సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా ఒంటి పూట బడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలని, మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలు నేరుగా ఇళ్లకు వెళ్లాలని తెలిపారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు పూర్తిగా సెలవులు ఇచ్చామన్నారు.
రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి 18 వరకు ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థులు ఉదయం 8.45 నుంచి 9.30 లోపు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు. 9.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు.
ఈ ఏడాది 6 సబ్జెక్టులకు 6 రోజులు పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే ఇన్విజిలేషన్ విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్ల కేంద్రాల్లో ఇతర సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారన్నారు. మొత్తంగా 3,349 కేంద్రాల్లో 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
విద్యా కానుకలో నాణ్యతకు పెద్దపీట
రాబోయే విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుకలో భాగంగా అందించే స్కూల్ బ్యాగ్, బూట్లు, యూనిఫాం తదితర వస్తువులకు సంబంధించి నాణ్యతకు పెద్దపీట వేశామని మంత్రి బొత్స తెలిపారు. ‘గతంలో మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందిస్తున్నాం. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక అందిస్తాం.
జగనన్న గోరుముద్ద పథకం దేశంలోనే ప్రత్యేకం. బాలికల్లో రక్తహీనత నివారణకు వారానికి మూడు రోజులు రాగి జావ, మూడు రోజులు చిక్కి అందిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1000 స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశ పెడుతున్నాం. టీచర్ల ఖాళీలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చాక డీఎస్సీ నిర్వహిస్తాం. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చాక అమలు చేస్తాం’ అని చెప్పారు.
ఈ సమావేశంలో పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యా కమిషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్ సురేష్ కుమార్, సమగ్ర శిక్షా ఎస్‌ఏపీడీ బి.శ్రీనివాసరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి, సమగ్ర శిక్షా ఏఎస్పీడీ, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరక్టర్ డా.కెవీ శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ డైరెక్టర్ (సర్వీసులు) మువ్వా రామలింగం తదితరులు పాల్గొన్నారు.
నిఘా కట్టుదిట్టం
► సమస్యాత్మక కేంద్రాల్లో డీఈవోలు అవసరమైన చోట సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసుకోవాలి.
► ఇప్పటికే అమర్చిన వాటితో పాటు ఈ ఏడాది నూతనంగా 104 పరీక్షా కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు.
► ఎలక్ట్రానిక్స్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదు. సూపరింటెండెంట్‌తో సహా ఇన్విజిలేటర్లు, సిబ్బంది మొబైల్ ఫోన్ తీసుకెళ్లరాదు. పరీక్షా కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు.
► ప్రశ్నాపత్రం బయటకు వెళితే అది ఏ కేంద్రం, ఏ విద్యార్థి, ఏ ఇన్విజిలేటర్ నుంచి వెళ్లిందో కనుక్కునే ఏర్పాట్లు చేశాం.
► విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి రానూపోను హాల్ టికెట్ చూసి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
► దేశంలోనే తొలిసారిగా అంధ విద్యార్థుల కోసం వారే స్వయంగా కంప్యూటర్ పై పరీక్ష రాసేలా ఏర్పాట్లు.
► పరీక్షా కేంద్రాల వద్ద నాడు–నేడు అభివృద్ధి పనులు మధ్యాహ్నం తర్వాతే.
► గతంలో అక్రమాలకు పాల్పడ్డ 75 మంది ఉపాధ్యాయులు ఆయా ఎమ్మార్వో ఆఫీసుల్లో ఉండేలా సర్క్యులర్ ఇచ్చినా, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఉపసంహరణ.
AP: రేపటి నుంచి ఒంటి పూట బడులు
Published Sun, Apr 2 2023 4:04 AM | Last Updated on Sun, Apr 2 2023 7:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment