సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)కు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న గ్రామీణ గోదాముల (బహుళ ప్రయోజన కేంద్రాలు – ఎంపీఎఫ్‌సీలు) నిర్మాణంపై ఈనాడు కథనాన్ని మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే తీవ్రంగా ఖండించారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేంత వరకు రైతులు వాటిని నిల్వ చేసుకునేందుకు గ్రామ స్థాయిలో రూ.1,584.61 కోట్లతో 2,536 ఎంపీఎఫ్‌సీ గోదాములు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. 15 సెంట్ల భూమిలో 500 టన్నులు, 25 సెంట్ల భూమిలో 1,000 టన్నుల సామర్థ్యంతో ఈ గోదాములను నిర్మిస్తున్నామన్నారు.
తొలివిడతలో రూ.493.15 కోట్ల అంచనా వ్యయంతో 1,167 గోదాముల నిర్మాణం చేపట్టామని, వీటిలో రూ.166.83 కోట్లతో 8 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు కడప డివిజన్‌లో అత్యధికంగా 271, గుంటూరు డివిజన్‌లో 152, విజయవాడ డివిజన్‌లో 93, విశాఖ డివిజన్‌లో 38 చొప్పున 554 గోదాముల నిర్మాణం పూర్తయిందన్నారు. జనవరి నాటికి 780 గోదాములు, మార్చి నాటికి మిగిలిన గోదాముల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. పనుల పురోగతిపై చీఫ్ ఇంజనీర్ నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
అవసరమైన చోట్ల కలెక్టర్లకు తగిన సూచనలు చేస్తూ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలి విడతలో నిర్మిస్తున్న గోదాముల్లో రూ.7.76 కోట్లతో తేమ శాతం నిర్ధారించే పరికరాలు, కాటాలు, కంప్యూటర్లు ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చినట్లు తెలిపారు. రెండో విడతలో నిర్మించనున్న గోదాముల కోసం స్థలాల ఎంపిక వేగంగా జరుగుతోందన్నారు. వాస్తవం ఇలా ఉంటే కేవలం 350 గోడౌన్లు మాత్రమే పూర్తయినట్టుగా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment