
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు ఏడాది పాలన ప్రతిపక్షాలపై కక్ష సాధింపుతోనే గడిచిపోయిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో జూన్ 4న నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యకర్మం పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిన బాబు తీరును నిరసిస్తూ వెన్నుపోటు దినం నిర్వహిస్తామన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు... ఇష్టారీతిన అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు నట్టేట ముంచుతున్నారన్నారు.
తిరుపతి: ఎన్నికల హామీలపై కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని వైస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం పోస్టర్‌ను భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష విడుదల చేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక అరాచకాలు, హత్యలు, అన్యాయాలు చేస్తూ.. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ మండిపడ్డారు.
‘‘వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై 800 మందిపై హత్య రాజకీయాలు చేశారు. 370 మంది పైగా చనిపోయారు. కూటమి నేతలు ప్రతి నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పడు కేసులు బనాయిస్తున్నారు. లిక్కర్ కేసు ద్వారా తప్పుడు కేసులు పెట్టి, నెలలు తరబడి జైల్లో పెట్టారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అనాగరిక, అరాచక పాలన సాగిస్తోంది
..ఏడాది కాలంగా ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. గత మూడు నెలలు కాలంలో మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీపీ ఎన్నికలు ద్వారా బల ప్రయోగం ద్వారా లాక్కొన్నారు. రాష్ట్ర ప్రజలు అంతా అసంతృప్తితో ఉన్నారు. జూన్ 4 వ తేదీ వెన్నుపోటు దినgగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీ చేపడతాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిరసన ర్యాలీలో ప్రజలు అందరూ స్వచ్చందంగా పాల్గొంటారు. కూటమి పాలనపై ప్రజలు అందరూ ఆగ్రహంతో ఉన్నారు’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.