సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి సగటున రోజూ 600 కేసులు నమోదవుతున్నాయి. ఒక దశలో రోజుకు 10 వేల కేసులు కూడా నమోదైన సందర్భాలున్నాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా అంచనా వేసింది. చలి తీవ్రత పెరిగే కొద్దీ కరోనా తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుందని నివేదికలో స్పష్టం చేసింది. జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే ప్రమాదం లేకపోలేదని పేర్కొంది. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అప్రమత్తం కావాల్సిన అవసరముందని సూచించింది.
ఐదు మాసాల గ్యాప్‌తో వచ్చే అవకాశం
పలు దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు అంచనా వేస్తే.. కరోనా పీక్ (తీవ్రత ఎక్కువగా)లో ఉన్న దశ నుంచి ఐదు మాసాల గ్యాప్‌తో సెకండ్ వేవ్ వచ్చిందని, ప్రస్తుతం ఢిల్లీలోనూ అదే జరిగిందని నిపుణులు అంచనా వేశారు.
– మన రాష్ట్రంలో ఆగస్టు – సెప్టెంబర్ మాసంలో ఎక్కువ తీవ్రత ఉండి, ఆ తర్వాత క్రమంగా తగ్గింది. తిరిగి ఐదు మాసాల తర్వాత అంటే 2021 జనవరి 15 నుంచి మార్చి 15 లోగా సెకండ్ వేవ్‌కు అవకాశాలున్నాయని చెప్పారు. అయితే వైరస్ తీవ్రత సెకండ్ వేవ్‌లో ఎంతగా ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయలేమన్నారు.
పలు దేశాలు.. రాష్ట్రాల్లో అంచనా
– అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలతో పాటు.. దేశంలో ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పరిస్థితులను అంచనా వేశారు.
– వీటిని బట్టి చూస్తే ఏపీలో కచ్చితంగా వస్తుందని గానీ, రాదు అని గానీ చెప్పలేమని, వచ్చేందుకు మాత్రం అవకాశాలున్నాయని చెబుతున్నారు.
– సెకండ్ వేవ్ పరిస్థితులకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండటం మంచిదని, సెకండ్ వేవ్‌లో చాలా దేశాలు, రాష్ట్రాల్లో స్కూళ్లు మూసేశారని తెలిపారు.
ఇలా చేస్తే మంచిది..
– సెకండ్ వేవ్ తీవ్రత ఎలా ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఆర్టీపీసీఆర్ టెస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దీర్ఘకాలిక జబ్బుల బాధితులందరికీ టెస్టులు చేసి ఐసొలేట్ చేయాలి.
– ఐసీయూలు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. టీచర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు ప్రతి 15 రోజులకు ఒకసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలి.
– జనవరి మొదటి వారం నాటికి టెస్ట్ కిట్‌లు సిద్ధంగా ఉంచుకోవాలి. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు విధిగా మాస్కులు వాడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలి. నూతన సంవత్సర వేడుకలు నిషేధిస్తే మంచిది.
– స్విమ్మింగ్ పూల్స్‌ను మరికొద్ది రోజులు మూసివేస్తే బావుంటుంది. మండల స్థాయిలోనూ కరోనా నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలి.
ఏడుగురు నిపుణులతో అడ్వైజరీ కమిటీ
కరోనా సెకండ్‌వేవ్ అంచనాలపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో అడ్వైజరీ కమిటీ నియమించింది. ఇందులో నలుగురు నిపుణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వారు కాగా, మరో ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వారు. వీరిలో కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, సోషియల్ ప్రీవెంటివ్ మెడిసిన్, న్యూరో ఫిజిషియన్‌లు ప్రభుత్వం తరఫున ఉన్నారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ, పల్మనరీ మెడిసిన్ నిపుణులు ప్రైవేట్‌కు చెందినవారున్నారు. ఈ ఏడుగురు నిపుణుల కమిటీ కరోనా సెకండ్‌వేవ్ అవకాశాలు, వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక ఇచ్చింది.
కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే వచ్చే అవకాశం
మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కరోనా వచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఇక్కడా వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. కచ్చితంగా సెకండ్ వేవ్ ఉండదు అని చెప్పడానికి వీలు లేదు.
– డా.రాంబాబు, కరోనా కేంద్ర నోడల్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment