అద్దెకు గోదాములు | Marketing department steps towards financial support | Sakshi
Sakshi News home page

అద్దెకు గోదాములు

Published Sun, May 14 2023 5:17 AM | Last Updated on Sun, May 14 2023 5:17 AM

Marketing department steps towards financial support - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్థిక పరిపుష్టి సాధించుకునే దిశగా మార్కెటింగ్‌ శాఖ అడుగులేస్తోంది. రాష్ట్రవ్యా­ప్తంగా ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకివ్వడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకుంటోంది. రాష్ట్రంలో 218 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్న సంగతి తెలిసిందే. వీటి పరిధిలో 9,75,105 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన 1,015 గోదాములు ఉన్నాయి. వీటితో పాటు 3,352 చోట్ల షాపులు, మరో 407 చోట్ల షాపులతో కూడిన గోదాములు­న్నాయి. ఇప్పటి వరకు కమిటీల పరిధిలో ఉన్న ఈ–చెక్‌పోస్టుల ద్వారా సెస్‌ వసూలు చేయడం, వ్యాపారులకు లైసెన్సులు జారీ చేయడం, గోదా­ములను ప్రభుత్వ శాఖలకు అద్దెకు ఇవ్వడం వంటి కార్యకలాపాల ద్వారా మార్కెటింగ్‌ శాఖకు ఆదాయం సమకూరేది.

ఇలా ఏటా రూ.450 కోట్ల నుంచి రూ.550 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే ఒకే దేశం– ఒకేమార్కెట్‌ విధానంతో సెస్‌ వసూళ్లను నిలిపివేయడంతో దాదాపు ఏడాది పాటు ఆదాయానికి గండి పడింది. 2021–22లో ఈ పన్నుల వసూళ్లను పునరుద్ధరించడంతో కాస్త గాడిలో పడినప్పటికీ ఆర్థికంగా మరింత పరిపుష్టి సాధించే దిశగా మార్కెటింగ్‌ శాఖ ముందుకెళ్తోంది. ఇప్పటివరకు ‘రైతుబంధు’ పథకం కింద రైతులు తాము పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో దాచుకునే వారు.

అలాగే బియ్యం కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం, ఇతర నిత్యావసరాల నిల్వ కోసం పౌరసరఫరాల శాఖ, ధాన్యం, ఇతర ఆహార ఉత్పత్తుల నిల్వ కోసం సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్, రాష్ట్ర గోదాముల సంస్థ, మార్క్‌ఫెడ్‌లకు అద్దెకిచ్చేవారు. గత కొంతకాలంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కూడా గోదాముల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వీరికి అద్దెకివ్వడం ద్వారా మార్కెటింగ్‌ శాఖ అదనపు ఆదాయం సమకూర్చుకుంటోంది. 

ఇప్పటివరకు అద్దెకు 2,976 షాపులు
ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి గోదాములను అద్దెకు ఇస్తున్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా అద్దెను నిర్ణయించి,konugolu.ap. gov.in  ద్వారా టెండర్లు పిలుస్తున్నారు. అద్దె రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆయా మార్కెట్‌ కమిటీలకు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 2,976 షాపులు, 367 షాపులతో కూడిన గోదాములు, 614 గోదాములు అద్దెకిచ్చారు. వీటి ద్వారా ఏటా రూ.24 కోట్లకు పైగా అదనపు ఆదాయం మార్కెటింగ్‌ శాఖ సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఖాళీగా ఉన్న షాపులు, గోదాములను కూడా అద్దెకిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement