సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా మొనాజైట్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తాజాగా వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మైనింగ్ డైరెక్టర్ వి.జి. వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2019 నుంచి ఎక్కడా బీచ్ శాండ్ మైనింగ్ జరగడంలేదని స్పష్టంచేశారు. అసలు మైనింగ్ ఆపరేషన్స్ జరగనప్పుడు మొనాజైట్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో 2019కి ముందు రెండు ప్రైవేటు సంస్థలు బీచ్ శాండ్ మైనింగ్ కార్యక్రమాలు నిర్వహించాయని.. 2019లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో హెవీ మినరల్ బీచ్ శాండ్ మైనింగ్ పూర్తిగా నిలిపివేశామన్నారు. ఇటీవల బీచ్ శాండ్ మైనింగ్‌లో అక్రమాలంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర గనుల శాఖను అణు ఇంధన శాఖ కోరిందని తెలిపారు. ఐబీఎం విచారణలో ఆ సంస్థలు మైనింగ్ నిర్వహించిన కాలంలో ఏవైనా అక్రమాలకు పాల్పడి ఉంటే అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. అక్రమాలు వాస్తవమని నిర్ధారణ జరిగితే బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఆ రెండింటి అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు
ఇక బీచ్ శాండ్ మైనింగ్ కోసం గత ఏడాది కేంద్ర అణుశక్తి సంస్థ (డీఏఈ)కు ఏపీఎండీసీ 16 ప్రతిపాదనలను సమర్పించిందని వెంకటరెడ్డి తెలిపారు. దానిలో విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో 90.15 హెక్టార్లు, కృష్ణాజిల్లా మచిలీపట్నం తీరప్రాంతంలో 1,978.471 హెక్టార్లలో రెండు బీచ్ శాండ్ డిపాజిట్లకు ఏపీఎండీసీని ప్రాస్పెక్టివ్ లెస్సీగా డీఏఈ నియమించిందని తెలిపారు. ఇక్కడ మైనింగ్ జరిపేందుకు అనుమతుల కోసం ఏపీఎండీసీ దరఖాస్తు చేసుకుందన్నారు. అయితే, ఆ అనుమతుల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంవల్ల కేంద్రం ప్రతిపాదించిన ఈ రెండు బ్లాక్‌లలో ఇప్పటివరకు ఎటువంటి మైనింగ్ ప్రారంభం కాలేదని ఆయన స్పష్టంచేశారు.
హెవీ మినరల్ బీచ్ శాండ్‌లో మొనాజైట్ అవశేషాలు జీరో శాతం మాత్రమే ఉండాలని, అంతకుమించి ఉన్నట్లు నిర్ధారణ అయితే సదరు మైనింగ్ లీజులను రద్దుచేయాలంటూ కేంద్రం 2019 మార్చి ఒకటిన మెమో ద్వారా రాష్ట్రానికి ఆదేశాలు ఇచ్చిందన్నారు. దాని ప్రకారం మన రాష్ట్రంలోని బీచ్ శాండ్‌లో మొనాజైట్ శాతం కేంద్రం నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా ఉన్నందున అన్ని బీచ్ శాండ్ లీజులను గనుల శాఖ రద్దుచేసిందని వెంకటరెడ్డి ఆ ప్రకటనలో వివరించారు.
కేంద్రానికి ఏపీ సమగ్ర వివరణ
ఇక బీచ్ శాండ్ మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వం తాజాగా వ్యక్తంచేసిన సందేహాల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 12న కేంద్ర అణు ఇంధన శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గనుల శాఖ ద్వారా సమగ్ర వివరణ ఇచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ జరుగుతోందని, దాని ద్వారా పర్యావరణానికి నష్టం, మైనింగ్ చట్టాలకు విఘాతం, మొనాజైట్ అక్రమ రవాణా జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేంద్రానికి సమర్పించిన నివేదికలోనే స్పష్టంచేసిందని వెంకటరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment