‘పోషణ’ పథకాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే ఆహారాన్ని పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి వనిత
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షల మంది చెల్లెమ్మలు (గర్భిణులు, బాలింతలు), చిన్న పిల్లలకు ఏటా రూ.1863.11 కోట్ల వ్యయంతో చేపట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల మోనూ గురించి సీఎం జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వైఎస్సార్ సంపూర్ణ పోషణ
► గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్నం పెట్టే ఆహారంలో అన్నం, పప్పు, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, కోడి గుడ్డు, 200 మి.లీ పాలు.
► నెలకు ఒక కేజీ రాగి పిండి, ఒక కేజీ సజ్జ/జొన్న పిండి, ఒక కేజీ అటుకులు, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, 250 గ్రాముల ఎండు ఖర్జూరం.
వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్
► గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్నం పెట్టే ఆహారంలో అన్నం, పప్పు, ఆకు కూర, కూరగాయలతో సాంబారు, కోడి గుడ్డు, 200 మి.లీ పాలు.
► బెల్లం 500 గ్రాములు, మల్టీ గ్రెయిన్ ఆటా 2 కేజీలు, ఎండు ఖర్జూరం, సజ్జ/ జొన్న పిండి.. 500 గ్రాములు ఇస్తారు.
► 6 నెలల నుంచి 36 నెలల వయసున్న పిల్లల కోసం సంపూర్ణ పోషణ కింద 2.5 కేజీల బాలామృతం, 25 కోడి గుడ్లు, 2.5 లీటర్ల పాలు. గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ కింద 2.5 కేజీల బాలామృతం, 30 కోడిగుడ్లు, 6 లీటర్ల పాలు ఇస్తారు.
► 3 ఏళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఉన్న పిల్లలకు సంపూర్ణ పోషణలో 20 గ్రాములు ఉడికించిన శనగలు, రోజూ కోడిగుడ్డు, 100 మి.లీ పాలు. సంపూర్ణ పోషణ ప్లస్ పథకంలో బాలామృతంతో చేసిన లడ్డు/ కేకు 50 గ్రాములు, ప్రతి రోజూ కోడి గుడ్డు, 200 మి.లీ పాలు ఇస్తారు. ప్రతి రోజూ అన్నము, పప్పు, ఆకుకూర, కూరగాయలతో చేసి సాంబారుతో మధ్యాహ్న భోజనం.
రక్తహీనత తగ్గిపోయింది
అంగన్‌వాడీలో నేను పేరు నమోదు చేసుకున్న వెంటనే నాకు అన్నీ ఇచ్చారు. నెలకు సరిపడా పోషకాహారం ఇంటికే పంపారు. పాప కూడా బరువు పెరిగింది. రక్తహీనత తగ్గిపోయింది. మీరు పెట్టిన పథకాలు మా గ్రామంలో అర్హులందరికీ అందుతున్నాయి. అమ్మ ఒడి పథకం వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు. మీ వల్ల మా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటారు. మీకు ధన్యవాదాలు.
– శివమ్మ బాయి, సుగాలి తండా, ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా
ఎన్నో పథకాలు అందుతున్నాయి
నాకు సంపూర్ణ పోషణ ప్లస్ కింద అన్నీ అందడంతో డెలివరీ బాగా జరిగింది. రక్తహీనత సమస్య లేదు. మా లాంటి గిరిజనులకు ఎన్నో పథకాలు అందుతున్నాయి. మా గిరిజనులందరి తరఫున మీకు ధన్యవాదాలు. గతంలో అధికారులు చుట్టూ తిరిగినా పనులు జరిగేవి కావు. ఇప్పుడు గ్రామ సచివాలయం ద్వారా ఏ పని అయినా వెంటనే అవుతుంది. మళ్లీ మళ్లీ మీరే మా ముఖ్యమంత్రిగా రావాలి.
– పల్లాల కరుణమ్మ, రంపచోడవరం, తూర్పుగోదావరి జిల్లా
ఆరోగ్యంగా తల్లీ బిడ్డలు
నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. సంపూర్ణ పోషణ బాబుకు చాలా ఉపయోగపడింది. చురుగ్గా ఉంటున్నాడు. మా గిరిజన ప్రాంతాల్లో మీరు ఇచ్చిన సంపూర్ణ పోషణ వల్ల గర్భిణులు, తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటున్నారు. మంచి ఆహారం అందుతోంది. గొప్ప గొప్ప వారి పిల్లల్లా మా పిల్లలు కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడుతారన్న నమ్మకం వచ్చింది. అంగన్‌వాడీ స్కూళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్స్‌గా మార్చడం ఎంతో మేలు. – శ్రీనాధమణి, గుడివాడ, పాడేరు మండలం, విశాఖపట్నం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment