రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ నేత,మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి దహనం చేశారు. రాజమహేంద్రవరం నగరంలోని వీఎల్ పురంలో ఉన్న మార్గాని ఎస్టేట్స్‌లోని ఆయన కార్యాలయం వద్ద ఈ వాహనాన్ని ఉంచారు. దీనికి గుర్తు తెలియని దుం డగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది.
పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మాజీ ఎంపీ భరత్ రామ్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆయనతో పాటు ప్రకాశం నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కడలి సత్యనారాయణ, బొమ్మూరు ఇన్స్పెక్టర్ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో ఇటు వంటి విషసంస్కృతి గతంలో ఎప్పుడూ లేదని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ చేస్తున్న దాడుల నేపథ్యంలోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషిస్తున్నారని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానన్నారు. ఈ విధమైన పరిస్థితి నగరంలో ఏర్పడటం దారుణమన్నారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకుని వెళ్లి, నిందితులపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా కోరతామని చెప్పారు.
ఇటీవల మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకం ధ్వంసం,ఇళ్ల పైకి దాడులు చేయడం, కోటిలింగాలపేటలో వైఎస్సార్ సీపీకి చెందిన యువకుడిపై దాడి చేయడం వంటి దారుణాలకు ఒడిగట్టారనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు దర్యాప్తు చేయాలని, నిందితులపై, ఈ ఘటనకు ఉసిగొల్పిన వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment