దాదాపుగా ఎగ్జాట్ ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ ప్రతిబింబం
రెండు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు తీపి కబురు
4న ఓట్ల లెక్కింపునకు ముందే క్యాడర్‌లో ఉత్సాహం
అన్ని నియోజకవర్గాల్లో అనుకూల ఫలితాలొస్తాయని అంచనా
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అగ్నివీర్.. ఆరా మస్తాన్.. ఆత్మసాక్షి.. జన్మత్‌పోల్.. ఆపరేషన్ చాణక్య... ఏబీపీ సీఓటర్... ఇలా పలు సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఒక్కటే ఫలితాలు! ‘ఫ్యాన్’ మరోసారి సునామీ సృష్టిస్తుందని అంచనా వేసి చెబుతున్నాయి. గత నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల సంద ర్భంగా ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయా లను క్రోడీకరించి ఈ సంస్థలు శనివారం వెల్లడించాయి. ఏవో ఒకటీ రెండు మినహా మిగతావన్నీ ఒకేతరహా ఫలితాలను అంచనావేస్తూ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించాయి.
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని చేపట్టినా క్షేత్రస్థాయిలో మాత్రం అప్పటి నుంచే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ సంచలన విజయానికి వ్యూహరచన చేశారు. పక్కా ప్రణాళికతో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ గత ఐదేళ్లలో ప్రజలకు చేరువయ్యారు.
రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించినా రాష్ట్రంలో మాత్రం ఆయన పర్యవేక్షణలో వైద్యసేవలు, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శప్రాయం అయ్యాయి. అందుకే ‘మీ ఇంటిలో మంచి జరిగిందంటేనే ఓటు వేయండి’ అని ధైర్యంగా అడిగిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలమనసులో ఒక దమ్మున్న నాయకుడిగా నిలిచిపోయారు. ఆయన ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవాలనే సంకల్పంతోనే ఓటర్లు గతంలో కనీవినీ ఎరుగని రీతిలో గత నెల 13వ తేదీన పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే రోజున ఓటర్ల నాడి తెలుసుకునేందుకు కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌కు నడుంబిగించాయి.
👉 విజయం మళ్లీ వారిదే...
రెండు జిల్లాల్లోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఓటర్లు వైఎస్సార్‌సీపీకే అండగా నిలిచారని ఎగ్జిట్ పోల్స్ తేలి్చచెప్పాయి. ముఖ్యంగా మహిళలు అర్ధరాత్రి వరకూ బారులు తీరి మరీ సంక్షేమ ప్రభుత్వానికే ఓటు వేశారని అంచనా వేస్తున్నాయి. బీసీలు, పేద, అణగారిన వర్గాలు అత్యధికంగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో ఫ్యాన్‌దే హవా ఉంటుందని చెప్పకనే చెప్పాయి. అంతేకాదు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా విజయపతాకం ఎగురవేయనున్నారని అంచనా వేశాయి. ఈ ప్రకారం...
👉విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి బెల్లాన చంద్రశేఖర్ మరోసారి విజయం సాధించనున్నారు. అరకు లోక్‌సభ స్థానంలో కొత్తగా బరిలో నిలిచిన డాక్టర్ తనూజారాణి కూడా గెలుపు సాధించనున్నారు.
👉ఉపముఖ్య మంత్రి పీడిక రాజన్నదొర సాలూరు (ఎస్‌టీ) నియోజకవర్గంలో వరుసగా ఐదోసారి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీడీపీ కూటమి అభ్యరి్థని మట్టికరిపించి అభిమానుల మనసులో మన్యం పులిగా నిలిచిపోనున్నారు. మరో రెండు ఎస్టీ నియోజకవర్గాలైన కురుపాంలో పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో విశ్వాసరాయి కళావతి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోనున్నారు.
👉ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలైన పార్వతీపురం, రాజాంలో కూడా వైఎస్సార్‌సీపీ జెండా మరోసారి రెపరెపలాడనుంది. పార్వతీపురంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగుపెట్టించిన అలజంగి జోగారావు మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేలా ప్రజలు ఆశీర్వదించినట్టు సర్వేలు తేల్చాయి. రాజాం ప్రజలకు వైద్యసేవలతో చేరువైన డాక్టర్ తలే రాజేష్ కూడా ఈ ఎన్నికల్లో తొలిసారిగా విజయం సాధించనున్నారు.
👉బీసీల జిల్లాలో తమను విస్మరించి అగ్రవర్ణాలకు సీట్లు కేటాయించిన టీడీపీ కూటమికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్లలో బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి తమ విజయాన్ని నమోదు చేయనున్నారు. బొబ్బిలిలో టీడీపీ కూటమి అభ్యర్థి బేబీ నాయన గెలుపు ఖాయమంటూ ఓ వర్గం గత రెండేళ్లుగా ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, సీనియర్ నాయకుడైన శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడికే మద్దతు పలికారనే సంకేతాలు వెలువడుతున్నాయి. శృంగవరపుకోటలో కూడా కడుబండి శ్రీనివాసరావు ప్రత్యర్థుల ఆశలను గల్లంతు చేస్తూ మంచి మెజార్టీతో మరోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.
👉విజయనగరం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులతో రూపురేఖలు మార్చేసిన డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ సీనియరు నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి గెలుపు ఖాయమనే క్యాడర్ అంచనాలు వాస్తవమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వైఎస్సార్‌సీపీదే పైచేయి...
ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు కొత్తగా జిల్లాల ఏర్పాటుతో శ్రీకాకుళం జిల్లా నుంచి విలీనమైన రెండు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చాటిచెబుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ ఈ రెండు జిల్లాల్లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు వీటి పరిధిలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
ఈనెల 4వ తేదీన వెల్లడికానున్న 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా అదే తరహాలో సునామీని సృష్టిస్తాయని వైఎస్సార్‌సీపీ క్యాడర్‌తో పాటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శనివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంచుమించు అదే తరహాలో ఫలితాలు ఉంటాయని చాటిచెబుతున్నాయి. ఈ తీపికబురుతో వైఎస్సార్‌సీపీ క్యాడర్‌లో ఉత్సాహం నెలకొంది. 4వ తేదీన కౌంటింగ్‌కు ఎంతో ఉత్సాహంతో సిద్ధమవుతున్నవారిలో ఊపు తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment