దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 44,599 మోసాలు.. రూ.2,137 కోట్లు దోచేసిన సైబర్ నేరస్తులు
కేవలం రూ.184 కోట్లే రికవరీ
2023–24లోనే రూ.1,457 కోట్ల దోపిడీ
గత ఐదేళ్లలో ఏపీలోనే అత్యల్పం
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఐదేళ్లలో సైబర్ నేరస్తులు ఏకంగా 44,599 మోసాలు చేసి.. రూ.2,137 కోట్లు కొట్టేశారు. అత్యధికంగా 2023–24వ ఆర్థిక సంవత్సరంలోనే 29,082 మోసాలతో రూ.1,457 కోట్లను కొల్లగొట్టారని ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2019–20వ ఆర్థిక సంవత్సరం నుంచి 2023–24వ ఆర్థిక సంవత్సరం వరకు రూ.2,137 కోట్లు దోచేస్తే.. రూ.184 కోట్లే రికవరీ చేసినట్లు మంత్రి తెలిపారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితరాల ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. దేశంలో అత్యధికంగా హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మోసాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్పంగా గత ఐదేళ్లలో 575 సైబర్ మోసాలతో రూ.23.46 కోట్లను దోచేశారని తెలిపారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ద్వారా డిజిటల్ టెక్నాలజీల సురక్షిత వినియోగానికి వివిధ చర్యలు చేపట్టామన్నారు. ఆర్థిక నేరాలతో పాటు సైబర్ చీటింగ్‌లపై ఫిర్యాదుల కోసం కేంద్ర హోం శాఖ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930ను ప్రారంభించిందన్నారు. బాధితులు అధికారిక కస్టమర్ కేర్ వెబ్‌సైట్ లేదా బ్యాంకు శాఖల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. సోషల్ మీడియా ద్వారా కూడా అవగాహన కల్పిస్తోందని తెలిపారు. ఆర్‌బీఐతో పాటు బ్యాంకులు సైబర్ నేరాలపై ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. తద్వారా నష్టాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment