నైపుణ్య శిక్షణకు మైక్రోసాఫ్ట్ | Microsoft for skill training | Sakshi
Sakshi News home page

నైపుణ్య శిక్షణకు మైక్రోసాఫ్ట్

Published Sat, Apr 3 2021 4:06 AM | Last Updated on Sat, Apr 3 2021 8:57 AM

Microsoft for skill training - Sakshi

మాట్లాడుతున్న సతీష్‌చంద్ర

సాక్షి, అమరావతి: విద్యార్థి దశ నుంచే నైపుణ్య శిక్షణను అందించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయాలకు అనుగుణంగా అందులో భాగస్వామ్యం కావడానికి ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్‌చంద్ర వెల్లడించారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సీఎక్స్‌వో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నైపుణ్య శిక్షణకు సంబంధించి ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో పలుమార్లు చర్చలు జరిపామని.. శిక్షణ అందించే కోర్సులను కూడా గుర్తించినట్లు తెలిపారు. సాధారణ రుసుముతో ఏటా 1.60 లక్షల మంది డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనురులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసమే డిగ్రీ సిలబస్‌ను నాలుగేళ్లకు మార్చడమే కాక 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసినట్లు సతీష్‌చంద్ర తెలిపారు. 

ప్రధాన రంగాలతో ఐటీ అనుసంధానం
అంతకుముందు.. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జి. జయలక్ష్మి మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్య, వైద్య, స్మార్ట్‌ సిటీ వంటి ఆరు ప్రధాన రంగాలతో ఐటి అనుసంధానం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచుకోగలుగుతామన్నారు. అలాగే, కోవిడ్‌ తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం పెరుగుతోందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ సమ్మేళనం ద్వారా వ్యక్తమయ్యే అభిప్రాయాలతో కొత్త పాలసీ రూపొందించుకుని ముందుకు వెళ్తామన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరు అయిన వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐటీ వినియోగాన్ని పెంచామని చెప్పారు. రాష్ట్రంలోని 10 వేలకు పైగా రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన కియోస్క్‌లే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఈ–క్రాపింగ్, మార్కెటింగ్‌ వంటి వాటిల్లో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఖర్చులను తగ్గిస్తున్నామని.. డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా వ్యయం తగ్గి రైతులకు లాభాలు పెరిగే అవకాశం ఉందన్నారు. 

కాంటాక్ట్‌లెస్‌ టెక్నాలజీపై అందరి దృష్టి
ఇదిలా ఉంటే.. కరోనాతో కాంటాక్ట్‌ లెస్‌ టెక్నాలజీపై అందరి దృష్టిపడిందని, ఆఫీసుకు వెళ్లకుండానే ఐటి టెక్నాలజీతో ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటుకు అందరూ ఆకర్షితులవుతున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వున్న మానవ వనరులను వినియోగించుకుని సాంకేతికంగా వారిలో నైపుణ్యాన్ని పెంచగలిగితే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా అనంతపురం, తిరుపతి, విశాఖల్లో ఐటీ కాన్సెప్ట్‌ సిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అబ్బయ్యచౌదరి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా ప్రసంగించగా.. 63 కంపెనీల సీఈవోలు, ఎండీలు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement