సొంత ఊరికి ఎక్కడి నుంచైనా వైద్య సేవలు | Medical services from anywhere in the hometown Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సొంత ఊరికి ఎక్కడి నుంచైనా వైద్య సేవలు

Published Thu, Aug 19 2021 4:49 AM | Last Updated on Thu, Aug 19 2021 4:49 AM

Medical services from anywhere in the hometown Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : పక్క రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండి సొంత ఊరు, సాంత రాష్ట్ర ప్రజలకు సేవలను అందించాలనుకునే వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. తక్కువ బ్యాండ్‌ విడ్త్‌ ఉన్నా, వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యులతో కన్సల్టెన్సీ సేవలను అందించే విధంగా ప్రత్యేక యాప్‌ను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏపీటీఎస్‌) అభివృద్ధి చేసింది. ఒక్కసారి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఇంటర్నెట్‌ వేగంగా తక్కువగా ఉన్నా వీడియో కాన్ఫరెన్స్‌ ఎంపిక చేసుకున్న డాక్టర్‌తో వైద్య సేవలను, ఈ ప్రిస్కిప్షన్‌ను పొందవచ్చని ఏపీటీఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నందకిషోర్‌ ‘సాక్షి’కి వివరించారు.

యాప్‌ వినియోగించడం తెలియని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో నిర్మిస్తున్న విలేజ్‌ క్లినిక్‌లకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. వైద్య సేవలను అవసరమైన వారు అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఇందుకోసం ఆర్‌ఎక్స్‌ టెలికేర్‌ సంస్థతో ఏపీటీఎస్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఏపీటీఎస్‌ అభివృద్ధి చేసిన యాప్‌ను కోవిడ్‌–19 సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా, సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. త్వరలోనే ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా యాప్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఉచితంగా వైద్య సేవలు ఇలా..
► కార్పొరేట్‌ సామాజికసేవా కార్యక్రమంలో భాగంగా ఆర్‌ఎక్స్‌ టెలికేర్‌ సంస్థ ఉచితంగా వైద్య సేవలను అందించడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెరికా వంటి పలు దేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్‌ఎక్స్‌ టెలీకేర్‌లో 200 మందికి పైగా డాక్టర్లు ఉన్నారు.
► ఒక్కసారి యాప్‌లో పేరు నమోదు చేసుకొని, కాల్‌ చేస్తే రోగి సమాచారం మొత్తం తీసుకుని.. ఏ విభాగానికి చెందిన డాక్టర్‌ను సంప్రదించాలో నిర్ణయించి అపాయింట్‌మెంట్‌ ఇస్తారు. ఆ సమయంలో ఇంటి వద్ద నుంచి కానీ, విలేజ్‌ క్లినిక్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కానీ నేరుగా డాక్టర్‌తో మాట్లాడొచ్చు.
► రోగిని పరిశీలించిన తర్వాత చికిత్సకు సంబంధించిన ఈ–ప్రిస్క్రిప్షన్‌ను ఆన్‌లైన్‌లో అందిస్తారు. ఈ–ప్రిస్క్రిప్షన్‌ను అన్ని మందుల షాపులు అనుమతిస్తాయి. ఒకేసారి రోగి బంధువులతో కలిసి గ్రూప్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం, అప్పటికప్పుడు రోగి దద్దుర్లు, గాయాలు, ఇన్ఫెక్షన్‌ వంటి లక్షణాలను ఫొటోలు తీసి భద్రపరుచుకునే వెసులుబాటు ఉంది. 
► రోగి నుంచి సేకరించే సమాచారం అంతా పూర్తి భద్రత ఉంటుంది. ఈ సమాచారాన్ని డేటా ఎన్‌స్క్రిప్షన్‌ చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి రక్షణ ఉండే క్లౌడ్‌ స్టోరేజ్‌లో ఉంచుతారు. సమాచారాన్ని డేటా ఎనలిటిక్స్‌ ద్వారా విశ్లేషించి రోగ లక్షణాలను ముందుగానే గుర్తించడం, ఫాలో అప్‌ ట్రీట్మెంట్, వారసత్వంగా వచ్చే వ్యాధులను నియంత్రించడం వంటి సౌకర్యాలు ఈ యాప్‌లో ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement