జంతువులు, పక్షులకు ఆవాసంగా మారాయి. దేశంలోనే అరుదుగా కనిపించే పిషింగ్ క్యాట్ (బావురు పిల్లి) ఈ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. నీటికుక్కలు, అరుదైన సముద్రపు తాబేళ్లు, పెలికాన్ (గూడబాతు), కింగ్ ఫిషర్స్ పక్షులు తదితర పక్షిజాతులు ఈ ప్రాంతంలో సందడి చేస్తుంటాయి.
పదిహేనేళ్ల శ్రమకు దక్కిన ఫలితమిది..
పదిహేనేళ్ల నుంచి పడుతున్న శ్రమకు దక్కిన ఫలితమిది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమించి నాటిన మడ చెట్లను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. మడ అడవుల వృద్ధి వల్ల రానున్న రోజుల్లో ఈ ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సా«ధించనుంది.
– సీహెచ్ సుజాత, ఫారెస్ట్ రేంజ్ అధికారిణి, అవనిగడ్డ
Comments
Please login to add a commentAdd a comment