మార్కెటింగ్ శాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను పెంచే లక్ష్యంతో చేపట్టిన గోదాముల నిర్మాణాన్ని ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 330 చోట్ల గోదాముల నిర్మాణాన్ని ప్రతిపాదించగా.. ఇప్పటికే 294 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. నిర్దేశిత గడువులోగా గోదాముల నిర్మాణం పూర్తి చేసేందుకు ఏప్రిల్, మే నెలల్లో రూ.250 కోట్లు ఖర్చు చేయాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,024.50 కోట్ల అంచనా వ్యయంతో 330 గోదాముల నిర్మాణం చేపట్టింది. రెండు విడతల్లో పనులను మంజూరు చేయడంతో పాటు..
తొలి విడత పనుల పూర్తికి గతేడాది డిసెంబర్‌ను గడువుగా నిర్దేశించారు. రెండో విడత పనులు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే స్థల సేకరణ, టెండర్ల ప్రక్రియలో అవాంతరాలతో పనులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కరించి.. నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చూడాలంటూ జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఎమ్మెల్యేలకు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు లేఖలు రాశారు. సకాలంలో స్థల సేకరణ జరపకుంటే మంజూరైన పనులు రద్దు చేసి.. ఇతర మండలాలకు తరలిస్తామన్నా రు.
ఇందుకు అనుగుణంగా గోదాముల నిర్మాణ పూర్తి చేసేందుకు శాఖ తాజా గడువు నిర్దేశించిం ది. గతేడాది మొదటి విడతలో రూ.411 కోట్ల అంచనా వ్యయంతో 128 పనులను మంజూరు చేసింది. ఈ పనులను తాజా గడువు ప్రకారం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి. అదే విధంగా గతేడాది ఆగస్టులో రెండో విడతలోరూ.613.50 కోట్ల వ్యయంతో 202 గోదాములు మంజూరు చేశారు. రెండో విడత పనులను తాజా గడువు ప్రకారం ఈ ఏడాది జూలైలోగా పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ ఆదేశించింది.