
సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమాల డొంక కదిలి ప్రధాన ముద్దాయిగా నిరూపణ అయ్యే పరిస్థితి రావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నాడని, అందుకే ‘దళితులపై దమనకాండ’ అంటూ ‘ఈనాడు’లో అడ్డగోలు రాతలు రాస్తున్నాడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున నిప్పులు చెరిగారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ‘దొంగ బాబుకు మద్దతుగా గజదొంగ రామోజీ తన రాతలతో వెర్రి కూతలు కూస్తున్నాడు. ముసుగు దొంగలైన వీరిద్దరికీ ఇబ్బంది వస్తే దళితులు గుర్తొస్తారు.
గతంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ను పక్కదారి పట్టించేందుకు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటును చంద్రబాబు తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు మార్గదర్శి కేసును మళ్లించేందుకు దళితులపై దమనకాండ అంటూ రామోజీ రాస్తున్నారు. రామోజీకి ఈనాడు పేపర్ పెట్టుకున్న ఇన్నేళ్లకు దళితులు గుర్తుకొచ్చారా? చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వెలివేతలు జరిగితే ఈనాడుకు ముచ్చటగా అనిపించాయా? జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసినా ఎందుకు రాయలేదు? అచ్చెన్నాయుడు మహిళను కాలితో తంతే ఏం చేశారు? గరగపర్రులో దళితుల వెలివేత, కారంచేడులో దళితులపై మారణహోమం జరిగినప్పుడు ఎందుకు రాయలేదు? నాడు దళితులపై జరిగిన దమనకాండకు కారకులైన నీ సొంత సామాజికవర్గం గురించి ఇప్పుడు రాయొచ్చు కదా రామోజీ’ అంటూ ప్రశ్నించారు.
‘ఫిల్మ్ సిటీ కోసం దళితుల భూముల్ని కబ్జా చేసినట్లు రామోజీపై ఇప్పటికీ కోర్టుల్లో కేసులు ఉన్నాయి. దళితులను మోసం చేసిన రామోజీ ఇప్పుడు చంద్రబాబుకు రాజకీయ పట్టం కట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. బాబు హయాంలో ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.33,625.49 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపితే దానిలో దేనికోసం ఖర్చుచేశారో? అవినీతి ఎంత జరిగిందో రాసే దమ్ము రామోజీకి ఉందా? అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో దళితుల సంక్షేమానికి రూ.51,293 కోట్లు ఖర్చు చేసింది. డీబీటీ ద్వారా పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులు జమయ్యాయి. ఈ మంచిపై రాయడానికి రామోజీకి చేతులు కదలడంలేదు. బాబు హయాంలో దళితులకు జరిగిన అన్యాయం, సీఎం జగన్ పాలనలో జరుగుతున్న న్యాయంపై చర్చకు మేము సిద్ధం’ అని మంత్రి సవాల్ విసిరారు.
తప్పు చేసింది కాబట్టే ఎమ్మెల్యే శ్రీదేవికి భయం
రాజకీయాల్లో అవకాశం కల్పిం చిన సీఎం జగన్‌ను, వైఎస్సార్‌సీపీని మోసం చేసింది కాబట్టే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి భయపడుతోందని మంత్రి అన్నారు. చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్న ఆమె హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు స్క్రిప్టు చదువుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment