దిశ మారింది .. దశ తిరిగింది | Markfed Services Expanding In AP | Sakshi
Sakshi News home page

దిశ మారింది .. దశ తిరిగింది

Published Wed, Nov 18 2020 4:41 AM | Last Updated on Wed, Nov 18 2020 4:41 AM

Markfed Services Expanding In AP - Sakshi

సాక్షి, అమరావతి: మార్క్‌ఫెడ్‌ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో నామమాత్రపు సేవలకే పరిమితమై, మండలానికో కొనుగోలు కేంద్రంతో కొన్ని పంటలనే కొనుగోలు చేసిన ఈ సంస్థ..  ఇప్పుడు గ్రామ స్ధాయిలో పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటలనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటలనూ కొనుగోలు చేస్తోంది. అలాగే గతంలో కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే ఎరువులు పంపిణీ చేసేవి. ఇప్పుడు గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి, విస్తరిస్తున్న సంస్థ సేవలకు అనుగుణంగా రైతు సమస్యల పరిష్కారం విషయంలో నిబద్ధత కలిగిన అధికారులు, సిబ్బంది 100 మందిని డిప్యుటేషన్‌పై నియమించుకోవడానికి మార్క్‌ఫెడ్‌ కసరత్తు చేస్తోంది. 

ఎరువుల పంపిణీ బాధ్యత  
రాష్ట్రంలో 1950 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఆరి్ధకంగా బలమైన ఐదు వందల్లోపు సంఘాలు రైతులకు ఎరువులు పంపిణీ చేశాయి. మిగిలిన సహకార సంఘాల పరిధిలోని రైతులు ప్రైవేట్‌ డీలర్ల నుంచి అధిక రేటుకు ఎరువులను కొనుగోలు చేశారు. అదే సమయంలో అనేక సహకార సంఘాల పాలకవర్గాలు ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడ్డాయి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించడం ద్వారా ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టినట్టయ్యింది.

అప్పుడు ‘ఆ కొందరి’కే సేవలు 
టీడీపీ హయాంలో మార్క్‌ఫెడ్‌ నామమాత్రపు సేవలకే పరిమితమయ్యింది. మండలానికో కొనుగోలు కేంద్రం మాత్రమే ఉండటంతో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి అనేక వ్యయ ప్రయాసలకు గురయ్యారు. కేవలం తెలుగుదేశం సానుభూతిపరులకే సేవలందించిందనే అపప్రథను సంస్థ మూటగట్టుకుంది. ఆ పార్టీ నాయకులు సిఫారసు చేసిన రైతుల నుంచే పంటలను కొనుగోలు చేసేదన్న ఆరోపణలూ ఉన్నాయి.  

ఇప్పుడు రైతులందరి సంక్షేమమే లక్ష్యం 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మార్క్‌ఫెడ్‌ దశ తిరిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడంలో రైతులు ఎలాంటి ఇబ్బందులూ పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్‌ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీంతో తెలుగుదేశం పాలనలో ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు కేవలం రూ.3 వేల కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గత ఏడాదిలోనే రూ.3,119 కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేశారు. అప్పట్లో కందులు, అపరాలు, పసుపు, వేరుశనగ వంటి పంటలనే కొనుగోలు చేస్తే .. గత ఏడాది కందులు, అపరాలు, శనగలు, వేరుశనగ, మొక్కజొన్న, జొన్నలు, పసుపు, సజ్జలు, ఉల్లిపాయలు, పొగాకు, అరటి, బత్తాయి, టమాటా వంటి అనేక పంటలు మొత్తం 8.74 లక్షల టన్నులు ప్రస్తుత ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాదాపు వెయ్యి కొనుగోలు కేంద్రాల ద్వారా మార్క్‌ఫెడ్‌ సిబ్బంది సెలవుల్లోనూ పంటలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది 10,641 రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రైతులు తమ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోనే పంటలను అమ్ముకుంటున్నారు. టైమ్‌స్లాట్‌ విధానం, పంటల నమోదు వంటి నిబంధనలు సడలించి ఒక రోజు ముందు అధికారులకు తెలియపరిచి పంటను అమ్ముకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. 

పొగాకు కొనుగోలు బాధ్యత కూడా.. 
వ్యాపారులంతా కూటమిగా ఏర్పడి పొగాకు రైతులను దోపిడీ చేస్తున్న పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. పొగాకు కొనుగోలు బాధ్యతను ఈసారి మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. దీంతో పొగాకు బోర్డులో బిడ్డరుగా పేరు నమోదు చేసుకున్న సంస్థ మిగిలిన వ్యాపారులకు పోటీగా తొలిసారిగా పొగాకు కొనుగోలు చేసింది. దీంతో రైతులు గతంతో పోల్చుకుంటే సగటున కిలోకు రూ.2.42 అధికంగా  పొందారు. గతంలో సగటున కిలోకు రూ.121.53 పొందిన రైతులు.. మార్క్‌ఫెడ్‌  రంగ ప్రవేశంతో సగటున కిలోకు రూ.123.95 పొందగలిగారు. పొగాకు బోర్డు ఆధ్వర్యంలో మొత్తం 128.65 మిలియన్‌ కిలోల అమ్మకాలు జరిగితే, అందులో పదిశాతం అంటే 12.93 మిలియన్‌ కిలోల పొగాకును మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. మార్క్‌ఫెడ్‌ ప్రవేశానికి ముందు, ఆ తర్వాత జరిగిన అమ్మకాలతో రైతులకు లభించిన మొత్తంలో వ్యత్యాసం రూ.150 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.  

సిబ్బందిని పెంచుతున్నాం 
ఎరువుల పంపిణీ బాధ్యతను ఆగ్రోస్‌ నుంచి మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం బదిలీ చేసిన నేపథ్యంలో.. సంస్థకు ఎక్కువమంది సిబ్బంది అవసరం. మార్కెటింగ్‌ శాఖ మనుగడ ప్రశ్నార్ధకం కావడంతో.. అక్కడి ఉద్యోగులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. 
–ఎస్‌.ప్రద్యుమ్న, ఎమ్‌డీ, మార్క్‌ఫెడ్‌ 

రైతు సంక్షేమానికి సర్కారు చర్యలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పంట పండించడానికి, అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకుంటున్నారు. రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, కొనుగోలు కేంద్రాలు అన్నిటినీ గ్రామస్థాయికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కొన్ని ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు పెరుగుతున్నాయి. 
 –మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, మార్కెటింగ్‌ శాఖ  

సేవలు అందించే సంస్ధల బలోపేతం  
రైతులకు సేవలు అందించే ప్రభుత్వ శాఖలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్క్‌ఫెడ్‌ గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే 8.74 లక్షల టన్నుల పంటలను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.3,119 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ పంటల కొనుగోలు జరగలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒకేసారి 24 పంటలకు మద్దతు ధర ప్రకటించారు. సీజను ప్రారంభానికి ముందే ప్రకటించడంతో రైతులు మార్కెట్‌లోని ధరలను బేరీజు వేసుకుని పంటల అమ్మకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 
– నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షులు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement