సాక్షి, తాడెపల్లి: సీఎం జగన్ పరిపాలన మహిళా సాధికారతే లక్ష్యంగా జరుగుతోందని పౌర సరఫరాల శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. మహిళా స్వావలంబనతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అనేక మంది సంఘ సంస్కర్తల ఆలోచనల సమ్మిళతమే జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసినా చెప్పింది చేసే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.
ఫిబ్రవరి 16వ తేదీన నాల్గవ విడత చేయూత పంపిణీ చేస్తామని మంత్రి చెల్లుబోయిన వేణు వెల్లడించారు. 26,98,931 మందికి 5వేల 60 కోట్ల 4 లక్షలు చేయూత పంపిణీకి ఆమోదం లభించినట్లు చెప్పారు. చేయూత పథకంపై ప్రతిపక్షాలు చేసేవన్నీ అసత్య ప్రచారాలేనని తెలిపారు. రూ.19,188 కోట్లను నాలుగు విడతల్లో చేయూత కింద అందించామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
డీఎస్సీ నిర్వహణకు 6,100 పోస్టులతో కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. 2019 నుంచి విద్యారంగంలో 14,219 పోస్టుల భర్తీ చేశామని చెప్పారు. యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంచినట్లు తెలిపారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. 2019 నుంచి 2 లక్షల 13 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని వెల్లడించారు.
ఎస్‌సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యం
ఎస్‌సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినేట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదివే ఐబీని ఏపీ విద్యావ్యవస్థలోకి తీసుకురానున్నామని చెప్పారు. ఈ ఐబీ విద్యతో మన విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటారని తెలిపారు. ఈ విధానంతో విద్యార్థుల కమ్యునికేషన్ స్కిల్స్ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతాయని అన్నారు. ఉపాధ్యాయ, విద్యాశాఖ అధికారులకు కూడా ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. ఐబీ విద్యతో విప్లవాత్మక మార్పులు ఉంటాయని మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు.
నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మెగా డీఎస్సీకి గ్రీన్‌సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment