
చిల్లవారిపల్లి ముఖచిత్రం, ఇన్‌సెట్‌లో కాటికోటేశ్వరస్వామి
సాక్షి, తాడిమర్రి (అనంతపురం): పాలు లీటరు రూ.40 నుంచి రూ.60 దాకా పలుకుతున్న రోజులివి. ఎవరికైనా పాలు కావాలంటే కొనాల్సిందే. కానీ ఆ గ్రామంలో పాలు అమ్మరు.. కొనరు. ఎన్ని కావాలన్నా ఉచితమే. అవును ఇది నిజం. ఆ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం. తాడిమర్రికి ఉత్తర దిశన 23 కిలోమీటర్ల దూరంలో చిల్లవారిపల్లి గ్రామం ఉంది. 400 కుటుంబాలు, 1900మంది జనాభా, 1100 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో దాదాపు 300 పాడి ఆవులు, గేదెలు ఉన్నాయి. ప్రతి రోజూ వందలాది లీటర్ల పాలు ఉత్పత్తవుతాయి. అయితే గ్రామంలో పాడి పశువులు లేని వారికి పాలు అవసరమైతే డబ్బు తీసుకోకుండా ఉచితంగా పోస్తారు.
పాలకుండలో దేవుడు కనిపించాడని..
చిల్లవారిపల్లిలో పూర్వం కాటికోటేశ్వరస్వామి (కాటమయ్య) పాల కుండలో నవ యువకునిగా కనిపించాడని ప్రతీతి. దీంతో గ్రామంలో ఆలయం నిర్మించి స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. మహాశివరాత్రి సందర్భంగా రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. సంక్రాంతి కనుమ పండుగ మరుసటి రోజున గ్రామంలో కాటికోటేశ్వరస్వామిని ఊరేగిస్తారు. దేవుడు పాలకుండలో కన్పించినందున ఆనాటి నుంచి పాలు అమ్మడం కానీ, కొనడం కానీ చేయడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ ఆచారాన్ని విస్మరించి ఎవరైనా పాలు అమ్మితే వారి ఇంటికి అరిష్టం జరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం.
చదవండి: (అర్హతలే భీమవరానికి వరం!)
కోర్కెలు తీర్చే ఇలవేల్పు
కాటికోటేశ్వరస్వామి కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తున్నాడు. కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. మా గ్రామస్తులు కాటికోటేశ్వరస్వామిని తప్ప ఇంకొక స్వామిని ఎరుగరు. కాటికోటేశ్వరస్వామి అంటే గ్రామస్తులకు అపారమైన భక్తి. గ్రామంలో 80 శాతంపైగా పరమశివుని నామాలతోనే పేర్లు ఉండటం విశేషం.
–పీ.పెద్దశివారెడ్డి, సర్పంచ్, చిల్లవారిపల్లి
పాలు అమ్మిందే లేదు
వందల ఏళ్ల నుంచి గ్రామంలో పాలు అమ్మింది లేదు. మా తాత, ముత్తాతల కాలం నుంచి పాలు అమ్మడమనేది చూడలేదు. మాకు 15 పాడి ఆవులు, గేదెలు ఉన్నాయి. ప్రతి రోజూ నాలుగు ఆవులు, ఒక గేదె సుమారు 15 లీటర్ల పాలు ఇస్తాయి. అయినా చుక్క కూడా పాలు, పెరుగు అమ్మం. అడిగిన వారికి ఉచితంగా పోస్తాం.
– పి.బాలమ్మ, వృద్ధురాలు, చిల్లవారిపల్లి
Comments
Please login to add a commentAdd a comment