
సాక్షి, అమరావతి: జగనన్న కాలనీల్లో అవినీతి జరిగినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధారాలతో నిరూపించగలరా? అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. అవినీతి జరిగిందని నిరూపిస్తే తల దించుకోవడానికి తాను సిద్ధమని ప్రకటించారు. జగనన్న కాలనీల్లోకి రావద్దంటూ లబ్ధిదారులైన అక్కచెల్లెమ్మలు నీ పార్టీ నేతలు, కార్యకర్తలకు చీవాట్లు పెడుతుండటం కళ్లకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ‘మీకు వాస్తవాలు చెప్పేందుకు మావాళ్లు వచ్చేవాళ్లు.. కానీ నిన్ను అడ్డుకున్నామని నిందలు మోపుతావనే ఆగాం’ అని పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వైఎస్సార్ బాటలో మహాయజ్ఞం
వైఎస్సార్ బాటలోనే రాష్ట్రంలోని పేదలందరి సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసే మహాయజ్ఞాన్ని సీఎం జగన్ చేపట్టారని బొత్స తెలిపారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలకు భూమి కొనుగోలు, సదుపాయాల కల్పనకు ఇప్పటిదాకా రూ.15 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. జగనన్న కాలనీల్లో ప్రభుత్వం రూ.15 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని పవన్ కళ్యాణ్ ఆరోపించడం ఆయన అజ్ఞానం, అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. ప్రజలు నువ్వు ఏది చెబితే అది నమ్మేందుకు నువ్వేమైనా యుగపురుషుడివా? అని నిలదీశారు. దాదాపు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 71,813 ఎకరాల భూమిని సేకరించామని, ఇందులో 25 వేల ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.11 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని బొత్స తెలిపారు. భూమి చదును చేయడానికి, విద్యుత్, నీటి సౌకర్యం, అంతర్గత రహదారులు లాంటి సదుపాయాల కోసం ఇప్పటివరకూ రూ.నాలుగు వేల కోట్ల మేర ఖర్చు చేశామన్నారు. జగనన్న కాలనీల్లో ఖర్చు చేసిందంతా వైఎస్సార్‌సీపీ నేతలు కాజేశారని నువ్వు ఆరోపిస్తే నమ్మడానికి ప్రజలేమైనా చెవిలో పువ్వులు పెట్టుకున్నారనుకుంటున్నావా? అని పవన్‌ను నిలదీశారు.
ఏ ఒక్కరైనా చెప్పారా?
విజయనగరం జిల్లాలోని గుంకలాం వద్ద 400 ఎకరాల్లో 12 వేల ఇళ్ల స్థలాలను సిద్ధం చేసి పది వేల మందికి పట్టాలను సీఎం జగన్ పంపిణీ చేశారని బొత్స గుర్తు చేశారు. రాష్ట్రంలోని అతిపెద్ద లే అవుట్లలో ఇది రెండోదన్నారు. అక్కడకు వెళ్లిన పవన్ వద్దకు ఏ ఒక్క లబ్ధిదారుడూ రాలేదని, ఆయన వెంట ఉన్నది అభిమానులు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ లేవుట్‌లోని భూమి కొనుగోలులో అవినీతి జరిగిందని, సదుపాయాల కల్పన పనుల్లో అక్రమాలు జరిగాయని, ఇంటి బిల్లుల చెల్లింపు కోసం కమీషన్లు అడిగారని ఏ ఒక్కరితోనైనా చెప్పించగలవా? అని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. 21 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు అత్యంత పారదర్శకంగా రూ.7,700 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. అవినీతి జరగడానికి అధికారంలో ఉన్నది నీ పార్ట్‌నర్ చంద్రబాబు కాదు.. ఇది వైఎస్ జగన్ ప్రభుత్వమని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తైతే రాష్ట్రంలో కొత్తగా 17,005 గ్రామాలు, పట్టణాలు ఆవిష్కృతమవుతాయని చెప్పారు.
ఆ అవసరం మాకేముంది?
జగనన్న కాలనీలను పరిశీలించేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తనపై వైఎస్సార్‌సీపీ నేతలు ఢిల్లీలో ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదమని మంత్రి బొత్స చెప్పారు. ‘నీపై మేం ఫిర్యాదులు చేయడానికి నువ్వేమైనా పెద్ద పుడింగివనుకుంటున్నావా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘నీపై ప్రధానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం మాకేముంది? నీ గుణాలన్నీ మాకు ఆపాదిస్తే ఎలా’ అంటూ ధ్వజమెత్తారు. ‘ఏదో నీ పార్ట్‌నర్‌కు ఇచ్చిన కాల్షీట్ ప్రకారం రాష్ట్రానికి వచ్చిపోయే నీకు మా మాదిరిగా ప్రజాసేవ చేయాలనే ఆలోచనలు వస్తాయని అనుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. క్రేన్లు కట్టి లేపినా చంద్రబాబు నిలబడే పరిస్థితి లేదన్నారు.
ఉక్కు ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం
రాష్ట్ర ప్రయోజనాలే తమకు ప్రధానమని, రాజకీయ ప్రయోజనాలు కాదని ప్రధాని మోదీ సమక్షంలో చెప్పడం ద్వారా సీఎం జగన్ మంచి సందేశం ఇచ్చారని బొత్స పేర్కొన్నారు. సింగరేణిలో కేంద్ర వాటా 49 శాతం, తెలంగాణ వాటా 51 శాతం ఉంది కాబట్టే ప్రైవేటీకరణ తమ చేతుల్లో లేదని మోదీ చెప్పారని బొత్స పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పూర్తి వాటా కేంద్రానిదేనన్నారు. ప్రభుత్వ రంగంలోనే లాభాల బాటలో నడిపేలా సీఎం వైఎస్ ప్రత్యామ్నాయ మార్గాలను ప్రధానికి సూచించారని, ప్రైవేటీకరణకు తాము పూర్తి వ్యతిరేకమని తేల్చి చెప్పారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన..
ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన చేయడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని మంత్రి బొత్స చెప్పారు. కొన్ని దుష్ట శక్తులు సాంకేతిక కారణాలను అడ్డం పెట్టుకుని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి మార్గం సుగమమైనట్లే ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేస్తున్న యజ్ఞం సఫలమవుతుందని స్పష్టం చేశారు.
బీజేపీతో కాపురం.. బాబుతో పొత్తా?
బీజేపీతో కాపురం చేస్తూ చంద్రబాబుతో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ అర్రులు చాస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి బొత్స చెప్పారు. ప్రజలు తమను చొక్కా పట్టుకుని నిలదీసేందుకు తామేమైనా పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ నేతల్లా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నామా? అని ప్రశ్నించారు. జనసేన రాజకీయ పార్టీనే కాదని, అది ఓ సెలబ్రిటీ పార్టీ అని పునరుద్ఘాటించారు. తమను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటారేమోనని పవన్ కళ్యాణ్ ఆరోపించడాన్ని చూస్తే అధిక శాతం సీట్లలో ఆయన పార్ట్‌నర్ పోటీ చేస్తారని సంకేతాలిస్తున్నట్లుగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment